Begin typing your search above and press return to search.

మరో విద్యార్థిని బాలి తీసుకున్న నారాయణ సంస్థ..

By:  Tupaki Desk   |   26 Feb 2020 12:48 PM GMT
మరో విద్యార్థిని బాలి తీసుకున్న నారాయణ సంస్థ..
X
కారణాలు ఏవైనా కానీ - కార్పొరేట్ కాలేజీలు విద్యార్థుల మరణాలకు కేరాఫ్ గా మారుతున్నాయి. ప్రతి ఏడాది కార్పొరేట్ స్కూల్స్ - కాలేజ్ లో చదివే విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. పరీక్షల ఒత్తిడి ఒకవైపు , ఇంట్లోవారి ఒత్తిడి మరోవైపు - అలాగే కాలేజ్ యాజమాన్యం ఒత్తిళ్లు మరోవైపు ..వీటన్నింటిని తట్టుకోలేని కొందరు విద్యార్థులు తమ జీవితాన్ని మొగ్గలోనే తుంచేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే పటాన్‌ చెరు వెలిమెల నారాయణ కాలేజ్ లో జరిగింది.

మంగళవారం వెలిమల నారాయణ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం చదువుతున్న సంధ్యారాణి అనే విద్యార్థిని బాత్‌ రూమ్‌ లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే కళాశాల యాజమాన‍్యం వేధింపుల వల్లే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందంటూ బుధవారం విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. విద్యార్థిని మృతదేహాన్ని పోలీసులు పటాన్‌ చెరు ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించి భద్రపరిచారు. అయితే విద్యార్థి సంఘాల నాయకులు సంధ్యారాణి మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రుల అనుమతితో కాలేజీకి తరలించి నిరసన చేపట్టాలని భావించారు.

విద్యార్థి సంఘాల నాయకులు, సంధ్య తల్లిదండ్రులు ఈరోజు పటాన్‌ చెరు ప్రభుత్వ ఆస్పత్రి తాళం పగులగొట్టి సంధ్యారాణి మృతదేహం తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. విద్యార్థి సంఘాలు - యువతి తల్లిదండ్రులు మృతదేహం తీసుకొని గేటు వద్దకు వస్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అప్పటికే కూతురిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తండ్రిని పోలీసులు బూటు కాళ్లతో తన్నుకుంటూ వెళ్లిపోయారు. అయితే , కూతురు మరణంతో బాధలో ఉన్న తల్లిదండ్రులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శల వర్షం కురుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం గర్వంగా చెప్పుకునే ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ అంటే ఇదేనా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ..దర్యాప్తు చేస్తున్నారు.