Begin typing your search above and press return to search.

సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా మ‌రో తెలుగు వ్య‌క్తి!

By:  Tupaki Desk   |   27 Aug 2021 9:30 AM GMT
సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా మ‌రో తెలుగు వ్య‌క్తి!
X
దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం.. సుప్రీం కోర్టుకు మ‌రో తెలుగు వ్య‌క్తి ప్ర‌ధాన న్యాయ‌మూర్తి అయ్యే అవ‌కాశం ఉందా? ఇప్ప‌టికే కోకా సుబ్బారావు.. త‌ర్వాత‌.. దాదాపు 50 ఏళ్ల‌కు ప్ర‌స్తుత సీజే ఎన్వీ ర‌మ‌ణ‌.. తెలుగు గ‌డ్డ నుంచి సుప్రీం కోర్టులో చీఫ్ జ‌స్టిస్ అయ్యారు. మ‌రి ఈయ‌న త‌ర్వాత‌.. ఎవ‌రు? అనే ప్ర‌శ్న‌.. ఉత్ప‌న్న‌మైన ప్పుడు.. నిజానికి అప్ప‌ట్లో ఎవ‌రూ క‌నిపించ‌లేదు. క‌నుచూపు మేర‌లో ఎవ‌రూ లేర‌నే స‌మాధానం కూడా వ‌చ్చింది. అయితే.. ఇప్పుడు ప‌రిస్థితి మారింది. తెలుగు ప్రాంతానికి చెందిన సీనియ‌ర్ న్యాయ‌వాది.. ప్ర‌స్తుతం సుప్రీ కోర్టు న్యాయ‌మూర్తిగా త్వ‌ర‌లోనే బాధ్య‌త‌లు చేప‌ట్టనున్నారు.

ఈ నేప‌థ్యంలో కొన్నాళ్ల‌కు ఆయ‌నే సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి అయ్యే అవ‌కాశం ఉంద‌ని.. అంచ‌నా వేస్తున్నారు. విష‌యంలోకి వెళ్తే.. సుప్రీం కోర్టులో న్యాయ‌మూర్తుల కొర‌త తీర్చేందుకు.. తాజాగా నియామ‌కాలు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా.. అత్యున్న‌త కోర్టు.. ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా.. జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత‌.. కేసుల‌ను స‌త్వ‌ర‌మే తేల్చేందుకుప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న న్యాయ‌మూర్తుల కొర‌త‌ను అధిగ‌మించేలా చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ నేప‌థ్యంలో తాజాగా సుప్రీంకోర్టుకు ముగ్గురు మహిళా న్యాయమూర్తులు సహా 9 మందిని నియమించాలంటూ సుప్రీం కొలీజియం సిఫార‌సు చేసింది

ఈ సిఫారసులను రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ ఆమోదించారు. కొత్త‌గా నియ‌మితుల‌య్యేవారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పీఎస్‌ నరసింహ‌.. ఉన్నారు. ఈయ‌న సీనియ‌ర్ మోస్ట్ న్యాయవాది. దేశంలో సంచలనం సృష్టించిన అనేక కేసుల‌ను ఆయ‌న వాదించి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా అయోధ్య కేసు ప్రధానమైనది. ఈ క్ర‌మంలోనే నేరుగా ఆయ‌న‌ను సుప్రీం జడ్జిగా నియమించేందుకు సిఫార‌సు చేశారు. దీనికి రాష్ట్ర‌ప‌తి కూడా ఓకే చెప్ప‌డంతో త్వ‌ర‌లోనే ఆయ‌న ఈ ప‌ద‌విని అలంక‌రించ‌నున్నారు. ఇలా గతంలో 8 మంది నేరుగా సుప్రీంకోర్టు జడ్జిలయ్యారు.

ఇదిలావుంటే, నరసింహ‌కు సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి అయ్యే అవ‌కాశం ఉంద‌ని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే.. దీనికి కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని అంటున్నారు. మ‌రోవైపు.. సీనియారిటీ ప్రకారం జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ నాగరత్నకు సీజేఐ అయ్యే అవకాశాలున్నాయి. ఒకేసారి ముగ్గురు మహిళా న్యాయమూర్తులను సుప్రీం జడ్జీలుగా నియమించడం ఇదే తొలిసారి కాగా.. 2027లో జస్టిస్‌ నాగరత్న దేశానికి తొలి మహిళా సీజేఐ కానున్నారు. కొత్త జడ్జిలు ఈ నెల 31న ప్రమాణ స్వీకారం చేస్తారు.