Begin typing your search above and press return to search.

విశాఖ ఉక్కు త్యాగాల కొలిమిలోంచి పుట్టింది.. అమ్మేస్తామంటే కుద‌ర‌దు.. టాలీవుడ్‌ హీరో!

By:  Tupaki Desk   |   21 Feb 2021 4:40 PM IST
విశాఖ ఉక్కు త్యాగాల కొలిమిలోంచి పుట్టింది.. అమ్మేస్తామంటే కుద‌ర‌దు.. టాలీవుడ్‌ హీరో!
X
ఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని ప్రైవేటీక‌రించేందుకు కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కార్మిక సంఘాలు, పార్టీలు ఆందోళ‌న కొన‌సాగిస్తున్నాయి. ఈ క్రమంలో.. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి ఓ హీరో కూడా ఆందోళ‌న‌ల‌కు మ‌ద్ద‌తు ప‌లికారు.

యంగ్ హీరో నారా రోహిత్ కార్మిక పోరాటానికి త‌న మద్దతు ప్ర‌క‌టించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు రోహిత్‌. ఉద్య‌మానికి ఫేస్ బుక్ వేదిక‌గా మ‌ద్ద‌తు తెలిప‌డ‌మే కాకుండా.. అంద‌రూ పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా భావోద్వేగ‌మైన పోస్టు రాశారు రోహిత్‌.

“కూల్చడానికది ఆవాసం కాదు.. అంగట్లో అమ్మడానికది వస్తువూ కాదు.. త్యాగాల కొలిమి నుంచి ఉద్భవించిన కర్మాగారం మన విశాఖ ఉక్కు. ఆంధ్రులు త్యాగధనులు కాబట్టే ఉక్కు పరిశ్రమ స్థాపనకు 22 వేల ఎకరాలు రాసిచ్చారు. 64 గ్రామాలను ఆనందంగా ఇచ్చేశారు. 32 మంది తృణప్రాయంగా ప్రాణత్యాగం చేశారు. అలాంటి ఉక్కు పరిశ్రమ ఉనికి నేడు ప్రమాదంలో పడుతోంది..” అని రాశారు.

ఇంకా పోస్టును కొన‌సాగించారు “ఆంధ్రుడా మేలుకో.. 60వ దశాబ్ధంలో పోరాడి సాధించుకున్న ఉక్కు పరిశ్రమ 21వ శతాబ్ధంలో ప్రమాదంలో పడింది. సమిష్టి కృషితో 50 ఏళ్లకు పైబడి అభివృద్ధి చేసుకున్న కార్మికుల శ్రమ శ్వేదం ప్రైవేటు పరం చేయడమేనా మన సాధించిన అభివృద్ధి? ప్రజాస్వామ్య కార్యక్షేత్రంలో పిడికిలి బిగిద్దాం. గొంతు పెగలించి విశాఖ ఉక్కు ఆంధ్రుడి హక్కు అని నినదిద్దాం.” అంటూ ఎమోషనల్‌గా పోస్ట్ చేశారు నారా రోహిత్‌. ఆయ‌న చేసిన ఈ పోస్టు వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లు ఆయ‌న‌కు మ‌ద్ద‌తుకుగా కామెంట్లు చేస్తున్నారు.