Begin typing your search above and press return to search.

నెటిజన్లపై లోకేశ్ బాబు సైబర్ వార్

By:  Tupaki Desk   |   18 April 2017 6:52 AM GMT
నెటిజన్లపై లోకేశ్ బాబు సైబర్ వార్
X
దేశంలో మీడియా రాజకీయ పార్టీలకు తొత్తుగా మారిపోయినా సోషల్ మీడియా మాత్రం నిఖార్సుగా నిలుస్తోంది. ఎక్కడ ఏ చిన్న తేడా జరిగినా చీల్చి చెండాడేస్తోంది. ఒక్కోసారి ఇందులోనూ వైపరీత్యాలు ఉంటున్నా సోషల్ మీడియా కంటికి చిక్కకుండా తప్పించుకోవడం ఏ నేతకూ సాధ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ సీఎం తనయుడు - మంత్రి లోకేశ్ కూడా సోషల్ మీడియా బాధితుడిగా మారారు. ఆయన్ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ సెటైర్లు పడుతుంటాయి. ఏపీ టీడీపీ నేతలు - మంత్రుల్లో అందరి కంటే ఎక్కువగా లోకేశ్ - నారాయణలపైనే నెటిజన్లు మండిపడుతున్నారు. ఏకిపడేస్తున్నారు. అయితే.... ఈ పరిస్థితిని చూసి నారాయణ లైట్ గా తీసుకుంటున్నా లోకేశ్ మాత్రం ఎంతమాత్రం సహించలేకపోతున్నారు. ఎలాగైనా దీన్ని అడ్డుకోవాలంటూ ఐటీశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇటీవల వివిధ సందర్భాల్లో లోకేష్ నోరు జారడం - ఆ విషయాలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రసంగిస్తూ అందరికీ అంబేద్కర్ వర్ధంతి శుభాకాంక్షలు అని లోకేష్ వ్యాఖ్యానించడంతో నెటిజన్ లు ఏకిపడేశారు. ఈ నేపథ్యంలో వెలగపూడి సచివాలయంలో ఐటీ ఉన్నతాధికారులతో లోకేష్ సమీక్ష జరిపారు. తన ప్రసంగంలో దొర్లిన తప్పులపై నెటిజన్లు రెస్పాండవడంపై ఆయన సీరియస్ అయ్యారు. వెంటనే వాటిని నిరోధించాల్సిందిగా ఐటీ శాఖ అధికారులను ఆదేశించారు.

నెటిజన్లకు అడ్డుకట్టవేయకపోతే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని ఐటీ అధికారులకు లోకేష్ సూచించారట. నెటిజన్ లు షేర్ చేస్తున్న పేరడీ వీడియోలను - ఫొటోలను సేకరించాలని… వాటిని పోస్టు చేసిన వారికి నోటీసులు పంపాలని.. నోటీసులకు సమాధానం రాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా సూచించారట. ఇదంతా విన్న ఐటీ అధికారులు బయటకు ఏమీ అనలేకపోయినా లోలోన మాత్రం కామెంట్లు చేస్తున్నారట. ఒకటా రెండా వేల కొద్దీ పోస్టింగులు ఉంటున్నాయని... ఎన్ని వేలమందిని ట్రేస్ చేస్తాం... ఎన్ని వేలమందిని అరెస్టు చేస్తాం?ఇదంతా సాధ్యమయ్యే పనేనా అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/