Begin typing your search above and press return to search.

నోటీసులు కోసమే చినబాబు ఎదురు చూస్తున్నారట..!

By:  Tupaki Desk   |   1 July 2015 10:22 AM IST
నోటీసులు కోసమే చినబాబు ఎదురు చూస్తున్నారట..!
X
ఏపీ ముఖ్యమంత్రి కుమారుడు దూకుడు పెంచారు. ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్‌కు బెయిల్‌ రావటం.. ట్యాపింగ్‌ ఉదంతంలో తెలంగాణ సర్కారుకు సంబంధం ఉందంటూ ఏపీ అధికారులు చెబుతున్న మాటలు ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచినట్లుగా కనిపిస్తోంది.

గతంలో ఏపీ ముఖ్యమంత్రి ఢిల్లీ స్థాయి నాయకుడని.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ గల్లీ స్థాయి నాయకుడని.. కేసీఆర్‌ గల్లీ రాజకీయాలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేయటం.. దీనిపై తెలంగాణ అధికారపక్షం తీవ్రస్థాయిలో విరుచుకుపడటం తెలిసిందే. ఆ తర్వాత మౌనంగా ఉన్న లోకేశ్‌ మంగళవారం మళ్లీ పలు అంశాల్ని ప్రస్తావించారు. ఏ విషయాన్ని తెగే వరకూ లాగకూడదన్న లోకేశ్‌ (ఇది ట్విట్టర్‌లో పవన్‌ డైలాగ్‌ కదా?).. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకునే రకం కేసీఆర్‌దని విమర్శించారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ భయం లేకుంటే..తెలంగాణ సర్కారు హోంశాఖ కార్యదర్శిని ఎందుకు మార్చిందని ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ దీర్ఘకాలిక సెలవుపై ఎందుకు వెళ్లారని ప్రశ్నించిన లోకేశ్‌.. ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ సర్కారుకు తమకు నోటీసులు ఇస్తే.. తమ నెత్తి మీద పాలు పోసినట్లేనని.. తమకు నోటీసులు ఇవ్వాలనే కోరుకుంటున్నామని.. వాటికోసమే ఎదురు చూస్తున్నట్లు వ్యాఖ్యానించారు. లోకేశ్‌ మాటల దూకుడు చూస్తున్న వారు మాత్రం ట్యాపింగ్‌ వ్యవహారంలో తెలంగాణ సర్కారు చిక్కుకుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.