Begin typing your search above and press return to search.

కేబుల్ వైర్ల కటింగ్..చినబాబు పైనే అనుమానాలు

By:  Tupaki Desk   |   27 Dec 2017 10:52 PM IST
కేబుల్ వైర్ల కటింగ్..చినబాబు పైనే అనుమానాలు
X
ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఫైబర్ నెట్ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా రాష్ర్టంలో ఆరు చోట్ల కేబుళ్లు కట్ చేయడం సంచలనం రేపింది. అమరావతిలో ఈరోజు ఏపీ ఫైబర్ నెట్ ను రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ప్రారంభించగా... ఆ కార్యక్రమాన్ని ఫైబర్ నెట్ ద్వారా ప్రజలకు చేరేలా చేశారు. కానీ... తూర్పు గోదావరి జిల్లాలో కొందరు ఇంటర్ నెట్ ఫైబర్ కేబుల్ ను కట్ చేశారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో ప్రసారానికి అంతరాయం ఏర్పడినా వెంటనే దాన్ని సరిదిద్దారు.

అయితే... ఈ సంఘటనపై మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు ఫోన్ చేసి ఆయన మాట్లాడారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని, ఇందుకు కారకులైన వారికి శిక్షపడేలా చూడాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలను తక్కువ ధరకే అందిచేందుకు ప్రభుత్వం పాటుపడుతుంటే - ఇలాంటి ఘటనలకు పాల్పడటం చట్టరీత్యా నేరమని - అటువంటి వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని అన్నారు.

కాగా టీడీపీ నేతలు కొందరు ఈ కేబుళ్లు కోయడం వెనుక రాజకీయ ప్రత్యర్థులున్నారన్న ఆరోపణలు కూడా చేస్తున్నారట. దానికి కౌంటర్‌గా విపక్ష నేతలు కూడా అంతేస్థాయిలో సమాధానమిస్తున్నారు. అసలు లోకేశే ఇదంతా చేయించి ఉంటారంటూ ప్రతి విమర్శలు చేస్తున్నారు. గతంలో మహానాడు సమయంలో జరిగిన ఘటనను గుర్తు చేస్తున్నారు. ఇంతకుముందు హైదరాబాద్‌లో మహానాడు జరిగినప్పుడు ఆ కార్యక్రమంలో కరెంట్ పోయింది.. కానీ, లోకేశ్ దానికి అప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని నిందించారు. ‘ఇక్కడి సీఎం విద్యుత్ ఇవ్వడం లేదు..విద్యుత్ కోత ఎలా ఉందో చూడండి’ అంటూ వెటకారమాడారు. కానీ.. ఆ తరువాత, తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అసలు విషయం చెప్పడంతో లోకేశ్ బండారం బయటపడింది. మహానాడులో మైకు సహా స్టేజీపై ఉన్న ఇతర పరికరాలకు డీజిల్ జనరేటర్ ద్వారా విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేసుకున్నారని, తమ కనెక్షన్‌ను వాడుకోలేదని టీఎస్‌ ఎస్‌ పీడీసీఎల్ అప్పట్లో దీనిపై అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. దాంతో లోకేశే పనిగట్టుకుని వాస్తవాలు దాచి అలా తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారంటూ విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా అలాంటిదేమైనా జరిగిందా అన్న అనుమానాలను పలువురు వ్యక్తంచేస్తున్నారు.