Begin typing your search above and press return to search.

లోకేష్ కోసం షార్ట్‌ క‌ట్ దొరికింది

By:  Tupaki Desk   |   16 Oct 2016 11:30 AM GMT
లోకేష్ కోసం షార్ట్‌ క‌ట్ దొరికింది
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు - తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మంత్రి ప‌ద‌వి చేప‌ట్ట‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ఏపీ మంత్రివర్గ మార్పుల్లో లోకేష్‌ కు స్థానం కల్పించే దిశగా గతంలోనే వ్యూహం సిద్దం చేశారు. కార్యకర్తలు - నాయకుల వైపు నుంచి అధిష్టానం మీద ఒత్తిడి వచ్చేలా పథకాలు అమలు చేశారు. అయితే స‌డ‌న్‌ గా అవి వాయిదా ప‌డిన‌ప్ప‌టికీ తాజాగా జ‌రిగిన ప‌రిణామంతో లోకేష్‌ కు అమాత్య ప‌ద‌వి ఖాయ‌మ‌ని, అది కూడా షార్ట్ క‌ట్ ద్వారా ద‌క్కుతుంద‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు.

ఇటీవ‌ల జ‌రిగిన పార్టీ మూడ్రోజుల శిక్షణా కార్యక్రమాల్లో కూడా లోకేష్‌ మంత్రిపదవి ఓ ప్రధాన ప్రచారాంశంగా మారింది. తొలి రెండ్రోజులు లోకేష్ ఈ కార్యక్రమాలకు హాజరుకాక‌పోగా....మూడోరోజూ వచ్చీ రావడంతోనే ఆయనే సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌ గా మారారు. పైగా లోకేష్‌ సమక్షంలోనే పలువురు మంత్రులు - ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవి అంశాన్ని చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. ఇలా క్షేత్రస్థాయి నుంచి పరిస్థితుల్ని తనకనుకూలంగా మలచుకున్నప్పటికీ చివరి నిమిషంలో మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణను చంద్రబాబు వాయిదావేశారు. లోకేష్‌ కు మంత్రిపదవిస్తే ఆరుమాసాల్లోగా ఆయన చట్టసభలకు ఎన్నికావాల్సుంది. అయితే ఇప్పటికిప్పుడు ఉపఎన్నికలు జరిపేందుకు శాసనసభా స్థానాలేవీ ఖాళీలేవు. అదే స‌మ‌యంలో లోకేష్‌ కోసం తమ పదవుల్ని వదులుకునేందుకు ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు సిద్దపడ్డారు. ఒకరైతే రాజీనామా పత్రాన్ని కూడా రాసి చంద్రబాబుకు అందించారు. కానీ ఇలా బలవంతంగా ఖాళీ చేయించిన స్థానం నుంచి లోకేష్‌ ను బరిలో దింపడం - దీనివల్ల లేనిపోని విమర్శల్ని మూటగట్టుకోవాల్సిన పరిస్థితి వ‌స్తుంద‌ని గ‌మ‌నించారు. ఈ నేప‌థ్యంలో మండలి ఎన్నికల బరిలో లోకేష్‌ ను దింపాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం.

ఆరుమాసాల్లోగా వస్తున్న మండలి ఎన్నికల్లో లోకేష్‌ ను బరిలో దింపాలన్న ఆలోచనను చంద్రబాబు తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేశారని స‌మాచారం. పట్టభద్రులు - ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఫిబ్రవరిలోగా జరగాల్సి ఉన్న నేప‌థ్యంలో ఇప్పటికే ఓటర్ల నమోదు ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇందులో పట్టభద్రుల స్థానం నుంచి లోకేష్‌ ను బరిలో దింపడం ద్వారా చట్టసభల్లోకి తీసుకురావాలన్న యోచనకు పార్టీ అధిష్టానం వచ్చినట్లు తెలుస్తోంది. పట్టభద్రుల నియోజకవర్గమైతే పెద్ద సంఖ్యలో ఓటర్లుంటారు. అందరూ విద్యాధికులే ఉంటారు కాబ‌ట్టి వారి తరపున గెలుపొందడం ద్వారా ఓ ప్రత్యేకత సంతరించుకుంటుంది. మేదావి వర్గ ప్రతినిధిగా చట్టసభలో అడుగు పెట్టొచ్చ‌నేది ఇంకో లెక్క‌గా చెప్తున్నారు. మంత్రిగా కూడా ఇది పాలనకు అనువుగా ఉంటుందన్నది అధిష్టానం అభిప్రాయంగా తెలుస్తోంది. ఇందుకోసమే ఈ ఎన్నికలపై పార్టీ ప్రత్యేకంగా దృష్టిపెట్టిందని చెప్తున్నారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్ని తెలుగుదేశం తూతూ మంత్రంగానే తీసుకొని గెలుపు బాధ్యతల్ని అభ్యర్థులపైనే నెట్టేది. కానీ ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల్ని కూడా తమ అభ్యర్ధులు గెలిచి తీరాల్సిందేనన్న పట్టుదలను చంద్రబాబు కనబరుస్తుండ‌టం చిన‌బాబు కోస‌మేన‌ని చెప్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/