Begin typing your search above and press return to search.

2014లో ఫార్ములా..2019లో వ‌ర్క‌వుట్ కాదులే లోకేష్!

By:  Tupaki Desk   |   24 May 2018 8:36 AM GMT
2014లో ఫార్ములా..2019లో వ‌ర్క‌వుట్ కాదులే లోకేష్!
X
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ - ఎన్డీఏ కూట‌మితో టీడీపీ తెగ‌దెంపులు చేసుకున్న త‌ర్వాత‌....బీజేపీపై టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తోన్న సంగ‌తి తెలిసిందే. నాలుగేళ్లు అంట‌కాగిన జిగ్ డీ దోస్తులు....ఒక్క‌సారిగా బ‌ద్ధ శ‌త్రువులైపోయి ఆరోప‌ణ ప్ర‌త్యారోప‌ణ‌లు చేసుకుంటున్నారు. ఈ సారి ఏపీకి ప్ర‌త్యేక హోదా సెంటిమెంట్ తో ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని ప్లాన్ చేస్తోన్న టీడీపీ...ఎంత‌కైనా దిగ‌జారేందుకు రెడీ అయింది. ఆఖ‌రికి ఏపీని విభ‌జించి 5 కోట్ల ఆంధ్రుల ఉసురుపోసుకున్న కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకునేందుకు కూడా సిద్ధ‌మైంది. క‌ర్ణాట‌క సీఎం కుమార స్వామి ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు....ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ లో ముసిముసి న‌వ్వులు చిందిస్తూ ముచ్చ‌టించ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ మ‌రో అడుగు ముందుకు వేశారు. బీజేపీకి వ్యతిరేకంగా పని చేసే ఏ పార్టీతో అయినా తాము కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

భ‌విష్య‌త్తులో ఏ రాష్ట్రంలోనూ బీజేపీ గెలిచే అవకాశాలు లేవని లోకేష్ సెల‌విచ్చారు. బీజేపీకి వ్య‌తిరేకంగా అన్ని పార్టీలు ఒక్క‌తాటిపైకి రావాల‌ని - అన్ని పార్టీల అధినేత‌ల‌తో ఏపీలో ఓ భారీ బహిరంగ సభను చంద్ర‌బాబు ఏర్పాటు చేయ‌బోతున్నార‌ని ప్ర‌క‌టించారు. అంతేకాదు, జాతీయ రాజకీయాల్లో చంద్ర‌బాబు చక్రం తిప్పనున్నారని - బీజేపీకి బుద్ధి చెప్పేందుకు ప్రాంతీయ పార్టీలను ఏకం చేయ‌బోతున్నార‌ని చెప్పారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌లు బీజేపీకి ట్రైల‌ర్ వంటివ‌ని.....2019లో అసలు సినిమా ఉందని చెప్పారు. 2014లో బీజేపీతో టీడీపీ పొత్తు వ‌ల్లే బీజేపీ త‌ర‌ఫున కనీసం వార్డు మెంబర్ గా గెలవలేని వారికి ఎమ్మెల్యేలు - ఎంపీల టిక్కెట్లు ఇచ్చామ‌న్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో బీజేపీకి ఘోర‌ ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని - కాంగ్రెస్ పుంజుకుంటుంద‌ని అన్నారు. లోకేష్ మాట‌ల‌ను బ‌ట్టి....2014లో విభ‌జ‌న సెంటిమెంట్ తో బీజేపీతో పొత్తు పెట్టుకొని ఓట్ల‌ను కొల్ల‌గొట్టిన ఫార్ములానే....2019లో హోదా సెంటిమెంట్ తో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాల‌ని టీడీపీ య‌త్నిస్తోంద‌నిపిస్తుంది.

ఏ ఎండ‌కా గొడుగు ప‌ట్ట‌డం.....త‌మ స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం విలువ‌ల‌కు తిలోద‌కాలిచ్చి ఎంత‌కైనా దిగ‌జార‌డం టీడీపీకి కొత్తేం కాదు. 2014లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను అడ్డ‌గోలుగా విభ‌జించిన కాంగ్రెస్ పై తీవ్ర వ్య‌తిరేక‌త‌ను వ్య‌క్తం చేసిన టీడీపీ....కాంగ్రెస్ కు వ్య‌తిరేకంగా ఏ పార్టీతోనైనా జ‌త క‌ట్టేందుకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించింది. అందుకు త‌గ్గ‌ట్లుగానే....బీజేపీతో అంటకాగి....ప‌వ‌న్ ను అడ్డుపెట్టుకొని అధికారంలోకి వ‌చ్చారు. ఏపీ విభ‌జ‌న సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకొని చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి పీఠాన్ని చేజిక్కించుకున్నారు. తాజాగా, మ‌రోసారి అదే ఫార్ములాను....సెంటిమెంట్ ను వాడేందుకు చంద్ర‌బాబు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ సారి ఏపీకి ప్ర‌త్యేక హోదాను విస్మ‌రించిన బీజేపీకి వ్య‌తిరేకంగా ఏ పార్టీకైనా మ‌ద్ద‌తు తెలిపేందుకు రెడీ అని సాక్ష్యాత్తూ లోకేష్ బాబు చెప్పారు. విన‌డానికి ఇదంతా బాగానే ఉంది. బీజేపీపై ఉన్న వ్య‌తిరేక‌త‌ను టీడీపీ క్యాష్ చేసుకోవాల‌ని చూస్తోంది. 2014లో మాదిరి కాంగ్రెస్ తో దోస్తీ అంటే....టీడీపీపై ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త‌ను పోగొట్టేందుకు ఏదో ఒక జిమ్మిక్కు చేయ‌డం చంద్ర‌బాబు - లోకేష్ ల‌కు అల‌వాటే. అయితే, గ‌తంలో మాదిరిగా లోకేష్ క‌ల్ల‌బొల్లి మాట‌లు న‌మ్మేందుకు ఏపీ ప్ర‌జ‌లు సిద్ధంగా లేర‌న్న సంగ‌తి వారు మ‌ర‌చిపోయారు. నాలుగేళ్లు బీజేపీతో సావాసం చేసి...ఇపుడు ఏపీని విడ‌గొట్టిన కాంగ్రెస్ తో క‌లిసి ప‌నిచేస్తాం అంటే...ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితి లేద‌న్న విష‌యాన్ని అమాత్యుల వారు గ్ర‌హిస్తే మంచిది.