Begin typing your search above and press return to search.

లోకేశా... మ‌ళ్లీ నాలిక మ‌డ‌త‌డిందే!

By:  Tupaki Desk   |   11 Sept 2017 9:59 AM IST
లోకేశా... మ‌ళ్లీ నాలిక మ‌డ‌త‌డిందే!
X
టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - ఏపీ కేబినెట్‌ లో కీల‌క శాఖ‌ల మంత్రి నారా లోకేశ్ ఇప్పుడ‌ప్పుడే త‌న ప్ర‌సంగంలో దొర్లుతున్న‌ త‌ప్పులను స‌రిదిద్దుకునేలా క‌నిపించ‌డం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. అప్పుడెప్పుడో మంత్రిగా ప్ర‌మాణం చేసిన స‌మ‌యంలోనే మ‌డ‌త ప‌డిన ఆయ‌న నాలుక... నెల‌లు గ‌డుస్తున్నా కూడా దారికి రావ‌డం లేద‌ట‌. భార‌త రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్క‌ర్ వ‌ర్ధంతి స‌భ‌కు హాజ‌రైన ఆయ‌న స‌ద‌రు వ‌ర్ధంతిని జ‌యంతిని చేసేశారు. నాడు లోకేశ్ అటు నెటిజ‌న్ల‌తో పాటు ఇటు విప‌క్షాలు కూడా సెటైర్ల మీద సెటైర్లేశాయి.

ఆ అంశాన్ని మ‌రిచిపోక‌ముందే.. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హోదాలో మాట్లాడిన లోకేశ్... గ్రామాల్లో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకే తాము ప‌నిచేస్తున్నామ‌ని చెప్ప‌డానికి బ‌దులుగా... నిధులు ఖ‌ర్చు పెట్టి మ‌రీ స‌మ‌స్య‌లు సృష్టిస్తామ‌ని చెప్పి అంద‌రినీ షాక్‌కు గురి చేశారు. ఈ సంద‌ర్భంగానూ లోకేశ్ పై ప‌వ‌ర్ పంచ్ ల వ‌ర‌ద పారింది. తాజాగా నిన్న సాగ‌ర న‌గ‌రం విశాఖ‌కు ఐటీ శాఖ మంత్రి హోదాలో వెళ్లిన లోకేశ్... అక్క‌డ జ‌రుగుతున్న ఇన్నోవేష‌న్ స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రం సాధిస్తున్న ప్ర‌గ‌తిని ప్ర‌స్తావిస్తూ ఆయ‌న కీల‌క ప్ర‌సంగ‌మే చేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న నోట నుంచి *ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం* అనే ప‌దానికి బ‌దులుగా *ఆంధ్ర‌ప్ర‌దేశ్ దేశం* అనే ప‌దం వినిపించింది. అంటే రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ను లోకేశ్ త‌న‌దైన మాట తీరుతో ఏకంగా దేశాన్నే చేసేశార‌న్న మాట‌.

అంతేనా గ‌తంలో తొమ్మిదిన్న‌రేళ్ల పాటు ఉమ్మ‌డి రాష్ట్రానికి సీఎంగా వ్య‌వ‌హ‌రించిన లోకేశ్ తండ్రి నారా చంద్ర‌బాబు నాయుడు... ఏపీకి తాను ఓ సీఎంన‌ని చెప్పుకునే బ‌దులు... ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు తాను సీఈఓన‌ని చెప్పుకున్నారు. ఇత‌ర దేశాల నుంచి వ‌చ్చిన ప్ర‌ముఖులు, పారిశ్రామిక‌వేత్త‌ల‌తో ఆయ‌న ఆ విధంగానే పిలిపించుకునేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రిచార‌న్న విమ‌ర్శ‌లు లేక‌పోలేదు. తండ్రి త‌ర‌హాలోనే లోకేశ్ కూడా విశాఖ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను ఓ కంపెనీగా అభివ‌ర్ణించిన వైనం అక్క‌డి వారిని విస్మ‌యానికి గురి చేసింద‌నే చెప్పాలి. లోకేశ్ నోట వినిపించిన ఈ నాలిక మ‌డ‌త మాట‌లు ఆ వెంట‌నే సోష‌ల్ మీడియాలోకి వెళ్లిపోగా... గతంలో మాదిరిగానే ఆయ‌న నాలిక మ‌డ‌త‌పై నెటిజ‌న్లు సెటైర్ల వ‌ర్షం కురిపించారు. ఒక్కొక్క‌రు ఒక్కో రీతిలో లోకేశ్ ను ఏకి పారేశార‌నే చెప్పాలి.