Begin typing your search above and press return to search.

ఇప్పటికింకా ‘నాన్న’ వయసు నిండా పదహారే..

By:  Tupaki Desk   |   21 April 2016 1:05 PM IST
ఇప్పటికింకా ‘నాన్న’ వయసు నిండా పదహారే..
X
ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అన్న పాట కొన్నేళ్ల కిందట కుర్రకారును ఒక ఊపు ఊపేసింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేశ్ దాన్ని కాస్త మార్చి ‘ఇప్పటికింకా నాన్న వయసు నిండా పదహారే’ అని పాడుతుండడంతో టీడీపీ శ్రేణులకు ఊపు వస్తోంది. నారా లోకేశ్ తన తండ్రి - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విషయంలో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో కొత్త ఊపు తెస్తున్నాయి. చంద్రబాబు జన్మదినం సందర్భంగా బుధవారం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో టీడీపీ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. దాన్ని ప్రారంభించిన సందర్భంగా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 67 ఏళ్ల వయసు వచ్చినా తన తండ్రి చంద్రబాబు ఇంకా 16 ఏళ్ల యువకుడేనని ఆయన వ్యాఖ్యానించారు.

67 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు 16 ఏళ్ల నవ యువకుడిలా పనిచేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని లోకేశ్ అన్నారు. విభజన అనంతరం రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా... రాష్ట్రాన్ని చంద్రబాబు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓ వైపు సమస్యలను పరిష్కరించుకుంటూనే... మరోవైపు సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబుకు ఇంకా పదహారేళ్లే అని లోకేశ్ అనగానే కార్యకర్తలంతా విజిళ్లు - చప్పట్లతో ఆనందం వ్యక్తంచేశారు.