Begin typing your search above and press return to search.

లోకేష్ పాదయాత్ర దారులలో ఏ గాలి వీస్తోంది...?

By:  Tupaki Desk   |   27 Jan 2023 5:07 PM GMT
లోకేష్ పాదయాత్ర దారులలో ఏ గాలి వీస్తోంది...?
X
తెలుగు రాష్ట్రాలలో పాదయాత్ర పాజిటివ్ సెంటిమెంట్ గా ఉంది. రాజకీయాలలో ఇది అతి పెద్ద ఆయుధంగా మారింది. కాలిని నమ్ముకున్న వారు ఎవరూ ఇప్పటిదాకా ఓడిపోలేదని చరిత్ర నిరూపించిన సత్యం. 2003లో వైఎస్సార్ తొలిసారి తెలుగు రాష్ట్రాలలో పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత 2012లో చంద్రబాబు పాదయాత్ర చేస్తే 2014లో ఏపీకి సీఎం అయ్యరు. 2017లో వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తే 2019 ఎన్నికల్లో ఆయనను జనాలు సీఎం ని చేశారు.

ఈ విధంగా పాదయాత్ర చేసిన నాయకులకు అందలాలు దక్కాయి. అయితే ఇందులో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. వైఎస షర్మిల తెలంగాణాలో ఇప్పటికే మూడు వేల పై చిలుకు కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. కానీ ఆమె పార్టీకి అక్కడ అదారణ అంతంతమాత్రంగానే ఉంది. అలాగే విడతల వారీగా బీజేపీ తెలంగాణా ప్రెసిడెంట్ బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. బీజేపీకి కొంత హైప్ క్రియేట్ అయినా వచ్చే ఎన్నికల్లో గెలిచే స్థాయికి ఇంకా చేరలేదని అంటున్నారు.

ఇపుడు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు రెడీ అవుతున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన కాలికి పని చెబుతున్నారు. మరి ఆయన పాదయాత్ర స్టార్ట్ అయితే తప్ప దాని గురించి ఏమిటి అన్నది చెప్పడం కష్టం. నారా చంద్రబాబు కుమారుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర కుప్పం నుంచి ఈ రోజు స్టార్ట్ చేశారు. లోకేష్ పాదయాత్ర ఎక్కడా ఆగకుండా నాలుగు వందల రోజుల పాటు ఏకబిగిన సాగనుంది.

నిజంగా ఇది అతి పెద్ద టాస్క్. ఎవరూ ఇన్ని రోజుల పాటు పాదయాత్ర చేయలేదు. అదే విధంగా నాలుగు పదుల వయసులో పాదయాత్రకు సిద్ధపడిన ప్రముఖ నాయకుడిగా లోకేష్ ని చూడాల్సి ఉంటుంది. అంటే తెలుగు రాష్ట్రాల పాదయాత్రికులలో ఆయన చిన్న వారుగా చెప్పాలి. ఇక లోకేష్ తెలుగుదేశానికి భావి వారసుడు. ఆ పార్టీకి చంద్రబాబు తరువాత ఆయనే అన్నది తెలిసిందే.

ఆయనకు జనాలు ఏ మేరకు నీరాజనాలు పడతారు అన్నది చూడాలి. లోకేష్ జనాలతో ఏ విధంగా మమేకం అవుతారు అన్నది కూడా ఆసక్తిని కలిగించే అంశం. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. లోకేష్ పాదయాత్రకు సిద్ధపడుతున్న వేళ కూడా కేరాఫ్ చంద్రబాబుగా ఉన్నారు. ఆయన తనకంటూ సొంత ఇమేజ్ కోసం గత కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఏవీ పెద్దగా ఫలితాలు ఇవ్వలేదు. ఆయన మీడియా బేబీగానే ఉండిపోయారు.

ఇపుడు ఆయనలోని నిజమైన నాయకుడిని బయటకు తెచ్చే విధంగా ఈ పాదయాత్ర ఉంటుందా అన్నది చూడాలి. మరో వైపు చూస్తే ఏపీలో వైసీపీకి వ్యతిరేకత ఉంది అని అందరూ చెబుతున్నారు. వైసీపీ కూడా అంతర్గతంగా ఎంతో కొంత వ్యతిరకత ఉంది అని అంగీకరిస్తున్న విషయం. నిజానికి అయిదేళ్ళు పాలించిన ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేకత కచ్చితంగా ఉంటుంది.

దాన్ని అంతా ఒక చోటకు క్రోడీకరించి దాన్ని టీడీపీ వైపు గా మళ్ళించే అతి పెద్ద ప్రయత్నానికి లోకేష్ పాదయాత్ర దోహదపడుతుందా అన్నది కూడా చూడాలి. వైసీపీ మీద వ్యతిరేకత ఒక ప్రభజనంగా మారిన పరిస్థితి అయితే ఇప్పటిదాకా లేదు. దానిని లోకేష్ చేయగలుగుతారా అన్నది చూడాలి. మొత్తం 125 నియోజకవర్గాలలో లోకేష్ పాదయాత్ర సాగనుంది. వేల పల్లెలను టచ్ చేయనుంది. ఈ విధంగా పాదయాత్ర చేయడం ద్వారా లోకేష్ ఏపీ పల్స్ ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే టైం లో వైసీపీ వ్యతిరేక గాలిని పోగు చేయబోతున్నారు మరి ఇందులో ఎంతమేరకు సక్సెస్ అవుతారు అన్నది లోకేష్ పాదయాత్ర దారులే చెబుతాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.