Begin typing your search above and press return to search.

టీటీడీ బోర్డు నిర్ణ‌యాల‌పై టీడీపీ ఫైర్‌.. లోకేష్ కామెంట్స్ ఇవే

By:  Tupaki Desk   |   23 Feb 2022 11:00 PM IST
టీటీడీ బోర్డు నిర్ణ‌యాల‌పై టీడీపీ ఫైర్‌.. లోకేష్ కామెంట్స్ ఇవే
X
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం.. టీటీడీ బోర్డు అనుస‌రిస్తున్న నిర్ణ‌యాల‌పై ప్ర‌తిప‌క్షం టీడీపీ నిప్పులు చెరిగింది. శ్రీవారి భక్తుల మనోభావాలకు విరుద్ధంగా టీటీడీ నిర్ణయాలు ఉన్నాయని టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు.

తిరుమల పవిత్రత దెబ్బతీసేలా బోర్డు నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. తిరుమల ప్రాభవం తగ్గించేందుకు కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలను వ్యాపార కేంద్రం చేస్తున్నారన్నారు.

టికెట్‌ లేకుంటే తిరుపతి నుంచి తిరుమలకు పంపటం లేదని ఆరోపించారు. తిరుమలలో కరోనా ఆంక్షలపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. దేశంలో ఏ గుడిలో లేని కరోనా ఆంక్షలు తిరుమలలో ఎందుకని? నిలదీశారు. శ్రీవారు ఉన్నచోట మరో స్పిరిచ్యువల్ సిటీ ఎందుకని ప‌య్యావుల‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రూ.వెయ్యి కోట్లతో దేశవ్యాప్తంగా అనేక ఆలయాలు కట్టవచ్చునని సూచించారు. జిలేబీ ప్రసాదం రూ.2 వేలు చేసి సామాన్యులకు దూరం చేశారన్నారు. తిరుమల భద్రతపై కమిటీ నివేదికను తుంగలో తొక్కుతున్నారని ఆక్షేపించారు.

స్వామివారి ఆలయ వాస్తును దెబ్బతీసేలా టీటీడీ నిర్ణయాలు ఉన్నాయన్నారు. తిరుమలలో టికెట్ల ధర పెంచుతుంటే ప్రభుత్వం స్పందించదా ? అని పయ్యావుల నిలదీశారు. టీటీడీ ధార్మిక‌ మండ‌లిని జ‌గ‌న్ దోపిడీ మండలిగా మార్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విమర్శించారు.

శ్రీవారి సేవా టికెట్లను టీటీడీ సభ్యులే వాటాలు వేసుకుంటున్నారని ఆరోపించారు. వస‌తి, ప్రసాదం ధర పెంచి సామాన్య భక్తులపై పెనుభారం మోపుతున్నారని ఆక్షేపించారు. క్రిమినల్ కేసులున్న 16 మందిని బోర్డు స‌భ్యులుగా నియమించారని మండిపడ్డారు.

సుబ్బారెడ్డి వీడియో వైర‌ల్‌

మ‌రోవైపు.. స్వామి వారికి నిర్వ‌హించే వివిధ సేవ‌ల టికెట్ ధ‌ర‌ల‌ను ఇస్టానుసారం పెంచేస్తూ.. టీటీడీ బోర్డు చైర్మ‌న్‌, వైసీపీ నాయ‌కుడు.. వైవీ సుబ్బా రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 400 ఉన్న సుప్ర‌భాత సేవ‌ను అధికారులు రూ.800 చేయాల‌ని ప్ర‌తిపాదిస్తే.. ఆయ‌న మీడియా ముందే.. `2000 చేసేయండి.. ఏమ‌వుతుంది?` అని వ్యాఖ్యానించారు.

అదేవిధంగా తోమాల సేవ ఇప్ప‌టికే 2000 ఉండ‌గా దీనిని కూడా మ‌రో 500 పెంచేయండి.. అంటూ అత్యంత నిర్ల‌క్ష్యంగా ఏమాత్రం సామాన్య భ‌క్తుల‌ను ప‌ట్టించుకోకుండా చేసిన కామెంట్లు వైర‌ల్ అవుతున్నాయి. దీనిపై భ‌క్తులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.