Begin typing your search above and press return to search.

బాబు పోరాటంలో చినబాబు ఎక్కడా కనిపించరేం!

By:  Tupaki Desk   |   11 March 2018 10:40 AM IST
బాబు పోరాటంలో చినబాబు ఎక్కడా కనిపించరేం!
X
మోడీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఇపుడు నారా చంద్రబాబునాయుడు తన శక్తివంచన లేకుండా ఒక పోరాటాన్ని నడుపుతున్నారు. తన పార్టీ వారందరినీ కూడా తెగ ప్రోత్సహిస్తున్నారు. వీధివీధికి తిరిగి మోడీ పరువు తీసేయమని చెబుతున్నారు. ఇంత పెద్ద యుద్ధాన్ని ఆయన స్వయంగా నడిపిస్తూ ఉంటే.. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. మంత్రిగా వైభోగం వెలగబెడుతున్న నారా లోకేష్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదే అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

ఒకవైపు పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అటు ముఖ్యమంత్రి కేసీఆర్ - ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ - తనయ ఎంపీ కల్వకుంట్ల కవిత.. అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా దక్కడం సమంజసం అని మాట్లాడుతూ ఉన్నారు. పొరుగున ఉన్న నాయకులకు కలిగిన పాటి కనికరం కూడా మంత్రి లోకేష్ కు కలగలేదా అనే వాదన వస్తోంది.

ఆరాతీస్తే ఇందులో చాలా మతలబులే ఉన్నాయని పలువురు అంటున్నారు. ఆయన పర్యవేక్షిస్తున్న పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ అచ్చంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల మీదనే నడుస్తుంది. అయితే ఆ శాఖకు వచ్చిన నిధుల్ని వెచ్చించడంలో చాలా మతలబులు, లోపాయికారీ వ్యవహారాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలున్నాయి. కేంద్రం గనుక ఒక్క విడత ఏపీలో పంచాయతీ రాజ్ నిధుల వ్యయం గురించి విచారణకు ఆదేశించడం అంటూ జరిగితే.. చినబాబు నారా లోకేష్ పీకల్దాకా కూరుకుపోయే అవకాశం ఉంటుందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే రాష్ట్రం ఎలా పోయినా పర్లేదనుకుని.. పార్టీ నాయకులందరూ బుక్కయిపోయినా పర్లేదనుకుని.. చినబాబు తనుమాత్రం ఎక్కడా మోడీ వ్యతిరేక విమర్శల జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా తప్పించుకు తిరుగుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

మోడీ మీద విమర్శల సంగతి పక్కన పెట్టినా.. కనీసం ప్రత్యేకహోదా గురించి.. రాష్ట్రానికి దాని ఆవశ్యకత గురించి. అది ఇవ్వడంలో కేంద్రం పాల్పడుతున్న వంచన గురించి అయినా.. లోకేష్ పెదవి విప్పి మాట్లాడితే బాగుంటుందని.. ఆయన వైఖరి అత్యంత మోసపూరితంగా కనిపిస్తున్నదని.. తాను సేఫ్ పొజిషన్ లో ఉండి రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆటలాడుతున్నారని పలువురు విమర్శలు ఎక్కు పెడుతున్నారు.