Begin typing your search above and press return to search.

జనం మాట..టీడీపీ భావి సారథి జూనియర్ ఎన్టీఆరే!

By:  Tupaki Desk   |   13 Sept 2019 9:45 PM IST
జనం మాట..టీడీపీ భావి సారథి జూనియర్ ఎన్టీఆరే!
X
అదేంటీ... టీడీపీ భావి అధినేత - భావి సారథి అని అప్పుడే అనేస్తున్నారంటారా? తప్పదు కదా. గడచిన ఎన్నికల్లో తన ప్రస్థానంలోనే ఎన్నడూ లేనంత ఘోరంగా టీడీపీ ఓటమిపాలైతే... నాయకత్వ మార్పు తప్పదన్న మాట వినిపించడం సాధారణమే కదా. అందులోనూ ఏళ్ల తరబడి పార్టీ అధినేతగా కొనసాగుతున్న చంద్రబాబు కూడా వయసైపోయిన నేతగా మారిపోయారు కదా. మరి ఇప్పుడు పార్టీకి కొత్త సారథి ఎవరు అనే మాట వినిపించడం కొత్తేమీ కాదు. అయితే గియితే పార్టీ కొత్త సారథిగా చంద్రబాబు తనయుడు - మాజీ మంత్రి - పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేశ్ ఉన్నారు కదా అంటారా? మరి జనంతో పాటు పార్టీలోని చాలా మంది పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు కుటుంబం నుంచి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ అయితే బాగుంటుందని అంటున్నారు కదా. ఈ క్రమంలోనే తుపాకీ.కామ్ ఈ విషయాన్ని తేల్చేందుకు ఓ సంచలన సర్వేను చేపట్టింది. ఆన్ లైన్ వేదికగా చేపట్టిన ఈ సర్వేకు భారీ స్పందన రాగా... సర్వేలో మెజారిటీ జనం లోకేశ్ కు కాకుండా జూనియర్ ఎన్టీఆర్ కే ఓటేశారు. జూనియర్ కావాలన్న వారు ఏకంగా 85 శాతం మంది ఉంటే... లోకేశ్ కావాలన్న వారు మాత్రం 15 శాతం మంది మాత్రమే.

తెలుగు ప్రజల ఆత్మ గౌరవమనే పునాదుల మీద ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ (టీడీపీ)... ఆ దిశగా చాలానే సాధించిందని చెప్పక తప్పదు. అప్పటిదాకా రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా కొనసాగుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీని గద్దె దించిన పార్టీగా టీడీపీ జనం గుండెల్లో మంచి ముద్రే వేసుకుంది. అయితే కాలక్రమేణా... పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావునే బయటకు పంపేసిన ప్రస్తుత పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు... పార్టీని భ్రష్టు పట్టించారన్న మాట కూడా బాగా గట్టిగానే వినిపిస్తోంది. ఇప్పుడు చంద్రబాబు శకం కూడా దాదాపుగా ముగింపు దశకు వచ్చింది. మరి చంద్రబాబు తర్వాత పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టేదెవరు?. నిజమే ఈ ప్రశ్న ఇటు టీడీపీ శ్రేణుల్లోనే కాకుండా... సామాన్య జనంలో కూడా బాగానే వినిపిస్తోంది. గడచిన ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి అసలు టీడీపీ మనుగడలో ఉంటుందా? అన్న కోణంలోనూ ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ఈ సందర్బంగా తుపాకీ.కామ్ ఓ సంచలన సర్వేను చేపట్టింది.

ఆన్ లైన్ లో సుదీర్ఘంగా చేపట్టిన ఈ సర్వేకు తుపాకీ పాఠకులు భారీగానే స్పందించారు. వారిలో మెజారిటీ పాఠకులు ఎన్టీఆర్ మనవడు, తాత పోలికలతో అచ్చు గుద్దినట్టుగా కనిపిస్తుండటంతో పాటుగా తాత మాదిరే జన సమ్మోహన శక్తి కలిగిన జూనియర్ ఎన్టీఆర్ కే పట్టం కట్టారు. మొత్తం సర్వేలో పాల్టొన్న వారిలో ఏకంగా 85 శాతం (84.99 శాతం) మేర టీడీపీ భావి అధినేత జూనియర్ అయితేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇక చంద్రబాబు తనయుడిగా ఇటీవలే రాజకీయ తెరంగేట్రం చేసిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు కేవలం 15 శాతం (15.01 శాతం) మంది మాత్రమే ఓటేయడం గమనార్హం. అంటే లోకేశ్ కంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపడితేనే... టీడీపీకి భవిష్యత్తు ఉంటుందని 85 శాతం మంది చెప్పేశారన్న మాట. ఇక ఈ సర్వేలో పాలుపంచుకున్న వారి సంఖ్య విషయానికి వస్తే... మొత్తం 94, 590 మంది సర్వేలో పాలుపంచుకుంటే... వీరిలో లోకేశ్ కు ఓటేసిన వారు కేవలం 14,202 మంది మాత్రమే. అదే జూనియర్ ఎన్టీఆర్ సారథ్యం కోరుతున్న వారి సంఖ్య 80,388గా తేలింది.

పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ క్రౌడ్ పుల్లర్ లలో తొలి వరుసలో నిలిచిన నేతగా మనకు తెలిసిందే. అదే సమయంలో ఆయన హావభావాలను పుణికిపుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయనకు ఏమాత్రం తీసిపోని క్రౌడ్ పుల్లర్ కిందే లెక్క. 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున జూనియర్ చేసిన ప్రచారానికి ఎంతగా అప్లాజ్ వచ్చిందో మనకు తెలిసిందే. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండానే... అంతగా జనాన్ని రాబట్టిన జూనియర్ ఎన్టీఆర్ ఇక పార్టీ సారథ్య బాధ్యతలను భుజానికెత్తుకుంటే... పార్టీకి పూర్వ వైభవం ఖాయమన్న మాట కాస్తంత గట్టిగానే వినిపిస్తోంది. అదే సమయంలో ఓ పార్టీ అధినేత కుమారుడిగా - పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేశ్ చట్టసభల్లోకి ఇచ్చిన దొడ్డిదారి ఎంట్రీపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. అంతేకాకుండా ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగిన లోకేశ్ తొలిసారే చిత్తు చిత్తుగా ఓడిపోయారు. ఈ లెక్కన ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చిన లోకేశ్ కంటే కూడా.... రాజకీయాల్లోకి రాకుండానే సత్తా చాటిన జూనియర్ ఎన్టీఆర్ అయితేనే... టీడీపీకి భవిష్యత్తు ఉంటుందని ఈ సర్వేలో పాలుపంచుకున్న జనం చెప్పారు.