Begin typing your search above and press return to search.

నారా లోకేష్‌ను హీరోను చేస్తున్నారుగా..

By:  Tupaki Desk   |   28 Oct 2020 8:45 AM IST
నారా లోకేష్‌ను హీరోను చేస్తున్నారుగా..
X
గది లోపలేసి తాళమేస్తే పిల్లి కూడా పులవుతుందని ఓ నానుడి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు చూస్తే ఇదే నిజమనిపిస్తోంది. ఒకప్పుడు రాజకీయాల్లో ‘జీరో’గా ముద్ర వేయించుకున్న నారా లోకేష్ ఈ మధ్య బాగానే హైలైట్ అవుతున్నాడు. నాయకుడిగా ఎదగడానికి ఏం అవసరమో చాలా లేటుగా గుర్తించిన లోకేష్.. ఈ మధ్య తనను తాను మార్చుకోవడం మీద బాగానే దృష్టిసారిస్తున్నాడు. ముందుగా తన అప్పీియరెన్స్ మీద దృష్టిపెట్టాడు.

లాక్ డౌన్ టైంను బాగా ఉపయోగించుకుని సన్నబడ్డాడు. అలాగే భాష మీద ఫోకస్ పెట్టి తడబాటు లేకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ధైర్యగా మీడియాను ఫేస్ చేస్తున్నాడు. ప్రశ్నలేయండని వాళ్లను రెట్టించి అడుగుతున్నాడు. అన్నింటికీ మించి జనాల్లో తిరగడం, క్షేత్ర స్థాయిలో పర్యటిస్తుండటం అతడిలో కనిపిస్తున్న గొప్ప మార్పు.

ఇన్నాళ్లూ నారా లోకేష్‌ను మరీ తేలిగ్గా తీసుకుని అతణ్ని కామెడీ చేస్తూ వస్తున్న వైసీపీ వర్గాలు ఇప్పుడు కొంచెం అతణ్ని సీరియస్‌గానే తీసుకుంటున్నాయి. కానీ ఈ సమయంలో వైసీపీ ప్రభుత్వం ఒక వ్యూహాత్మక తప్పిదం చేసింది. పశ్చిమగోదావరి జిల్లాలో నారా లోకేష్ నడుపుతున్న ట్రాక్టర్ ప్రమాదానికి గురైన ఘటనకు వైసీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. అతడిపై కేసులు పెట్టింది. ఐతే ఇగ్నోర్ చేయాల్సిన విషయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా లోకేష్‌ను జగన్ సర్కారు చాలా సీరియస్‌గా తీసుకుంటున్న సంకేతాలు జనాల్లోకి వెళ్తాయనడంలో సందేహం లేదు.

కరోనా టైంలో నిబంధనలు పాటించలేదని, అవగాహన లేకుండా ట్రాక్టర్ నడిపాడని లోకేష్ మీద కేసులు పెట్టారు. ఐతే వైసీపీ నేతలు కరోనా నిబంధనల్ని తుంగలో తొక్కి ఏమేం చేస్తున్నారో జనాలందరూ చూస్తూనే ఉన్నారు. ఇక ట్రాక్టర్ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకున్నా లోకేష్ మీద కేసు పెట్టడం కూడా బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉంది. మొత్తంగా లోకేష్‌ను చూసి ఉలికిపాటుకు గురై కేసులు పెట్టారన్న అభిప్రాయం జనాలకు కలిగి అతను హీరో అయ్యే అవకాశముందని గుర్తించకుండా వైసీపీ సర్కారు తప్పు చేసిందనే అభిప్రాయం వినిపిస్తోంది.