Begin typing your search above and press return to search.

సరిగ్గా ఎన్నికల ముందు ఆ ట్యాగ్ తో లోకేష్ ?

By:  Tupaki Desk   |   30 Jan 2022 6:00 PM IST
సరిగ్గా ఎన్నికల ముందు ఆ ట్యాగ్ తో లోకేష్ ?
X
తెలుగుదేశం పార్టీ భావి నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ పసుపు దళాన్ని ఇక మీదట జోరుగా నడిపించాల్సి ఉంది. తండ్రి చంద్రబాబు ఈ విషయంలో చాలానే కష్టపడుతున్నారు. ఇపుడు ఆ కష్టంలో చినబాబు కూడా తన వంతు పాత్ర తీసుకుని దళపతిగా దూకుడు చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే కాకనే లోకేష్ మంత్రి అయ్యారు. రెండేళ్ళ తరువాత మాజీ ట్యాగ్ వచ్చేసింది. అయితే ఆయన ఇపుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. 2017 మార్చిలో జరిగిన శాసన మండలి ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్సీగా అతి పిన్న వయసులో అడుగు పెట్టారు.

నిజానికి అది పెద్దల సభ. సాధారణంగా అక్కడకు చేరే వారి ఎవరేజ్ ఏజ్ యాభై ఏళ్లు. అలాంటిది లోకేష్ 34 ఏళ్ల వయసులో అది కూడా ఫస్ట్ టైమ్ చట్టసభలోకి వస్తూనే ఎమ్మెల్సీ అయ్యారు. దాని మీద చాలా విమర్శలు వచ్చినా ఆయన ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని బాబు నిర్ణయం తీసుకున్నారు అని చాలా మంది నాడు అన్నారు. ఇపుడు అదే నిజం అయింది. మూడేళ్ల క్రితం పార్టీ అధికారం కోల్పోవడంతో పాటు దారుణమైన రిజల్ట్స్ వచ్చాయి. 2014 ఎన్నికల తరువాత వందకు పైగా ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీ అందులో అయిదవ వంతును మాత్రమే 2019 ఎన్నికల్లో గెలిచింది.

నాడు ఎమ్మెల్యే అయి ఉంటే లోకేష్ ఈపాటికి ఏనాడో మాజీ అయ్యేవారు. అయితే ఆయన ఎమ్మెల్సీ కాబట్టి ఇప్పటికీ హ్యాపీగా చట్ట సభలో ఉన్నారు. ఇపుడు ఆ ముచ్చటా తీరిపోతోంది. 2023 మార్చి నాటికి లోకేష్ సభ్యత్వం పూర్తి అవుతుంది. దాంతో ఆయన మాజీ ఎమ్మెల్సీగానే కొత్త ట్యాగ్ తగిలించుకోవాల్సి ఉంటుంది.మరో సారి కౌన్సిల్ లో అడుగుపెట్టడానికి టీడీపీకి ఎమ్మెల్యేల బలం లేదు, లోకల్ బాడీస్ లో కూడా ఎక్కడా బలం లేదు మరి సార్వత్రిక ఎన్నికలు వస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చు. కానీ అవి మరో ఏడాది పై దాటి ఉంటాయి.

దాంతో చూసుకుంటే సరిగ్గా ఎన్నికల ముందు లోకేష్ మాజీ అవుతారు. ఆయన ఇప్పటికైతే మంగళగిరి నుంచి పోటీ చేస్తారు అని టాక్ వినిపిస్తోంది. ఆయన్ని అక్కడ దెబ్బ తీయడానికే మాజీ మంత్రి హనుమంతరావుని ఎమ్మెల్సీగా వైసీపీ చేసింది అని అంటున్నారు. చేనేత సామాజికవర్గానికి చెందిన హనుమంతరావు గతంలో ఎమ్మెల్యేగా ఇదే సీటు నుంచి గెలిచారు.

ఒకవేళ ఆయన కాకపోయినా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామక్రిష్ణారెడ్డికి మద్దతుగా రెడీ చేసి ఉంచారు. ఇంకో వైపు నాన్ లోకల్ అన్న ముద్ర అయితే లోకేష్ కి ఉంటుంది. దాంతోపాటు సిట్టింగ్ లీడర్ చిరంజీవి వర్గం కూడా లోకేష్ పోటీ మీద గుర్రుగా ఉంది అంటున్నారు. ఆయన తానే అభ్యర్ధి అనుకుంటే లోకేష్ పాదం మోపారట. ఈ పరిణామాలు ఇలా ఉండగా ఇపుడు వైసీపీ ఎంపీ విజయసాయిఎడ్డి లోకేష్ మీద చేసిన కామెంట్స్ అయితే మంట పుట్టిస్తున్నాయి.

త్వరలో మాజీ ఎమ్మెల్సీ అయితే లోకేష్ కి ఇంకే పదవీ దక్కే సీన్ లేదని విజయసాయిరెడ్డి జోస్యం చెబుతున్నారు. ఎమ్మెల్సీ పదవీ చినబాబుకు మొదటిది, అదే చివరిది అని కూడా సాయిరెడ్డి సెటైర్లు వేస్తున్నారు. అది రాజకీయ విమర్శగా తీసుకున్నా కూడా లోకేష్ మీద గట్టి సెటైర్ గానే చూడాలి. వైసీపీ లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేడూ అని వైసీపీ అయితే బాగా రెచ్చగొడుతోంది. మరి లోకేష్ ఈ నిందను కానీ విమర్శను కానీ నిజం కానీయకూడదు అనుకుంటే కచ్చితంగా ఆయన ఇప్పటి నుంచే తన బలం ఏమిటో చూపించాలి. ఈ రోజునే ప్రజలలోకి వెళ్లాలి. ట్విట్టర్ నుంచి బయట పడి జనం బాట పట్టాలి. లేకపోతే ఆయన్ని ఈ విధంగా ఎప్పటికీ మాజీ ఎమ్మెల్సీగా ఉంచేందుకు వైసీపీ చేయాల్సింది అంతా చేస్తుంది. మరి లోకేష్ ముందు తన సేఫ్టీగా ఉన్న చోటూ సీటూ చూసుకుంటే బెటరేమో.