Begin typing your search above and press return to search.

చినబాబుకీ జై... ?

By:  Tupaki Desk   |   23 Jan 2022 10:00 PM IST
చినబాబుకీ జై... ?
X
టీడీపీలో పెదబాబు చంద్రబాబు మాటే ఎవరికైనా వేదవాక్కు. పాతికేళ్ళుగా పగ్గాలు పట్టుకుని పార్టీని ముందుకు నడిపిస్తున్న బాబు ఓపికకు జోహార్ అనకుండా ఎవరూ ఉండలేరు. ఇక చంద్రబాబు తరువాత పార్టీలో ఎవరూ అంటే మాకెందుకు అంటారు అంతా. టీడీపీలో చంద్రబాబే ఎప్పటికీ మా నాయకుడు అని కూడా చెబుతారు. అయితే బాబు వారసుడిగా చినబాబు అరంగేట్రం చేయడం, మంత్రిగా మారి మూడు కీలకమైన శాఖలను చూడడం వంటిని అయిదేళ్ల క్రితం జరిగాయి.

నాటి నుంచి పార్టీ మీద చినబాబు పట్టు బాగా పెరిగింది. అయితే సీనియర్ నేతలు మాత్రం చంద్రబాబు మాటే శిరోధార్యం అంటూ వచ్చారు ఈ క్రమంలో లోకేష్ జూనియర్లను ప్రమోట్ చేయడంతో పార్టీలో ఒక రకమైన పోటీ వాతావరణం ఏర్పడింది. ఇదిలా ఉండగా విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రుల్లో చింతకాయల అయ్యన్నపాత్రుడు లోకేష్ కి జై అని ఏనాడో అనేశారు. ఆయన కుమారుడి సైతం లోకేష్ యంగ్ టర్క్ టీమ్ లో మెంబర్ గా ఉంటూ వస్తున్నారు.

సిటీ వరకూ చూస్తే మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చంద్రబాబుకే విధేయత చూపుతున్నారు తప్ప లోకేష్ విషయంలో పెద్దగా రియాక్ట్ అయిన సందర్భాలు లేవు అని ప్రచారంలో ఉంది. చంద్రబాబే మా లీడర్ అని కూడా చాలా సార్లు గంటా చెప్పిన సంగతీ ఉంది. ఇక పార్టీలో లోకేష్ పలుకుబడి పెరుగుతోంది అని భావించిన క్రమంలో గంటా లాంటి వారు కొంత సైలెంట్ అయ్యారు అని కూడా కధనాలు వచ్చాయి.

ఇక ఇపుడు సీన్ అంతా మారుతోంది. గంటా చంద్రబాబు బాటలోనే మేమంతా అంటూ రీసెంట్ గా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. అంతే కాదు ఇపుడు చినబాబుకు జై అనేస్తున్నారు. తాజాగా విశాఖలో జరిగిన చినబాబు పుట్టిన రోజు వేడుకల్లో స్వయంగా గంటా పాలుపంచుకోవడం బట్టి చూస్తూంటే ఆయన పొలిటికల్ రూట్ క్లియర్ గా ఉంది అర్ధమవుతోంది. చినబాబు బర్త్ డే వేళ కేక్ కట్ చేసి మరీ క్యాడర్ తో గంటా హడావుడి చేశారు.

రానున్న కాలంలో టీడీపీలో గంటా పూర్తి యాక్టివ్ గా మారనున్నారు అని చెబుతున్నారు. ఇప్పటిదాకా లోకేష్ విశాఖ టూర్ కి వస్తే అయ్యన్నపాత్రుడు ఆయన అనుచరులే పెద్ద ఎత్తున కనిపించేవారు. ఇక మీదట సిటీలో గంటా కూడా దూకుడు చేసేలా పరిస్థితులు మారనున్నాయని అంటున్నారు. మొత్తానికి టీడీపీతోనే 2024 ఎన్నికలకు వెళ్లాలని, తనతో పాటు తన వారికి కూడా పెద్ద ఎత్తున టికెట్లు సాధించాలని చూస్తున్న గంటా చినబాబుని ఎక్కించుకుని మరీ సైకిల్ తొక్కేందుకు రెడీ అన్న సంకేతాలు ఇచ్చేశారు అంటున్నారు. మరి ఈ పరిణామాలతో ప్రత్యర్ధి వర్గమైన అయ్యన్న వైపు ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాల్సిందే.