Begin typing your search above and press return to search.

లోకేష్ అనవసరంగా కెలుక్కున్నారా ?

By:  Tupaki Desk   |   14 Nov 2021 1:08 PM IST
లోకేష్ అనవసరంగా కెలుక్కున్నారా ?
X
'వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కుప్పంలోనే పోటీ చేస్తారు. చంద్రబాబు ఎన్నికల్లో పోటీ చేస్తున్నంత కాలం ఇంకెవరూ కుప్పంలో టీడీపీ తరపున పోటీ చేయరు' ఇదీ తాజా ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ ప్రస్తావించిన కీలకమైన అంశం. కుప్పం మునిసిపాలిటి ఎన్నికల్లో టీడీపీ తరపున లోకేష్ ప్రచారం చేసిన విషయం అందరికీ తెలిసిందే. శనివారం సాయంత్రంతో ప్రచారగడువు ముగిసింది. అందుకనే ఉదయం నుండి రోడ్ షోలో పాల్గొన్న లోకేష్ మాట్లాడిన ప్రాంతాల్లో వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబే పోటీ చేస్తారని చెప్పటమే విచిత్రంగా ఉంది.

అసలు కుప్పంలో చంద్రబాబే పోటీ చేస్తారని లోకేష్ పదే పదే చెప్పుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది ? గడచిన 30 ఏళ్ళుగా కుప్పంలో చంద్రబాబే కదా పోటీచేస్తున్నది. ఇంతగా ఎందుకు చెప్పారంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు వేరే నియోజకవర్గాన్ని చూసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్రలోని ఏదో ఒక నియోజకవర్గం నుండి చంద్రబాబు పోటీ చేయబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికల్లో కుప్పంలో లోకేష్ పోటీచేస్తారనే ప్రచారం జరిగింది.

కుప్పాన్ని లోకేష్ కు వదిలేసి చంద్రబాబు వేరే నియోజకవర్గంలో పోటీ చేస్తారన్నది ప్రచారం సారంశం. ఎందుకంటే కుప్పం టీడీపీకి సేఫ్ సీటు కాబట్టి చంద్రబాబే కొత్త నియోజకవర్గంలో పోటీచేస్తారని ప్రచారం జరిగింది. అయితే చంద్రబాబు కుప్పంలో పోటీచేయగా లోకేష్ మంగళగిరిలో పోటీచేశారు. కుప్పంలో మొదటిరెండు రౌండ్లలో చంద్రబాబు వెనకబడిపోవటం, మంగళగిరిలో లోకేష్ ఓడిపోవటం అందరికీ తెలిసిందే.

ఈ నేపధ్యంలోనే మళ్ళీ చంద్రబాబు నియోజకవర్గం మార్పుపై ప్రచారం పెరిగిపోయింది. ఇపుడు లోకేష్ కు పోటీచేయటానికి నియోజకవర్గమంటు లేదుకాబట్టి వచ్చే ఎన్నికల్లో కుప్పంలో లోకేషే పోటీ చేస్తారంటు సోషల్ మీడియాలో బాగా ప్రచారమవుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబే కుప్పంలో పోటీచేయబోతున్నారంటు లోకేష్ పదే పదే చెప్పుకోవాల్సొచ్చింది. అసలు లోకేష్ ఈ విషయాన్ని ఎందుకు టచ్ చేశారో కూడా అర్ధం కావటంలేదు.

మునిసిపాలిటి ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన లోకేష్ ఆ విషయం చూసుకునుంటే బాగుండేది. అలాకాదని చంద్రబాబు పోటీగురించి జనాలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లోకేష్ కు ఏమొచ్చింది ? ఇపుడు లోకేష్ చెప్పుకున్న వివరణతో కుప్పం జనాలకు కూడా చంద్రబాబు పోటీచేసే విషయమై డౌటు వస్తే మొదటికే మోసం వస్తుందని లోకేష ఆలోచించలేదా ? ఏమో లోకేష్ ప్రచారం తీరుచూసిన తర్వాత అనవసరమైన విషయాన్ని కెలుక్కున్నారేమో అని అనిపిస్తోంది.