Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ డ్రైవర్ మృతిపై టీడీపీ నిజ నిర్ధరణ కమిటీ.. నారా లోకేష్ ఏమ‌న్నారంటే

By:  Tupaki Desk   |   20 May 2022 6:50 PM IST
ఎమ్మెల్సీ డ్రైవర్ మృతిపై టీడీపీ నిజ నిర్ధరణ కమిటీ.. నారా లోకేష్ ఏమ‌న్నారంటే
X
ఏపీలో సంచనలం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ మృతిపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ నిజ నిర్ధరణ కమిటీ నియమించింది. శ‌నివారం ఈ కమిటీ కాకినాడలో పర్యటించి వాస్తవ పరిస్థితులను ఆరా తీయనుంది. మరోవైపు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ జాతీయ సంస్థలకు, డీజీపీకి లేఖ రాశారు. దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించాల‌ని కోరారు. లేక‌పోతే.. తాము కోర్టుకు వెళ్తామ‌ని తెలిపారు.

వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతిపై నేరుగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు రంగంలోకి దిగారు. తెలుగుదేశం నిజనిర్ధరణ కమిటిని ఆయ‌న ఏర్పాటు చేశారు. కమిటీలో సభ్యులుగా పొలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ, నక్కా ఆనంద్ బాబు, పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎం.ఎస్ రాజు, పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి పీతల సుజాత, పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావులను నియమించారు. మృతి ఘటనపై ఈ కమిటీ శనివారం కాకినాడలో పర్యటించనుంది.

మ‌రోవైపు ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని డీజీపీ, జాతీయ సంస్థలకు నారా లోకేష్‌ లేఖ రాశారు. జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, ఎస్సీ కమిషన్‌లకు లేఖ రాసిన ఆయ‌న‌.. ఎమ్మెల్సీని అరెస్టు చేసి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకుంటే.. అరాచకాలు పెరిగే ప్రమాదం ఉందని లేఖలో పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించాలని సూచించారు.

ఏం జ‌రిగిందంటే..

కాకినాడ ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌ కారులో మృతదేహం ఉండటం కలకలం రేపింది. అది కూడా ఉదయ్ భాస్కర్ వద్ద డ్రైవర్గా పని చేస్తున్న వ్యక్తిదే కావడం.. నిన్న ఎమ్మెల్సీనే సదరు డ్రైవర్ను బయటకు తీసుకెళ్లడంతో.. ఏం జరిగిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్ గురువారం ఉదయం.. కారులో తనతోపాటు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్లారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు.. ప్రమాదం జరిగిందంటూ డ్రైవర్‌ తమ్ముడికి.. సమాచారం ఇచ్చారు ఎమ్మెల్సీ ఉదయ్‌భాస్కర్‌. ఆ తర్వాత తన కారులోనే డ్రైవర్ మృతదేహాన్ని తీసుకొచ్చిన ఎమ్మెల్సీ.. తెల్లవారుజామున 2 గంటలకు మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఏం జరిగిందని కుటుంబ సభ్యులు అడగ్గా.. ప్రమాదం జరిగిందని ఎమ్మెల్సీ చెప్పారని, సరైన సమాధానం చెప్పాలని అడగ్గా.. మృతదేహాన్ని కారులోనే వదిలేసి, వేరే కారులో వెళ్లిపోయారని మృతుని బంధువులు తెలిపారు. దీంతో.. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. మృతుడు సుబ్రహ్మణ్యం.. ఎమ్మెల్సీ వద్ద ఐదేళ్లుగా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇప్పుడు ఉన్నట్టుండి మరణించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఎమ్మెల్సీ అరెస్టుకు ప‌ట్టు!

ఎమ్మెల్సీని అరెస్టు చేయాలని డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ డిమాండ్ చేశారు. తన భర్త మృతదేహాన్ని చూసి ఆమె కన్నీరు మున్నీరుగా విలిపించింది. ఎమ్మెల్సీ వద్ద తీసుకున్న డబ్బుల విషయమై గతంలో తన కుమారుడ్ని బెదిరించారని...ఇప్పుడు చంపేశారని మృతుడు సుబ్రహ్మణ్యం తల్లి ఆరోపించారు.