Begin typing your search above and press return to search.

`అమ్మ ఒడి`పై లోకేష్ స‌టైర్లు.. ఏమ‌న్నారంటే!

By:  Tupaki Desk   |   15 April 2022 7:13 PM IST
`అమ్మ ఒడి`పై లోకేష్ స‌టైర్లు.. ఏమ‌న్నారంటే!
X
ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వంపై త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తున్న టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. తాజాగా మ‌రోసారి ప్రాస‌తో విరుచుకుప‌డ్డారు. ఇప్ప‌టికే ఆయ‌న సీఎం జ‌గ‌న్ `మోహ‌న్‌` రెడ్డిని.. కాస్తా.. జ‌గ‌న్ `మోస‌పు` రెడ్డిగా మార్చేసి.. ఊరూవాడా ప్ర‌చారం చేస్తున్న విష‌యం తెలిసిందే. అదేవిధంగా ఇత‌ర ప‌థ‌కాలు.. నాయ‌కులపైనా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తాజాగా ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మకంగా భావిస్తున్న అమ్మ ఒడి ప‌థ‌కాన్ని టార్గెట్ చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేకాదు.. లోకేష్ త‌న‌దైన శైలిలో స‌టైర్లు గుప్పించారు.

అమ్మ ఒడి ప‌థ‌కం కింద వైసీపీ స‌ర్కారు ఏటా ఒక‌సారి ల‌బ్ధిదారులైన బ‌డికి పంపించే చిన్నారులైన త‌ల్లుల ఖాతాల్లో రూ.15000 వేస్తున్న విష‌యం తెలిసిందే. దీనిన ఏటా జ‌న‌వ‌రిలో సంక్రాంతికి ముందే ఇచ్చారు. ఇలా తొలి రెండేళ్లు వేసిన స‌ర్కారు.. త‌ర్వా త‌.. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో వేయ‌లేదు. పైగా దీనిని ఈ ఏడాది జూలైకి మార్చింది. దీనికి అనేక నిబంధ‌న‌లు కూడా పెట్టింది. విద్యార్థుల హాజరు నుంచి వారి ఇళ్లలో విద్యుత్‌ బిల్లు వరకు నిర్దేశించిన ప్రకారం ఉంటేనే ఇక ఈ సాయం అందుతుంది. కుటుంబ గృహ విద్యుత్‌ వాడకం 300 యూనిట్ల లోపే ఉండాలి. అది దాటితే పథకానికి అనర్హులవుతారు. అదేవిధంగా ఇకపై హాజరు శాతాన్ని సీరియ్‌సగా పరిగణిస్తారు.

పైగా ఈ విద్యా సంవత్సరంలో 75 శాతం హాజరు ఉన్నవారికే.. వచ్చే విద్యాసంవత్సరంలో అమ్మ ఒడి అందిస్తారు. అలాగే ఆధార్‌ కార్డులో పాత జిల్లాల పేర్లు మార్చి కొత్త జిల్లాలను నమోదు చేసుకోవాలి. అమ్మ ఒడి కింద లబ్ధి పొందాలనుకునేవారంతా ఆధార్‌ కేంద్రాలకు వెళ్లి.. అందులో పాత జిల్లా పేరును మార్చి కొత్త జిల్లా పేరు అప్‌డేట్‌ చేసుకోవాలి. ఇవ‌న్నీ కొత్త రూల్స్‌. వీటిపైనే నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు. అమ్మ ఒడి పథకంపై సెటైర్లు వేశారు.. ``కన్న తల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్టు`` ఉంది సీఎం వైఎస్‌ జగన్ అమ్మ ఒడి పథకం తీరు అని దుయ్యబట్టారు.

తేదీల మతలబుతో ఒక ఏడాది ఎగ్గొట్టి, మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో రూ.1000 కోత పెట్టి `అర్థ ఒడి`గా మారిన పథకంపై ఇప్పుడు ఆంక్షల కత్తి ఎక్కుపెట్టి పథకం మనుగడనే ప్రశ్నార్ధకంగా మార్చేశారని ఆరోపించారు. 300 యూనిట్లు దాటి కరెంట్ వాడితే పథకం కట్ అంటూ కొత్త నిబంధన పెట్టారని విమర్శించారు. ప్రతి విద్యార్థికి 75 శాతం హాజరు తప్పనిసరి, ఆధార్‍లో కొత్త జిల్లాలను నమోదు చేసుకోవాలి, కొత్త బియ్యం కార్డు ఉంటేనే అమ్మఒడి లాంటి కండిషన్స్ వర్తిస్తాయని ముందే ఎందుకు చెప్పలేదు..? అని నిలదీశారు. ``జగన్ మోసపు రెడ్డి గారు? మీ సతీమణి గారు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు వేస్తామని ఇచ్చిన హామీని కూడా గంగలో కలిపేసారు`` అని మండిపడ్డారు. ఇక, అమ్మలని మానసిక క్షోభకి గురిచేసే ఈ ఆంక్షలు తీసేసి అర్హులందరికీ అమ్మ ఒడి పథకం వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు.