Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ త‌ప్పుడు విధానాల వ‌ల్లే.. విద్యుత్ చార్జీలు.. లోకేష్ ఫైర్‌

By:  Tupaki Desk   |   31 March 2022 5:19 PM IST
జ‌గ‌న్ త‌ప్పుడు విధానాల వ‌ల్లే.. విద్యుత్ చార్జీలు.. లోకేష్ ఫైర్‌
X
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్ చేశారు. పీపీఏలను కొనసాగించి ఉంటే విద్యుత్ ఛార్జీలు పెరిగేవి కాదన్నారు. వైసీపీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని లోకేశ్ పేర్కొన్నారు. కరెంట్ ఛార్జీల పెంపునకు నిరసనగా 'అంధకార ఆంధ్ర‌ప్రదేశ్' పేరుతో లాంతరు ప‌ట్టుకుని లోకేష్‌ వినూత్న‌ ప్రదర్శన చేపట్టారు.

ముఖ్యమంత్రి జగన్‌.. తప్పుడు నిర్ణయాలతోనే రాష్ట్ర ప్రజలపై విద్యుత్‌ ఛార్జీల భారం పడుతోందని లోకేశ్‌ విమర్శించారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన జగన్.. రకరకాల పన్నులు వేస్తూ ప్రజలపై భారం మోపారని దుయ్యబట్టారు. పీపీఏలను కొనసాగించి ఉంటే విద్యుత్ ఛార్జీలు పెరిగేవి కాదన్నారు. కరెంట్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు టీడీపీ పోరాడుతుందని లోకేశ్ స్పష్టం చేశారు.

రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా నారా లోకేశ్ వినూత్న నిరసన చేపట్టారు. లాంతరు చేత పట్టుకొని పార్టీ కార్యాలయానికి వెళ్లారు. 'అంధకార ఆంధ్ర‌ ప్రదేశ్' పేరుతో లాంతరు ప్రదర్శన చేపట్టారు. ప్రిజనరీ ఆలోచనాలతోనే పేదలపై భారం మోపారని దుయ్యబట్టారు. పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడేలా ఛార్జీలు పెంచారన్న లోకేశ్‌... ధనవంతులకు మాత్రం తక్కువ భారం పడేలా ఛార్జీలు ఉన్నాయని విమర్శించారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదని లోకేశ్ గుర్తుచేశారు. చంద్ర‌బాబు పాల‌న‌లో ఛార్జీలు పెంచామన్నది పూర్తి అవాస్తవమన్నారు. విద్యుత్ లోటు వల్ల బహిరంగ మార్కెట్టులో విద్యుత్ కొనుగోలు చేసే అంశంలో కూడా కుంభకోణం చేశారు.. త్వరలోనే వాటిని బయట పెడతామన్నారు. అప్పుడు చంద్రబాబు అమలు చేసిన సంస్కరణల వల్ల ఏపీ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉంటే.. ఇప్పుడు జ‌గ‌న్ రివ‌ర్స్‌ విధానాలతో విద్యుత్ లోటు రాష్ట్రంగా మారిందని ఆరోపించారు.