Begin typing your search above and press return to search.

ఈ ఎమ్మెల్యేను ఓడించాలని లోకేష్ బాబు స్కెచ్..

By:  Tupaki Desk   |   30 Sep 2018 9:57 AM GMT
ఈ ఎమ్మెల్యేను ఓడించాలని లోకేష్ బాబు స్కెచ్..
X
ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం వేడెక్కుతుంది. ఎవరికి వారు గుంభనంగా ఉన్నా అంతర్గతంగా అభ్యర్థుల ఎంపికలో తలనమునకలై ఉన్నారు. అన్ని నియోజకవర్గాలది ఒక ఎత్తయితే గుంటూరు జిల్లాలోని మంగళగరి నియోజకవర్గం అభ్యర్థిత్వం ఎంపిక కీలకంగా మారింది. అటు గుంటూరుకు - ఇటు విజయవాడకు మధ్యగా ఉండే ఈ నియోజవర్గ విజయం ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇక్కడ వైసీపీ నుంచి 2014లో ఆళ్ల రామకృష్ణ రెడ్డి గెలిచారు. అమరావతి రాజధాని ప్రాంతం ఈ నియోజకవర్గ పరిధి కిందకే వస్తుంది. దాంతో ఇక్కడ బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు టీడీపీ అభ్యర్థి వేటలో పడింది.

మంగళగిరిలో పద్మశాలీ సామాజిక వర్గం ఎక్కువ. సాధారణంగా ఇక్కడ పోటీ చేసి గెలిచిన అభ్యర్థులు కూడా ఆ సామాజిక వర్గం వారే ఎక్కువ. కానీ, వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ సామాజిక వర్గం వేరు. ఆయన ఎన్నికైన దగ్గర నుంచి తనదైన శైలీలో పని చేసుకుంటూ పోతున్నారు. అన్ని సామాజిక వర్గాలకు దగ్గరయ్యారు. ఏ సమస్య మీదైనా ముందుగా స్పందిస్తూ అధికార పార్టీ నేతల మీద పై చేయిగా ఉన్నారు. ఈయన ప్రవేశపెట్టిన రూ.1కే భోజన పథకం అందరి ఆదరాభిమానాలు చూరగొంటుంది. ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవీ ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు. ఈయన సామాజిక వర్గం కూడా పద్మశాలినే. కానీ, ఆయనకు ఓటర్లను పెద్దగా ప్రభావితం చేయలేకపోతున్నారు. టీడీపీ అరాచకాలపై ప్రతీసారి స్పందిస్తున్న రామక‌ృష్ణను ఓడించాలని ప్రధానంగా టీడీపీ మంత్రి - సీఎం కుమారుడు లోకేష్ దృష్టి సారించారు. పోటీకి సై అంటున్న వారి లిస్టంతంటిని వడబోసే కార్యక్రమం మొదలుపెట్టారు.

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ కేవలం 12 ఓట్లతో పోయినసారి ఎన్నికల్లో గెలిచారు. కాబట్టి ఈ సారీ బలమైన బీసీ సామాజికవర్గం అభ్యర్థిని నిలబెట్టాలని టీడీపీ భావిస్తుంది. పోటీ చేసేందుకు పోటీ పడుతున్న తెలుగు తమ్ముళ్లు లిస్ట్ కూడా పెద్దదిగా ఉంది. వైఎస్ హయాంలో మంత్రిగా పని చేసిన మాజీ మంత్రి హనుమంతరావు ముందు వరుసలో ఉన్నారు. ఈయన టీడీపీలో చేరారు. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తనకు టిక్కెట్ కేటాయిస్తే విజయం ఖాయమని టీడీపీ అధిష్ఠానానికి చెబుతున్నారట. విజయవాడ మాజీ మేయర్ పంచుమర్త అనురాధ కూడా ఇక్కడ పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. బీసీలు నియోజకవర్గంలో ఎక్కువగా ఉండటంతో తన విజయం తథ్యమని చెబుతున్నారట. మరోవైపు హనుమంతరావు బంధువు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూడా సీరియస్ గా ప్రయత్నిస్తున్నారని సమాచారం. అయితే, ఈమె టీడీపీలో ఇంకా చేరలేదు. బీసీలు కాకుండా కమ్మ సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే పోటీ చేసేందుకు పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి తనకు టిక్కెట్ కేటాయించాలని కోరుతున్నారట. ఇప్పటికే గుంటూరు జిల్లాలో 8 మంది కమ్మ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రధాన మంగళగిరి కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ప్రకటించాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారట. ఇలా చాలా మంది నేతలు రాజధానికి కీలకంగా ఉన్న మంగళగిరికి లోకేష్ నే పోటీ చేయించాలనే ప్రతిపాదనను పెట్టారట. లోకేష్ పోటీ చేస్తే బాగుంటుందని కొంతమంది కోరుతున్నారట.

అమరావతికి రాజధానికి కేంద్రంగా ఉన్న మంగళగిరి నియోజక వర్గం గెలుపు కోసం టీడీపీ అన్ని ప్రయత్నాలు చేస్తుంటే వైసీపీ మాత్రం ఆసక్తిగా గమనిస్తోంది. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ పై వేస్తున్న స్కెచ్ ఎంతవరకు విజయవంతమవుతుందో వేచి చూడాలి. నియోజకవర్గంలో అధికార టీడీపీ పాలనకు ప్రజలు విసిగిపోయి ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. మరో వైపు జనసేన కూడా పద్మశాలీ సామాజిక వర్గం నుంచే పోటీలో దించే అవకాశం ఉంది. ఇదే టీడీపీకి మైనస్ అవుతుంది. సో అల్టిమేట్ గా మంగళగిరి ఎవరికి దక్కుతుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.