Begin typing your search above and press return to search.

బీజేపీ శాపం స‌రే లోకేష్‌...మ‌న వాటా సంగ‌తేంటి?

By:  Tupaki Desk   |   7 April 2018 5:00 AM IST
బీజేపీ శాపం స‌రే లోకేష్‌...మ‌న వాటా సంగ‌తేంటి?
X
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన‌ తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్యలు దేశ‌వ్యాప్తంగా ఆయా రాజ‌కీయ పార్టీల‌ను భ‌గ్గుమ‌నేలా చేసిన సంగ‌తి తెలిసిందే. బీజేపీ 38వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీని ఎదుర్కోవడానికి కుక్కలు - పిల్లులు - బాతులు - ముంగిసలన్నీ ఏకమయ్యాయని ఎద్దేవా చేశారు. ఈ కామెంట్లు అమిత్‌షా యొక్క విజ‌య‌గ‌ర్వాన్ని చాటుతున్నాయ‌ని ప‌లువురు వ్యాఖ్యానించారు. అయితే ఈ ప‌రిణామంపై ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు - మంత్రి నారా లోకేష్ మండిప‌డ్డారు.

ఐదు కోట్ల మంది ప్రయోజనాల కోసం పోరాడుతుంటే కుక్కలతో పోలుస్తారా? భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి నారా లోకేష్‌ మండిపడ్డారు. హక్కుల కోసం ఉద్యమిస్తుంటే పిల్లులు - పాములు - ముంగీసలని అంటున్నారని విమ‌ర్శించారు. ఏపీని నాలుగేళ్లు అంధకారంలో పెట్టిన బీజేపీ, ఇప్పుడు తలపొగరుతో మనల్ని జంతువులతో పోలుస్తోందని నారా లోకేష్‌ ట్వీట్లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ పార్టీకి వినాశకాలం దాపురించిందని.. అందుకే విపరీత బుద్ధి ప్రదర్శిస్తుందని లోకేష్ మండిపడ్డారు. ప్రస్తుతం బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని వివరించారు. అయితే లోకేష్ ట్వీట్‌ పై ప‌లువురు ఎంపీలు ఘాటుగానే రియాక్ట‌వుతున్నారు.

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ ను నాలుగేళ్లు అంధకారంలో బీజేపీ ఉంచింద‌ని ఇప్పుడు విమ‌ర్శిస్తున్న లోకేష్ ఆ పార్టీతో పొత్తు ఉన్న స‌మ‌యంలో ఈ విష‌యాన్ని ఎందుకు గ‌మ‌నించ‌లేద‌ని, ఎందుకు నిల‌దీయ‌లేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. రాష్ట్రం అంధ‌కారం అయ్యే స‌మ‌యంలో ప్రేక్ష‌క‌పాత్ర వ‌హించిన ఇప్పుడు స‌మ‌యం గ‌డిచిపోయిన త‌ర్వాత‌....ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు మైలేజీ వ‌స్తుంద‌ని..త్వ‌ర‌లో ఎన్నిక‌లు ముంచుకువ‌స్తున్నాయ‌ని భావిస్తూ హోదా గ‌ళం ఎత్తుకున్నారా? అంటూ ప‌లువురు కామెంట్లు చేస్తున్నారు. బీజేపీకి శాపం పెట్ట‌డం స‌రే కానీ అందులో టీడీపీ వాటా సంగ‌తి ఏంటో ఎందుకు తేల్చ‌డం లేద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.