Begin typing your search above and press return to search.

లోకేష్ పోటీ... సోష‌ల్ మీడియా గెలిచింది

By:  Tupaki Desk   |   27 Jun 2018 7:00 AM IST
లోకేష్ పోటీ... సోష‌ల్ మీడియా గెలిచింది
X
ఎట్ట‌కేల‌కు త‌న‌పై ప‌డిన ముద్ర‌ను తొల‌గించుకునే కీల‌క నిర్ణ‌యం ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు - మంత్రి లోకేష్ తీసుకున్నారు. ఇన్నాళ్లు ఇటు తెలుగుదేశం పార్టీని - అటు పార్టీ నాయ‌కుడు చంద్ర‌బాబును ఇర‌కాటంలో ప‌డేసేలా ప్ర‌త్య‌ర్థులు చేసిన విమ‌ర్శ‌ల‌కు ఫుల్‌ స్టాప్ పెట్టే ప్ర‌క‌ట‌న చేశారు. అయితే బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేయ‌కుండా...అమరావతిలో మీడియాతో చిట్ చాట్‌ గా మాట్లాడుతూ లోకేష్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇంత‌కీ లోకేష్ తీసుకున్న నిర్ణ‌యం ఏంటంటే...రాబోయే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం.

ఔను. మంత్రి లోకేష్ అంటేనే అంద‌రూ చేసే విమ‌ర్శ‌..అడ్డ‌దారిలో ప్ర‌జాప్ర‌తినిధిగా లోకేష్‌ ను సీన్‌ లోకి తెచ్చార‌ని. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేసే ధైర్యం లేక‌..ఎమ్మెల్సీగా ఎన్నికై...తండ్రి ముఖ్య‌మంత్రి కావ‌డంతో మంత్రి ప‌ద‌విని పొందార‌నేది ఆరోప‌ణ‌. ఈ విష‌యం పూర్తిగా వాస్త‌వం అనే మాట‌ను తెలుగుదేశం శ్రేణులు కూడా అంగీకరిస్తాయి. మంత్రి ప‌ద‌వి చేప‌ట్టి రెండేండ్లు అవుతున్న‌ప్ప‌టికీ...మ‌రోవైపు ఎన్నిక‌ల గ‌డువు స‌మీపిస్తున్నప్ప‌టికీ రాబోయే ఎన్నిక‌ల గురించి లోకేష్ ఏనాడు ప్ర‌క‌టించ‌లేదు. తాజాగా ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. రాబోయే ఎన్నికలలో ఖ‌చ్చితంగా ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేస్తానని వెల్ల‌డించారు. అధిష్టానం ఎక్కడ నుంచి పోటి చేయమంటే.. అక్కడి నుంచి పోటీకి తాను సిద్ధమ‌ని లోకేష్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో లోకేష్ ప్ర‌క‌ట‌న‌పై ఆస‌క్తి నెల‌కొంది. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వస్తే కఠినంగా ఉంటామ‌ని ఆయ‌న తెలిపారు. కాగా, లోకేష్‌ ఫై సోష‌ల్ మీడియాలో సెటైర్లు పేలుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ ప్ర‌క‌ట‌న కూడా ఇందులో భాగ‌మ‌నే అంటున్నారు.

ఇదిలాఉండ‌గా...నిరుద్యోగ భృతిపై వచ్చే కేబినెట్‌ లో స్పష్టత వస్తుందని లోకేష్ వెల్ల‌డించారు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో.. టీడీపీది నిస్వార్ధ పోరాటమ‌ని జ‌బ్బ‌లు చ‌రుచుకునే ప్ర‌య‌త్నం చేశారు. కేంద్రం ఇచ్చే ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. ఐదారు వేల కోట్ల రూపాయల మేర రాయితీలను రాష్ట్రమే భరిస్తోంది.. ఇక కేంద్రం ఎందుకని ఆయ‌న అన్నారు. విభజన చట్టంలో ఉండే హమీల అమలు కోసం పోరాడుతున్నామ‌ని తెలిపారు. కాగా, ఇన్నేళ్లుగా ఎందుకు ఈ హామీల విష‌య‌మై పోరాటం చేయ‌లేదో లోకేష్ క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.