Begin typing your search above and press return to search.

రైతులకు న్యాయం చేయండి జగన్

By:  Tupaki Desk   |   14 Aug 2019 7:00 PM IST
రైతులకు న్యాయం చేయండి జగన్
X
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి - ఎమ్మెల్సీ నారా లోకేశ్ మరోసారి విమర్శలు చేశారు. జగన్ ప్రతిపక్షంలో ఉండగా తన మనుషుల చేత కేసులు వేయించి గోదావరి- పెన్నా - పురుషోత్తపట్నం - పట్టిసీమ - చింతలపూడి ప్రాజెక్టులు ఆపడానికి ప్రయత్నం చేశారని ట్విట్టర్ వేదికగా లోకేశ్ ఆరోపించారు. జగన్ తన చర్యలతో రైతుల నోటిలో మట్టికొట్టారని - ప్రతిపక్షంలో ఉండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన పాపం ఇప్పుడు రివర్స్ అయిందని అన్నారు.

మీరు వేసిన కేసుల వల్ల ఇప్పుడు అది మీ ప్రభుత్వానికే పెద్ద తలనొప్పిగా మారిందని అన్నారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించిన పలు ఎత్తిపోతల పథకాలపై గ్రీన్ ట్రిబ్యునల్ కొరడా ఝుళిపించిందని అన్నారు. గోదావరి -పెన్నా - పురుషోత్తపట్నం - చింతలపూడి పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులను ఆపివేయాలని ఆదేశాలు జారీ చేసిందని ఓ పేపర్ క్లిప్పింగ్ ను జత చేసి లోకేష్... ఇపుడు అన్ని అనుమతులు తెచ్చుకుని - వెంటనే ప్రాజెక్టులు పూర్తి చేసి పాపం కడుక్కోండని తన ట్విట్టరులో విమర్శించారు.

పర్యావరణ నిబంధనలని ఉల్లఘించారని గోదావరి - పెన్నా - పురుషోత్తపట్నం - పట్టిసీమ - చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టులను ఆపేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. వట్టి వసంత్ కుమార్ వేసిన పిటిషను విచారించిన ఎన్ జీ టీ ఈ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.