Begin typing your search above and press return to search.

జగన్ గారూ.. రక్తం కారుతున్న ఇతనూ పెయిడ్ ఆర్టిస్టేనా?

By:  Tupaki Desk   |   13 Sept 2019 10:50 AM IST
జగన్ గారూ.. రక్తం కారుతున్న ఇతనూ పెయిడ్ ఆర్టిస్టేనా?
X
ఏపీలో అధికార.. విపక్షాల మధ్య పోరు అంతకంతకూ తీవ్రమవుతోంది. జగన్ పాలనపై విరుచుకుపడుతున్న టీడీపీ నేతల తీరును ఏపీ అధికారపక్షం ఆధారాలతో ఖండిస్తోంది. పెయిడ్ ఆర్టిస్ట్ లను రంగంలోకి దింపి సీన్ పండేలా ప్రయత్నిస్తోందన్న తీవ్రమైన ఆరోపణ చేయటమే కాదు.. ఇప్పటికే ఆధారాలు చూపిస్తూ ఎండకడుతోంది. ఇదిలా ఉంటే.. ఛలో ఆత్మకూరు పేరుతో ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చి.. రచ్చ రచ్చ చేసిన వైనం మర్చిపోకముందే.. మరో ఉదంతం తెర మీదకు వచ్చింది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాష్టీకాలకు టీడీపీ కార్యకర్తలు బలి అవుతున్నట్లుగా లోకేశ్ ఆరోపిస్తున్నారు. తాను చేసిన ఆరోపణలకు బలం చేకూరేలా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఒక ఫోటోను పోస్ట్ చేశారు. రక్తం కారుతున్న కార్యకర్త షేక్ సలీం ఫోటోను పోస్ట్ చేసిన లోకేశ్.. . ‘ఈ రాక్షస రాజ్యంలో వైకాపా గూండాల అరాచకత్వానికి ఇంకెంతమంది నెత్తురు చిందించాలి? జగ్గయ్యపేట పట్టణంలో తెదేపా మైనారిటీ కార్యకర్త షేక్ సలీంపై కత్తులతో దాడిచేశారు. ఇవేనా మీ పాలనలో ప్రశాంతంగా ఉన్న శాంతిభద్రతలు హోమ్ మంత్రిగారు? లేక ఇతన్ని కూడా పెయిడ్ ఆర్టిస్టు అని అంటారా?’ అని ప్రశ్నించారు.

మరో ట్వీట్లో మరింత ఘాటుగా ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. ‘శభాష్ వైఎస్ జగన్ గారూ !! మీ పాలన అద్భుతం. ఎంత అద్భుతంగా ఉందంటే, పేదవాడికి పట్టెడు అన్నం దొరక్కపోయినా, మీ వైకాపా గూండాల దాహానికి మా కార్యకర్తల రక్తం - ఆకలైతే నరకడానికి పొలాల్లో పంటలు ఉన్నాయి. ముగిసిందనుకున్న ఫ్యాక్షన్ భూతాన్ని రాష్ట్రం మీద వదిలారు.’ అని మరో ట్వీట్ చేశారు. ఈ రెండు ట్వీట్లు ఇప్పుడు సంచలనంగా మారాయి. మరి.. దీనికి కౌంటర్ ట్వీట్లు ఎలా ఉండనున్నాయి అన్నది ఉత్కంటగా మారింది.