Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌ కు లోకేశ్ గ్రీటింగ్స్ చెప్పారండోయ్‌!

By:  Tupaki Desk   |   2 Sept 2017 1:43 PM IST
ప‌వ‌న్‌ కు లోకేశ్ గ్రీటింగ్స్ చెప్పారండోయ్‌!
X
ఏపీలో అధికార పార్టీ టీడీపీకి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌దవితో పాటు తాజాగా ఏపీ కేబినెట్‌ లో కీల‌క శాఖ‌ల మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నారా లోకేశ్ షెడ్యూల్ దాదాపుగా ఫుల్ బిజీగా ఉంటుంద‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే... పార్టీలో అధినేత నారా చంద్ర‌బాబునాయుడు త‌ర్వాత అత్యుత‌న్న ప‌ద‌విలో ఉండ‌టంతో పాటు అదే చంద్రబాబు కేబినెట్ లో ఆయ‌న త‌ర్వాత కీల‌క శాఖ‌ల‌ను నిర్వ‌ర్తిస్తున్న మంత్రిగా లోకేశ్ నిజంగానే బిజీనే. ఓ వైపు పార్టీ కార్య‌క్ర‌మాలు - మ‌రోవైపు త‌న‌కే కేటాయించిన శాఖ‌ల వ్య‌వ‌హారాలు... రెండింటినీ స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ముందుకు సాగాలంటే నిమిషం తీరిక లేకుండా క‌ష్ట‌ప‌డాల్సిందే.

ఈ క్ర‌మంలో లోకేశ్‌ కు తీరిక దొరికే స‌మ‌య‌మే చిక్క‌డం లేద‌న్న‌ది టీడీపీ నేత‌ల మాట‌. ఎలాగూ యువ త‌రంగ్‌ గా ఉన్నారు కాబ‌ట్టి... ఆ మాత్రం క‌ష్ట‌ప‌డితే భ‌విష్య‌త్తు బాగానే ఉంటుందిలే అని కూడా కొంద‌రు భావిస్తున్నారు. ఇంత బిజీలో ఉన్నా కూడా నారా లోకేశ్ కొన్ని విష‌యాల‌ను మాత్రం అస్స‌లు మ‌రిచిపోవడం లేద‌ట‌. అప్పుడెప్పుడో టీఆర్ ఎస్ యువ‌నేత‌ - తెలంగాణ కేబినెట్‌ లో కీల‌క శాఖ‌ల మంత్రిగా ఉన్న క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు జ‌న్మ‌దినం సంద‌ర్భంగా లోకేశ్ ఆయ‌న‌కు బ‌ర్త్ డే గ్రీటింగ్స్ చెప్పి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. గ్రేట‌ర్ హైద‌రాబాదు మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఈ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలిన సంగ‌తి తెలిసిందే.

అయితే వాటిని అంత‌గా ప‌ట్టించుకోని లోకేశ్... కేటీఆర్‌ కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు చెబుతూ ట్విట్ట‌ర్‌ లో మెసేజ్ పెట్టారు. దానికి కేటీఆర్ కూడా బాగానే స్పందించారు. తాజాగా అలాంటి సంద‌ర్భ‌మే మ‌రోమారు రిపీట్ అయ్యింది. నేడు టాలీవుడ్ అగ్ర‌న‌టుడు - జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజ‌న్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్‌ కు నారా లోకేశ్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ట్విట్ట‌ర్ ద్వారా ప‌వ‌న్‌కు లోకేశ్ బ‌ర్త్ డే గ్రీటింగ్స్ తెలిపారు. "పవన్ కల్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా" అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.