Begin typing your search above and press return to search.

ఏపీ ఎమ్మెల్సీల్లో అత్యంత ధ‌న‌వంతులు వీరే!

By:  Tupaki Desk   |   14 Aug 2022 9:54 AM IST
ఏపీ ఎమ్మెల్సీల్లో అత్యంత ధ‌న‌వంతులు వీరే!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌మండ‌లిలో ఏకంగా 75 శాతం మంది కోటేశ్వ‌రులు ఉన్నారు. శాస‌న‌మండ‌లిలో మొత్తం స‌భ్యుల సంఖ్య 58 కాగా ఇందులో 75 శాతం మంది కోట్ల రూపాయ‌ల‌కు అధిప‌తులేన‌ని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌), ఏపీ ఎలక్షన్‌ వాచ్‌ తాజా అధ్యయనం పేర్కొంది.

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఎమ్మెల్సీల్లో కెల్లా అత్యంత ధ‌న‌వంతుడ‌ని అధ్య‌య‌నం తెలిపింది. రూ.369 కోట్లకు పైగా ఆస్తుల‌తో నారా లోకేష్‌ అత్యంత ధనవంతుడైన ఎమ్మెల్సీగా నిలిచారు. ఇక రెండో స్థానంలో రూ.101 కోట్లతో బీజేపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఉన్నారు. మూడో స్థానంలో రూ.36 కోట్లతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ టి.మాధవరావు నిలిచారు.

కాగా అతి త‌క్కువ ఆస్తులున్న ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్‌ ఎమ్మెల్సీ పి.రఘువర్మ ఉన్నారు. ఆయ‌న‌కు కేవ‌లం రూ.1,84,527 ఆస్తులు మాత్ర‌మే ఉన్నాయి.

కాగా అత్య‌ధిక ఆస్తులున్న 75 శాతం మంది ఎమ్మెల్సీల్లో అధికార వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు 22 మంది ఉండ‌గా ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలు 11 మంది ఉన్నారు.

కాగా, 20 మంది ఎమ్మెల్సీలపై క్రిమినల్‌ కేసులున్నాయి. 5–12వ తరగతి మధ్య ఎనిమిది మంది చ‌దివారు. మ‌రో 40 మంది డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి ఉన్నారని అధ్య‌య‌నంలో తేలింది.

ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు.. అభ్యర్థులు అందించిన సమాచారం ఆధారంగానే ఈ అధ్యయనం చేశామ‌ని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌), ఏపీ ఎలక్షన్‌ వాచ్ తెలిపాయి. మొత్తం 58 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్సీలలో 48 మంది వివరాలను మాత్ర‌మే విశ్లేషించామ‌ని పేర్కొన్నాయి. మ‌రో 10 మంది ఎమ్మెల్సీల‌ అఫిడవిట్లు అందుబాటులో లేవ‌ని వెల్ల‌డించాయి. వివ‌రాలు అందుబాటులో ఉన్న 48 మంది ఎమ్మెల్సీల్లో 75 శాతం మంది అంటే 36 మంది కోటీశ్వరులేనని స్పష్టమైంది.