Begin typing your search above and press return to search.

పవన్... లోకేష్... అక్కడ నుంచేనా...?

By:  Tupaki Desk   |   27 April 2022 9:00 AM IST
పవన్... లోకేష్... అక్కడ నుంచేనా...?
X
రాజకీయాల్లో రాణించాలీ అంటే ఫేటూ సీటూ ముఖ్యం. ఆ మీదట రూటు కూడా వేసుకోవాలి. ఏపీలో చూస్తే కొందరు కీలకమైన నాయకులకే సీటు సమస్యగా ఉందిట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఏ సీటు నుంచి పోటీ చేస్తారు అన్నది అయితే ఇప్పటికి క్లారిటీ లేదు. ఆయన గోదావరి జిల్లాలలో ఏదో ఒక చోటు నుంచి పోటీ చేస్తారు అని ప్రచారం అవుతోంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు. మరో వైపు రాయలసీమ నుంచి కూడా పవన్ రంగంలో ఉంటారు అంటున్నారు.

అలా అనంతపురం నుంచి తిరుపతి సీటు దాకా పవన్ పేరు వినిపిస్తోంది. ఇక విశాఖ నుంచి కూడా పవన్ పోటీకి దిగుతారు అని అంటున్నారు. మొత్తానికి ఎన్నికలకు రెండేళ్ళ వ్యవధి ఉన్నా కూడా సీటు విషయంలో జనసేనాని ఏ రకమైన డెసిషన్ తీసుకోలేదు అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఇదే రకమైన పరిస్థితి తెలుగుదేశంలో చినబాబు లోకేష్ కి కూడా ఉంది.

తెలుగుదేశంలో చినబాబు నంబర్ టూగా ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా మంగళగిరి అని చెబుతున్నా ఇంకా పూర్తి స్థాయి పొలిటికల్ యాక్టివిటీని అక్కడ మొదలెట్టలేదు. . మరో వైపు చూస్తే త్వరలో చినబాబు పాదయాత్రను కూడా స్టార్ట్ చేస్తారు అని అంటున్నారు. అలా అయితే ఆయన ఎన్నికల వేళ దాకా అలా జనంలోనే ఉండాలి. అపుడు తనకంటూ ఒక స్ట్రాంగ్ సీటుగా మంగళగిరిని మార్చుకోకపోతే గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయన్న చర్చ కూడా ఉంది.

పవన్ అయినా లోకేష్ అయినా ఇప్పటి నుంచే ఒక సీటుని కంఫర్మ్ చేసుకుని అక్కడ గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ ని వాకబు చేస్తూ వీలైనప్పుడల్లా అక్కడకి వచ్చి జనాలతో మమేకం అయితేనే ఫలితం ఉంటుంది అంటున్నారు. నిజానికి ఈ ఇద్దరూ రాష్ట్ర నేతలు, అధినాయకులు కూడా. కానీ జనాలకు మాత్రం తమ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఎవరు ఉన్నా ఒక్కటే.

వారు తమకు అందుబాటులో ఉండాలని గట్టిగా కోరుకుంటారు. అదే విధంగా తమతో కలసిపోయే వారికే ప్రజలు ప్రాధాన్యత ఇస్తారు. ఒకపుడు చివరి నిముషంలో నామిమేషన్ వేసిన ఎన్టీయార్ కల్వకుర్తిలో చిత్తరంజన్ దాస్ మీద ఓటమిని చవిచూశారు. అందువల్ల రాజకీయాల్లో సినీ గ్లామర్ కానీ లెగసీ కానీ చరిష్మా కానీ అన్నీ ఉన్నా జనాలతో డైరెక్ట్ కనెక్టివిటీయే ఎపుడూ కాపాడుతుంది. గెలుపు అందిస్తుంది. అందుకే ఇప్పటి నుంచే సీటు చూసుకోవాలి. అలాగే చూసుకున్న సీటులో ఇప్పటి నుంచే యాక్టివిటీని కూడా స్టార్ట్ చేయాలి.