Begin typing your search above and press return to search.

పవన్ సీఎం...లోకేష్ డిప్యూటీ... ?

By:  Tupaki Desk   |   20 March 2022 10:00 PM IST
పవన్ సీఎం...లోకేష్ డిప్యూటీ... ?
X
అపుడే మీరూ మీరూ చుట్టాలైపోయారెంట్రా అని ఒక సినిమాలో పాత్రధారి సెటైర్ వేస్తాడు. అదిపుడు ఆ రెండు పార్టీల గురించి చెప్పుకోవాలీ అంటే అపుడే బంధాలు బాగా కలసిపోయాయా అనుకోవాల్సిందే. నిజానికి తెర వెనక టీడీపీ, జనసేనల మధ్య గట్టి బంధమే ఉంది. అయితే ఈ మధ్య దాకా సాగిన వన్ సైడ్ లవ్ ని కాస్తా టూ సైడ్ లవ్ గా పవన్ ఆవిర్భావ సభలో మార్చేసారు అని అంటున్నారు.

ఈ నేపధ్యం నుంచి చూసినపుడు పవన్ కళ్యాణ్ అన్ని పార్టీలను కలుపుకోవాలి అని చెప్పిన మాట వెనక అర్ధం పరమార్ధం టీడీపీయే అని అంటున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు దాదాపుగా కన్ ఫర్మ్ అయినట్లే. అయితే ఒకే ఒక విషయంలోనే కొంత ఆలోచన ఉంది.

అదేంటి అంటే సీఎం పదవి విషయంలో. వచ్చే ఎన్నికల తరువాత తాను సీఎం అయి తీరాలని పవన్ పట్టుపడుతున్నారు. దానికి జనసేన నుంచి కూడా పూర్తి స్థాయిలో పట్టుదల కనిపిస్తోంది. ఎపుడూ మేమేనా త్యాగరాజులం అయ్యేది, మీరు కూడా ఈసారి ఆశలు తగ్గించుకోండి అన్నదే జనసేన నుంచి వస్తున్న సందేశం.

దాంతో పవన్ తో పొత్తుకు టీడీపీ వైపున అనేక రకాలైన అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. విడిగా పోటీ చేస్తే రెండు పార్టీలకు తీరని నష్టమే అని తెలుస్తోంది. అందుకే ఏదో విధంగా ఈ పొత్తుని పట్టాలెక్కించేందుకే అటూ ఇటూ గట్టిగానే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నరు. ఈ నేపధ్యంలో చంద్రబాబు అతి పెద్ద త్యాగాన్నే చేయాల్సి ఉంటుందని టాక్.

తాను సీఎం సీటుని విడిచిపెట్టి పవన్ కి చాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలో కూడా టీడీపీది పై చేయి సాధించేలా ఏమేమి చేయవచ్చు అన్నది కూడా ఆలోచిస్తున్నారుట. వచ్చిన సీట్ల ఆధారంగా అధికార వాటాని నిర్ణయించుకోవాలని టీడీపీలో సీనియర్లు అంటూంటే జనసేన నుంచి మాత్రం అధికార వాటా అన్నది పొత్తులతో పాటే తేలాలన్న డిమాండ్ వస్తోందిట.

ఇక మొత్తం అయిదేళ్ళూ ఒకరే కాకుండా చెరి రెండున్నరేళ్ళుగానా. లేక మూడేళ్ళు రెండేళ్ల ఫార్ములానా ఏది ఎంచుకోవాలి అన్నది కూడా ఆలోచిస్తున్నారు. అయితే సహజంగా ఎక్కువ సీట్లు పోటీ చేసే టీడీపీకే ఎక్కువ సీట్లు ఎన్నికల తరువాత వస్తాయి కాబట్టి మూడేళ్ళ పాటు టీడీపీ సీఎం ఉంటే రెండేళ్ల పాటు జనసేన నుంచి సీఎం ఉంటారని అంటున్నారు.

ఇక మొదటి దఫా ఎవరు సీఎం కావాలన్న దాని మీద కూడా చర్చలు సాగుతున్నాయని అంటున్నరు. అయితే ఫస్ట్ చాన్స్ తమకే ఇవ్వాలని జనసేన పట్టుబడితే మాత్రం వారికే ఇవ్వాల్సి ఉంటుంది. అలా కనుక జరిగితే పవన్ సీఎం గా, లోకేష్ డిప్యూటీ సీఎం గా 2024 తరువాత పవన్ పేర్కొన్నట్లుగా ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అంటున్నారు.

ఈ నేపధ్యంలో చంద్రబాబు పాత్ర ఎలా ఉంటుంది అంటే కూటమి సర్కార్ కి చైర్మన్ గా ఆయన కీలకమైన పాత్రనే పోషిస్తారు అంటున్నారు. అంటే కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా బాబుతోనే అంతా అన్నట్లుగా ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి చూస్తే పవన్ సీఎం, లోకేష్ డిప్యూటీ అన్న ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. చూడాలి మరి దీని పర్యవశానాలు ఎలా ఉంటాయో.