Begin typing your search above and press return to search.

గన్నవరం బరిలో ఆ ఇద్దరు....నిజమేనా...?

By:  Tupaki Desk   |   1 Nov 2019 11:00 PM IST
గన్నవరం బరిలో ఆ ఇద్దరు....నిజమేనా...?
X
ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న విధంగా కృష్ణా జిల్లా గన్నవరంలో రాజకీయం తయారైంది. ఇంకా ఇక్కడ వల్లభనేని వంశీ రాజీనామా చేయలేదు. అప్పుడే ఉపఎన్నిక....ఎవరు బరిలో ఉంటారనే దానిపై తీవ్ర చర్చ నడుస్తోంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలని పరిశీలిస్తే వంశీ వైసీపీలోకి వెళ్ళడం దాదాపు ఖాయమైనట్లే. నవంబర్ 3 లేదా 4వ తేదీల్లో వంశీ వైసీపీ కండువా కప్పుకోవడం ఖాయమంటున్నారు. కాకపోతే వైసీపీలోకి వెళ్ళేముందు వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. కాబట్టి రాజీనామా చేస్తే - దాన్ని స్పీకర్ ఆమోదిస్తే అక్కడ ఆరు నెలల్లో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది.

ఇక ఈ ఉప ఎన్నికలో ఎవరు బరిలో ఉంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ స్థానంలో టీడీపీ - వైసీపీ - జనసేన నుంచి ఎవరు పోటీ చేస్తారు అనే దానిపై రాజకీయ వర్గాల్లో విపరీతమైన చర్చ నడుస్తోంది. మొన్న ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఓటమి పాలైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ - జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్ కోసం పోటీ చేసే అవకాశం లేకపోలేదు. అయితే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటే ఎవరు పోటీ చేస్తారనేది మరో చర్చ.

ఇక టీడీపీ తరుపున లోకేశ్ కాకపోతే - మాజీ మంత్రి దేవినేని ఉమా - గద్దె రామ్మోహన్ భార్య అనురాధ - తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ కూడా పోటీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. అటు వైసీపీ తరుపున ఎక్కువ శాతం వంశీ పోటీ చేసే అవకాశం ఉంది. మరి వంశీ పోటీ చేస్తే వైసీపీ ఇన్ చార్జ్ యార్ల‌గ‌డ్డ వెంకట్రావు భవిష్యత్ ఏంటో అర్ధం కానీ పరిస్థితి. ఒకవేళ వంశీకి టికెట్ ఇస్తే వెంకట్రావు టీడీపీలోకి వచ్చి పోటీ చేస్తారనే టాక్ కూడా వస్తుంది. అసంతృప్తితో ఉన్న వెంక‌ట్రావును టీడీపీలోకి ఆహ్వానించాల‌ని చంద్ర‌బాబు ఇప్ప‌టికే జిల్లా టీడీపీ నేత‌ల‌కు సూచించారు.

ఏదేమైనా ఈ యేడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో మంగ‌ళ‌గిరిలో లోకేష్‌ - గాజువాక‌ - భీమ‌వ‌రంలో ప‌వ‌న్ ఇద్ద‌రూ ఎమ్మెల్యేలుగా కూడా గెల‌వ‌లేక‌పోయారు. ఇప్పుడు పార్టీలో కీల‌క ప‌ద‌వుల్లో వారిద్ద‌రు మ‌ళ్లీ గ‌న్న‌వ‌రంలో పోటీ ప‌డాల్సి వ‌చ్చినా... లేదా వీరిద్ద‌రిలో ఒక‌రు రంగంలో ఉన్నా గ‌న్న‌వ‌రం ఉప ఎన్నిక నేష‌న‌ల్ వైడ్‌ గా సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్ అవుతుంది. అయితే గన్నవరం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. 1983 - 85 - 1999 - 2009 - 2014 - 2019 ఎన్నికల్లో ఆ పార్టీనే విజయం సాధించింది. మరి ఈ సారి ఉప ఎన్నికలోస్తే గెలుపు అవకాశాలు ఎవరి వైపు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.