Begin typing your search above and press return to search.

నిన్ను పెంచుకోవడానికి నాన్నని తగ్గించాలా...?

By:  Tupaki Desk   |   23 Dec 2021 5:00 AM IST
నిన్ను పెంచుకోవడానికి నాన్నని తగ్గించాలా...?
X
చంద్రబాబు మీద వెన్నుపోటు వీరుడని, రాజకీయ కుట్రలకు కేరాఫ్ అని ప్రత్యర్ధుల నుంచి ఎన్నో విమర్శలు వస్తే రావచ్చు కాక. అయినా సరే అంతకు మించి ఆయన మీద ఏపీ జనాలలో బలమైన ముద్ర మరోటి ఉంది. ఆయన గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని అంతా ఒప్పుకుంటారు. ఆయనను పనిమంతుడు అని అంటారు. చంద్రబాబు పట్టుదల కానీ, రాజకీయాల మీద ఆయనకు ఉన్న ఆకాంక్ష, ప్రేమ కానీ ఈ తరం వారికి కానీ భారి తరాలకు కానీ ఎప్పటికీ స్పూర్తిగానే ఉంటాయి.

ఏడు పదుల వయసు దాటినా చంద్రబాబులో అదే ధాటి ఉంది. అదే స్పీడ్ కూడా ఉంది. ఇక ఆయనని పొలిటికల్ గా రీప్లేస్ చేసే నేతను కొన్ని విషయాల్లో ఊహించుకోవడం కష్టం. అయితే కాలం మారినపుడు పాత తరం వెనక్కు జరుగుతుంది. అలా కొత్త తరం ముందుకు వస్తుంది. ఇది ప్రకృతి సహజం. ఆ విధంగా జగన్ అనే యువ నాయకుడి హవా ఇపుడు సాగుతోంది. అంత మాత్రాన చంద్రబాబుని నెట్టేసినట్లు కాదు, ఆయన ఓడినట్లు అంతకన్నా కాదు.

ఇదిలా ఉంటే ఏ తండ్రి అయినా తన కంటే కొడుకు గొప్పగా ఉండాలని కోరుకుంటాడు. అంతే కాదు, తాను సాధించని విజయాలు చేరని అంచులను కొడుకు తాకాలని నిస్వార్ధంగా ఆరాటపడతాడు. చంద్రబాబులోని పుత్ర ప్రేమ కూడా అలాంటిదే. ఆయన కుమారుడు లోకేష్ తన కంటే ఎత్తు ఎదగాలని గట్టిగానే కోరుకుంటున్నారు.

అయితే ఈ రోజుకీ చూసుకుంటే లోకేష్ ఇంకా జూనియర్ గానే ఉన్నారు. ఆయన భాష కానీ రాజకీయ పరిణతి కానీ పార్టీ అధినేత హోదాను అందుకునేందుకు సరిపోవు అన్నది సొంత పార్టీలోనే ఉన్న భావన. చంద్రబాబునే మళ్ళీ సీఎం గా చూడాలని టీడీపీలోనే అత్యధిక శాతం ఈ రోజుకీ కోరుకుంటారు.

బాబు నాయకత్వాన పనిచేస్తామనే అంతా చెబుతారు. అయితే లోకేష్ ఈ మధ్య తరచూ ఒకే మాట అంటున్నారు. తాను అగ్రెస్సివ్ అని చెప్పుకోవడానికి అన్నట్లుగా ఆయన ఒక వింత పోలిక తెస్తున్నారు. తన తండ్రి మెతకగా ఉంటారని, మంచిగా ఉంటారని, తాను మాత్రం అలా కాదు అని లోకేష్ తండ్రితో పోలిక పెట్టుకుంటున్నారు.

అయితే చంద్రబాబుకు ఎక్కడ తగ్గాలో తెలుసు. అలాగే ఎక్కడ అవతల వారికి ఉచ్చు బిగించాలో కూడా తెలుసు. ఆయన గట్టిగా పరుషంగా మాట్లాడలేకపోవచ్చు కానీ ఆయన ప్రత్యర్ధిని టార్గెట్ చేస్తే ముప్పతిప్పలు ఎదుర్కోవడం ఖాయం దటీజ్ చంద్రబాబు అని ఆయన రాజకీయాన్ని చూసిన వారు అంటారు.

అయితే లోకేష్ మాత్రం ఆవేశంగా మాట్లాడుతున్నారు. మా నాన్నలా నేను కాను అంటున్నారు. అంటే అక్కడికి చంద్రబాబు తగ్గి ఉండడం తప్పు చేసినట్లా. లేక ఆయన వ్యూహాలే తప్పు అని లోకేష్ చెబుతున్నారా అన్న చర్చ కూడా మొదలవుతోంది. సరిగ్గా చూస్తే ఇక్కడే లోకేష్ ఎదగాలి. చంద్రబాబు కంటే కూడా దూసుకువెళ్లాలి. అపుడు ఇద్దరినీ చూసి జనమే పోలికని చెబుతారు. అంతే తప్ప తనను తాను పెంచుకునేందుకు లోకేష్ బాబు అమాయకంగా తండ్రిని చిన్న చేయాలని చూడడం మాత్రం ఎందుకో బూమరాంగ్ అయ్యే సీన్ లాగే కనిపిస్తోంది. చంద్రబాబు మీద జనాలకు ఉన్న ఒక విధమైన ఇమేజ్ ని తగ్గించేలా చినబాబు కామెంట్స్ ఉన్నాయన్న విశ్లేషణలు వినవస్తున్నాయి.

ఇక వైసీపీ వారి మీద రివెంజ్ తీర్చుకుంటామని లోకేష్ పదే పదే అంటున్నారు. అధికారం కోరేది ప్రజలకు న్యాయం చేయడానికి కానీ రివెంజ్ తీర్చుకోవడానికి కాదు అన్నది కూడా లోకేష్ బాబు గ్రహించాలి కదా. వైసీపీ వారు ఈ రోజు ప్రతీకార రాజకీయాలకు పాల్పడితే రేపటి రోజున దాని చేదు ఫలితాన్ని కూడా చూస్తారు. అందువల్ల లోకేష్ ఈ విషయంలో తన యాటిట్యూడ్ మార్చుకోవాలని అంటున్నారు.

మరో వైపు చూస్తే వైఎస్ జగన్ కన్నా చిన్న వయసు లోకేష్ ది. ఒక విధంగా నవతరం ప్రతినిధిగా ఉత్తమ భావాలతో నవ్యాంధ్రాకు నూతన దారులను చూపించాలని జనం కోరుకుంటారు. అంతే తప్ప దెబ్బకు దెబ్బ తీస్తాం, మాకు అధికారం ఇవ్వండి అంటే చివరికి అదే టీడీపీకి మైనస్ అవుతుందేమో ఆలోచిచాల్సిందే కదా.