Begin typing your search above and press return to search.

ఏడాది తర్వాత ‘వదినమ్మ’ ఎంట్రీ?

By:  Tupaki Desk   |   2 Feb 2017 9:55 AM GMT
ఏడాది తర్వాత ‘వదినమ్మ’ ఎంట్రీ?
X
ఏపీ అధికారపక్షంలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనుందా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఏపీ అధికారపక్షానికి బాగా సన్నిహితంగా ఉండే నేతల మధ్య ఇటీవల కాలంలో తరచూ ఒక ఆసక్తికర మాట వస్తోంది. ఏపీ టీడీపీలోకి కొత్త రక్తం రానుందని.. దీంతో బాబు తర్వాత అంతటి ప్రజాకర్షణ శక్తి ఉన్న వారు ఎవరూ లేరన్న అపవాదు తీరిపోతుందని చెబుతున్నారు.

ఇంతకీ టీడీపీలోకి రానున్న వ్యక్తి ఎవరు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే నిజంగానే విస్మయకరమైన బదులు వినిపిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోడలు.. చినబాబు లోకేశ్ సతీమణి.. బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టేసే సమయం వచ్చేసినట్లేనని చెబుతున్నారు. లోకేశ్ కు తోడుగా బ్రాహ్మణిని కూడా 2019 ఎన్నికల బరిలోకి నిలపాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.

అనధికారికంగా ఈ అంశంపై పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. చినబాబుతో పోలిస్తే.. బ్రాహ్మణికి ఉన్న ప్రజాకర్షక శక్తి ఎక్కువని.. వాగ్ధాటి విషయంలోనూ లోకేశ్ కంటే ఆమె మిన్నగా ఉంటుందని తెలుస్తోంది. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా.. స్పష్టంగా చెప్పటంతో పాటు.. అవసరమైన మేరకు మాత్రమే మాట్లాడే తత్వం ఆమెకు కచ్ఛితంగా ఆభరణం అవుతుందని చెబుతున్నారు. 2019 ఎన్నికల బరిలోకి అప్పటికిప్పుడు తెచ్చేకన్నా.. వచ్చే ఏడాది ఆమెను రాజకీయాల్లోకి తీసుకురావాలన్నది బాబు ప్లాన్ అన్న మాట వినిపిస్తోంది.

దీనికి మరో కారణం కూడా ఉందని చెబుతున్నారు. బ్రాహ్మణిలో ప్రచార మాధ్యమాల్ని ఆకర్షించే గుణం ఎక్కువని.. సమర్థించే నాయకత్వ లక్షణాలన్నీ ఆమెలో ఉన్నాయన్న భావన వ్యక్తమవుతోంది.ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డు కార్యక్రమాల్ని ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా నిర్వహిస్తున్న బ్రాహ్మణిని.. ప్రత్యేక్ష రాజకీయాల్లోకి ఎన్నికలకు ఏడాది ముందు తీసుకొస్తే పార్టీ మీద పట్టు పెరగటమేకాదు.. ఏపీ అధికారపక్షానికి మరో తురుపుముక్కఅవుతారన్న వాదన వినిపిస్తోంది. ఎట్టి పరిస్థితులోనూ ఈసారి సార్వత్రిక ఎన్నికల నాటికి బ్రహ్మని ఎంట్రీ పక్కా అన్న మాట వినిపిస్తోంది. లోకేశ్ ను చినబాబుగా కొందరు.. అన్నగా మరికొందరు పిలుస్తున్న వేళ.. బ్రాహ్మణి ఏపీ తెలుగు తమ్ముళ్లకు ‘వదిన’ కానుందన్న మాట వినిపిస్తోంది.ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెట్టే అవకాశం ఉందని చెబుతున్న కొత్త వదినమ్మ పొలిటికల్ ఎంట్రీపై అధికారిక అనౌన్స్ మెంట్ ఎప్పటికి వస్తుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/