Begin typing your search above and press return to search.

నారా బ్రాహ్మణి.. ఇక ప్రజల్లోకి !

By:  Tupaki Desk   |   20 Nov 2015 6:56 AM GMT
నారా బ్రాహ్మణి.. ఇక ప్రజల్లోకి  !
X
ఏపీ సీఎం చంద్ర‌బాబు కుటుంబంలోని మ‌హిళ‌లు రాజ‌కీయాల్లో, సేవారంగంలో పెద్ద‌గా క‌నిపించ‌రు. ఏవైనా కుటుంబ కార్య‌క్ర‌మాలు, ప్ర‌భుత్వ ప‌రంగా పెద్ద‌పెద్ద కార్య‌క్ర‌మాలు ఉన్న‌ప్పుడు, శుభ‌కార్యాల స‌మ‌యంలో వారి ద‌ర్శ‌న‌భాగ్యం ల‌భిస్తుంది. చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువనేశ్వ‌రి అయితే రాజ‌కీయాల్లో కానీ, పార్టీ వ్య‌వ‌హారాల్లో కానీ జోక్యం చేసుకోనే చేసుకోరు. మ‌హ‌నీయుడు ఎన్టీఆర్ కుమార్తె అయిన భువ‌నేశ్వ‌రి త‌న సోద‌రి పురంధేశ్వ‌రి కేంద్ర మంత్రిగా ఫుల్ హ‌వాలో ఉన్న‌ప్పుడూ కూడా రాజ‌కీయాల వైపు చూడ‌నేలేదు.

అయితే... తరం మారుతోంది.. ఆస‌క్తులు మారుతున్నాయి. రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌ని ఇప్పుడే చెప్ప‌లేం కానీ చంద్ర‌బాబు కుటుంబంలోని మ‌హిళ‌ల అడుగులు మాత్రం ఇంత‌కుముందులా కాకుండా ప్ర‌జాసేవ‌వైపు ప‌డుతున్నాయి. తాజాగా చంద్ర‌బాబు కోడ‌లు - ఎన్టీఆర్ మ‌న‌వ‌రాలు బ్రాహ్మ‌ణి ప్ర‌జాసేవ‌లో దిగుతున్నారు. నారా లోకేశ్ భార్య అయిన బ్రాహ్మ‌ణి ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ద్వారా సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డానికి ముందుకొస్తున్నారు. పేద విద్యార్థుల‌కు ఉన్న‌త ఉద్యోగాలు చేరువ చేసే ల‌క్ష్యంతో శిక్ష‌ణ స‌దుపాయాలు అందించేందుకు ఆమె నడుంబిగిస్తుండ‌డం ఎంతైనా మంచి ప‌రిణామ‌మే.

గ్రూప్ 1, 2 వంటి ఉన్న‌తోద్యోగాల‌కు తెలుగు రాష్ట్రాల్లోని పేద‌ విద్యార్థుల‌కు శిక్ష‌ణ ఇప్పిస్తాన‌ని బ్రాహ్మ‌ణి ప్ర‌క‌టించారు. ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ద్వారా ఈ శిక్ష‌ణ చేప‌డ‌తాన‌ని... నిపుణుల‌తో శిక్ష‌ణ ఇప్పిస్తాన‌ని... తొలి ద‌శ‌లో 800 మందికి శిక్షణ ఉంటుంద‌ని ఆమె ప్ర‌క‌టించారు. అంతేకాదు... ఇతర పోటీ ప‌రీక్ష‌ల‌కు ప‌నికొచ్చేలా, నైపుణ్యాల‌ను అభివృద్ధి చేసుకునేలా కూడా శిక్ష‌ణలు ఇచ్చే కార్య‌క్ర‌మానికి రూప‌క‌ల్ప‌న చేస్తున్న‌ట్లు చెప్పారు. కాగా బ్రాహ్మ‌ణి భ‌ర్త లోకేశ్ కూడా ఇప్ప‌టికే ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ద్వారా ప‌లు సేవాకార్య‌క్ర‌మాలు చేపడుతున్నారు. బ్రాహ్మ‌ణి తండ్రి సినీన‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ కూడా ఎన్టీఆర్ ట్ర‌స్ట్ సేవా కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో బ్రాహ్మ‌ణి ప్ర‌త్యేకంగా సేవాకార్య‌క్ర‌మాలపై దృష్టిపెట్ట‌డం ఆస‌క్తిక‌ర‌మే. దీంతో భ‌విష్య‌త్తులో ఆమె రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా రావ‌చ్చ‌న్న చ‌ర్చలు అప్పుడే మొద‌లైపోయాయి.