Begin typing your search above and press return to search.

టీడీపీ ఉలికిపాటు... భువనేశ్వరి ఇమీడియట్ ట్వీట్

By:  Tupaki Desk   |   31 Jan 2016 9:14 AM GMT
టీడీపీ ఉలికిపాటు... భువనేశ్వరి ఇమీడియట్ ట్వీట్
X
టీఆరెస్ పార్టీ పుట్టి దశాబ్దన్నర కాలమైనా ఇంతవరకు వచ్చిన ఏ ఎన్నికల్లోనూ వేయని స్టెప్పును ఈసారి కేసీఆర్ వేశారు. అబద్ధాలు చెప్పడంలో ఘనాపాఠీ అయిన ఆయన ఈసారి ప్రధాన నేతలను దాటి వారి కుటుంబసభ్యుల వరకు వెళ్లారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగసభలో కేసీఆర్ ఎవరూ ఊహించని వ్యాఖ్య చేశారు. ఆ వ్యాఖ్యలతో టీడీపీ నేతలు, శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చంద్రబాబు భార్య, తన వదిన భువనేశ్వరి కూడా టీఆర్ఎస్‌కే ఓటేస్తున్నారని ఈ మేరకు ఆమె మాట ఇచ్చారంటూ సభలో కేసీఆర్ చెప్పారు. భువనేశ్వరికి నిజాయితీ ఉంది కాబట్టే టీఆర్‌ఎస్‌కు ఓటేస్తున్నారని అన్నారు. భువనేశ్వరిని వదిన అని గౌరవంగా పిలుస్తూ ఆమె తమ పార్టీకి ఓటేస్తారని కేసీఆర్ అనడంతో తమ పార్టీ ఓటు బ్యాంకుపై తీవ్ర ప్రభావం ఉంటుందని టీడీపీ నేతలు ఆందోళన చెందారు. దీంతో వెంటనే ఏమాత్రం ఆలస్యం లేకుండా భువనేశ్వరి పేరులో లోకేష్ ట్విట్టర్ అకౌంట్ లో వివరణ ఇచ్చారు.

''ఒక ముఖ్యమంత్రి బహిరంగ సభలో ఇలా అబద్ధాలు చెప్పడం దారుణం'' అంటూ భువనేశ్వరి పేరుతో లోకేశ్ ట్విట్టర్ అకౌంట్లో రాశారు. ఓటర్లను గందరగోళ పెట్టేందుకు తన పేరు వాడుకోవడం బాధాకరమని భువనేశ్వరి అభిప్రాయపడినట్టు లోకేష్ ట్వీట్‌లో వెల్లడించారు. ఎప్పటికీ తాము టీడీపీకే ఓటేస్తామని చెప్పారు. అయితే ఇటీవల చంద్రబాబు, కేసీఆర్‌ ఒకటైపోయారని బాగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో భువనేశ్వరిని కేసీఆర్ వదిన అని పిలవడం టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. హైదరాబాద్‌లోని సీమాంధ్ర ఓటర్లలో టీఆర్ఎస్‌పై సానుకూలత పెంచేందుకే కేసీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. రాజకీయంగా పార్టీలు వేరైనా తామంతా కుటుంబ మిత్రులం అన్న భావన కలిగించేందుకు కేసీఆర్ ఈ ఎత్తుగడ వేశారని భావిస్తున్నారు.