Begin typing your search above and press return to search.

మీడియాను బాయ్ కాట్ చేసి.. తాజాగా టోర్నీ నుంచి వైదొలిగింది

By:  Tupaki Desk   |   2 Jun 2021 6:30 AM GMT
మీడియాను బాయ్ కాట్ చేసి.. తాజాగా టోర్నీ నుంచి వైదొలిగింది
X
షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచ టెన్నిస్ రెండో ర్యాంక్ క్రీడాకారిణి జపాన్ కు చెందిన నవోమి ఒసాకా షాకుల మీద షాకులు ఇచ్చింది. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ఫేవరెట్ గా భావిస్తున్న ఆమె.. తాజాగా తాను టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లుగా చెప్పి క్రీడా అభిమానులంతా విస్మయానికి గురయ్యే నిర్ణయాన్ని ప్రకటించింది. టోర్నీలో మొదటి రౌండ్ పూర్తి చేసి రెండో రౌండ్ కు చేరుకున్న ఆమె.. తాజాగా అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించింది.

23 ఏళ్ల ఈ టెన్నిస్ స్టార్.. ఫ్రెంచ్ ఓపెన్ నిబంధనల్ని బేఖాతరు చేసి సంచలనంగా మారారు. టోర్నీ నిబంధనల ప్రకారం మ్యాచ్ ముందు మ్యాచ్ తర్వాత మీడియా సమావేశానికి హాజరు కావాల్సి ఉంది. అయితే.. తానీ నిబంధనను పాటించనని చెప్పిన ఆమె.. తాను చెప్పినట్లే తొలి రౌండ్ లో విజయం సాధించాక మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోయింది. దీంతో.. టోర్నీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిందన్న కారణంగా ఆమెపై 15 వేల డాలర్ల జరిమానాను విధించారు. అంతేకాదు.. తీరు మార్చుకోకుంటే బహిష్కరణ వేటు వేస్తామన్న వార్నింగ్ ఇచ్చారు. అది కూడా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి మాత్రమే కాదు.. యూఎస్ ఓపెన్.. వింబుల్డన్.. ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వాహకులు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆమె తాను టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లుగా చెప్పి డబుల్ షాకిచ్చారు. అయితే.. తానీ నిర్ణయాన్ని తీసుకోవడానికి గల కారణాల్ని ఆమె తన సోషల్ మీడియాలో పోస్టులో సుదీర్ఘంగా వెల్లడించారు. తాను మానసిక సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. కొన్నాళ్లుగా తాను మానసిక ఆందోళనకు గురవుతున్నానని.. అందుకు కొన్నాళ్లు ఆటకు బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు చెప్పింది.

‘2018 యూఎస్ ఓపెన్ నుంచి మానసిక కుంగుబాటుతో బాధ పడుతున్నా. దాని నుంచి బయటపడేందుకు చాలా కష్టపడుతున్నా. తరచూ సంగీతం వింటా. ఎప్పుడూ చెవులకు హెడ్ ఫోన్స్ పెట్టుకోవడానికి అదే కారణం. అంతే తప్పించి నేనేమీ పరధ్యానంగా ఉంటానని కాదు. నేను పబ్లిక్ స్పీకర్ ను కాను. అందుకే ప్రపంచ మీడియాతో మాట్లాడేందుకు తీవ్ర ఆందోళన చెందుతా. స్వీయ రక్షణ కోసమే మీడియా సమావేశానికి హాజరు కాలేదు. ప్రస్తుతం నా టైం బాగోలేదు. మీడియా ప్రతిసారీ నా పట్ల సానుకూలంగా స్పందించింది. ఈసారి సమావేశాలకు హాజరు కాలేనందుకు సారీ చెబుతున్నా’ అని పేర్కొంది.

ఒసాకా పోస్టు తర్వాత ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాకారుల నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఆమెకు ఒక హగ్ ఇవ్వాలని తాను అనుకుంటున్నానని.. గతంలో తాను కూడా ఇలాంటివి ఎదుర్కొన్నట్లు అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ పేర్కొంటే.. టెన్నిస్ క్వీన్.. ఈ పరిస్థితుల్లో మేమంతా మీ వెంటే అంటూ గతంలో మీడియా సమావేశానికి హాజరు కాకుండా భారీ ఫైన్ కట్టిన స్టార్ కైరీ ఇర్విన్ ట్వీట్ చేశారు. ఒసాక త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.