Begin typing your search above and press return to search.

మీరలా అంటే.. జనం ఇలా అడుగుతారు మంత్రి నాని!

By:  Tupaki Desk   |   29 Dec 2021 11:00 PM IST
మీరలా అంటే.. జనం ఇలా అడుగుతారు మంత్రి నాని!
X
ఏపీలో సినిమా థియేటర్ల టికెట్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచంలో అన్ని ధరలు పెరిగిపోతుంటే.. అందుకు భిన్నంగా మరెక్కడా లేని విధంగా.. సినిమా టికెట్ల ధరలు భారీగా తగ్గించేసిన ఏపీ సర్కారు తీరుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. గుండు సూది మొదలు.. తినే ఉప్పు వరకు ప్రతి వస్తువ ధర పెరగటమే కానీ తగ్గింది లేదు.

అలాంటిది రోడ్డు పక్కన టీబండి వాడు అమ్మే ఒక కప్పు టీ కంటే తక్కువ ధరకు మూడు గంటల సినిమా టికెట్ సగం కూడా ఉండకపోవటం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. ఈ వాదన ఇలా ఉంటే.. టికెట్ల ధరల తగ్గింపు డిమాండ్ పై ఏపీ నేతలు రియాక్టు అవుతూ.. హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని డిమాండ్ చేయటం తెలిసిందే.

దీనిపై హీరో నాని చేసిన వ్యాఖ్యలు ఏపీ నేతలకు మంట పుట్టేలా ఉంటే.. తమిళ.. తెలుగు నటుడు.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ.. సూటిగా మాట్లాడే నటుడు సిద్దార్థ్ టికెట్ల ధరల తగ్గింపుపై రియాక్టు కావటం.. ఘాటు విమర్శ చేయటం తెలిసిందే. రాజకీయ నేతలు తాము కట్టే పన్నులతోనే లగ్జరీగా బతుకుతున్నారంటూ తప్పు పట్టారు.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ మంత్రి పేర్ని నాని.. రాజకీయ నేతలు విలాసవంతంగా బతుకుతున్నారని హీరో సిద్ధార్థ్ అంటున్నారు. అయినా సిద్ధార్థ్ ఎక్కడ ఉంటున్నాడు? తమిళనాడులో. ఏపీతో ఆయనకేంటి సంబంధం? ఈ రాష్ట్రంలో ఆయన చెల్లించే ట్యాక్సులు ఏమున్నాయి? మేం ఏ విధంగా బతుకుతున్నామో సిద్దార్థ్ కు తెలుసు? అంటూ ప్రశ్నించారు.

ఈ వ్యాఖ్యలకు సోషల్ మీడియా.. వాట్సాప్ గ్రూపుల్లో స్పందన వస్తోంది. మంత్రి పేర్ని నానిపై సెటైర్లతో విరుచుకుపడుతున్నారు. మరి.. ఏపీకి ఏం సంబంధం ఉందని రిటైర్డు హైకోర్టు జడ్జి చంద్రు.. ఏపీ అంశాల మీద మాట్లాడారు. ఆంధ్రా హైకోర్టు తీర్పులపై వ్యాఖ్యలు చేసినంతనే.. వాటిని వైసీపీ నేతలు ఎందుకు ప్రమోట్ చేశారు? ఏం సంబంధం ఉందని తమిళనాడుకు చెందిన చంద్రు.. ఏపీ అంశాలపై మాట్లాడారు? అని అడిగితే మీ పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు.

పేర్ని నాని మాటల్ని పరిగణలోకి తీసుకుంటే.. మరేం సంబంధం ఉందని తెలంగాణకు చెందిన అంతమందికి టీటీడీ బోర్డు చోటు కల్పించారు? అంత దాకా ఎందుకు రాజ్యసభసభ్యత్వాన్ని ఏపీలో అర్హత ఉన్న వారెవరూ లేరా? అక్కడెక్కడో గుజరాత్ వ్యాపారికి ఎంపీ పోస్టు కట్టబెట్టారు? తెలంగాణకు చెందిన ఎంతమందిని ఏపీ సలహాదారులుగా నియమించుకున్నారు? మరేం సంబంధం ఉందని ఇవన్నీ చేస్తున్నారని అడిగితే.. పేర్ని నాని ఏం బదులిస్తారు? అని ప్రశ్నిస్తున్నారు. అందుకే అనేది.. ఎవరో ఏదో అన్నారని.. సీమ టపాకాయి మాదిరి స్పందిస్తే.. అందుకు రెట్టింపు సౌండ్ చేసేలా హైడ్రోజన్ బాంబులు పేలుతాయన్న విషయాన్నిపేర్ని నాని గుర్తు పెట్టుకుంటే మంచిదంటున్నారు.