Begin typing your search above and press return to search.

నంద్యాల‌కు నాన్న పేరు పెట్టాలి.. అఖిల ప్రియ డిమాండ్‌

By:  Tupaki Desk   |   28 Jan 2022 5:53 AM GMT
నంద్యాల‌కు నాన్న పేరు పెట్టాలి.. అఖిల ప్రియ డిమాండ్‌
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్ర‌క్రియ కొత్త వివాదాల‌కు దారి తీస్తున్న‌ట్లే క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఇచ్చిన హామీల మేర‌కు ప్ర‌స్తుతం ఉన్న 13 జిల్లాల‌ను 26గా మారుస్తూ అధికార వైసీపీ మంత్రివ‌ర్గం ఆమోదం తెలిసిన సంగ‌తి తెలిసిందే. పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఈ కొత్త జిల్లాల ఏర్పాటు జ‌ర‌గ‌బోతుంది. అయితే జిల్లా కేంద్రాల విస్త‌ర‌ణ‌, నియోజ‌క‌వ‌ర్గాల విలీనం, కొత్త జిల్లాల పేర్లు త‌దిత‌ర విష‌యాల‌పై ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై వ్య‌తిరేక‌త వ‌స్తోంది. సొంత పార్టీ వైసీపీ నుంచే ఇలాంటి నిర‌స‌న వ్య‌క్తం అవుతుండ‌డం గ‌మ‌నార్హం.

మ‌రోవైపు కొత్త‌గా ప్ర‌క‌టించిన జిల్లాల‌కు టీడీపీ నేత‌ల‌తో పాటు కొన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు కొన్ని పేర్లు సూచిస్తున్నారు. ఈ క్ర‌మంలో క‌ర్నూలు జిల్లాలోని నంద్యాల పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాన్ని జిల్లాగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. నంద్యాల కేంద్రంగా కొత్త జిల్లాను ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌నుంది. ఆళ్ల‌గ‌డ్డ‌, బ‌న‌గాన‌ప‌ల్లె, నంద్యాల‌, డోన్‌, నందికొట్కూరు, శ్రీశైలం నియోజ‌క‌వ‌ర్గాలు ఈ జిల్లా ప‌రిధిలోకి వ‌స్తాయి. అయితే దీనికి దివంగ‌త నేత భూమా నాగిరెడ్డి పేరు పెట్టాల‌ని ఆయ‌న త‌న‌య మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ కొత్త డిమాండ్ లేవనెత్తారు.

భూమా కుటుంబానికి నంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌ట్టి ప‌ట్టుంది. 2004 మిన‌హా 1994 నుంచి 2014 వ‌ర‌కు ఆళ్ల‌గ‌డ్డ‌పై భూమా దంప‌తుల ప‌ట్టు కొన‌సాగింది. దివంగ‌త నేత‌లు భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి మూడు సార్లు చొప్పున ఆళ్ల‌గ‌డ్డ నుంచి గెలిచారు. టీడీపీ, ప్ర‌జారాజ్యం, వైసీపీ నుంచి విజ‌యాలు సాధించారు. నంద్యాల‌లోనూ ఆ కుటుంబానికి మంచి ప‌ట్టుంది.

2014లో భూమా నాగిరెడ్డి నంద్యాల నుంచి ఆయ‌న కుమార్తె భూమా అఖిల ప్రియ ఆళ్ల‌గ‌డ్డ నుంచి వైసీపీ త‌ర‌పున గెలిచారు. కానీ ఆ త‌ర్వాత టీడీపీలోకి చేరారు. నాగిరెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత అఖిల ప్రియ‌కు మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో భూమా నాగిరెడ్డి హ‌యాంలో నంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గాలు అభివృద్ధి ప‌థంలో ప్ర‌యాణించాయ‌ని ఆయ‌న చేసిన సేవ‌ల‌ను ప్ర‌భుత్వం గుర్తించాల‌ని అఖిల ప్రియ డిమాండ్ చేశారు. కొత్త‌గా ఏర్పాటు చేసే నంద్యాల జిల్లాకు భూమా నాగిరెడ్డి పేరును పెట్టాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు. భూమా నాగిరెడ్డి ఓట‌మి లేని నాయ‌కుడ‌ని నంద్యాల రూపురేఖ‌లు మార్చార‌ని ప్రియ తెలిపారు.

ఈ డిమాండ్‌పై ప్రియ‌తో పాటు తెలుగు దేశం పార్టీ నాయ‌కులు విస్త్రత ప్ర‌చారం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని స‌మాచారం. నంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గాల టీడీపీ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి ప్ర‌భుత్వానికి త‌మ డిమాండ్ గట్టిగా వినిపిస్తామ‌ని అఖిల ప్రియ అంటున్నారు. నంద్యాల‌కు భూమా నాగిరెడ్డి పేరు పెట్ట‌డం ఆయ‌న‌కు ప్ర‌భుత్వం ఇచ్చే గౌర‌వ‌మ‌ని ఆమె పేర్కొన్నారు. మ‌రోవైపు అఖిల ప్రియ డిమాండ్‌పై విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి.

ఇటీవ‌ల పుట్టిన త‌న కొడుకుకు బాహు అని నామ‌క‌ర‌ణం చేసుకున్న అఖిల ప్రియ జిల్లాకు మాత్రం త‌న తండ్రి పేరు పెట్టాల‌ని డిమాండ్ చేయ‌డం విడ్డూరంగా ఉంద‌నే మాట‌లు వినిపిస్తున్నాయి. తండ్రిపై ఆమెకు ప్రేమ ఉండ‌డంలో త‌ప్పు లేదు కానీ త‌న బిడ్డకు మాత్రం కొత్త పేరు పెట్టుకుని జిల్లాకు మాత్రం తండ్రి పేరు పెట్టాల‌ని కోర‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.