Begin typing your search above and press return to search.

హ‌వ్వా..నంద్యాల అభివృద్ధికి శిల్పా అడ్డుప‌డ్డారా?

By:  Tupaki Desk   |   11 Aug 2017 10:40 AM GMT
హ‌వ్వా..నంద్యాల అభివృద్ధికి శిల్పా అడ్డుప‌డ్డారా?
X
క‌ర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు జ‌రుగుతున్న అభివృద్ధిపై అక్క‌డి ప్ర‌జ‌లే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌లు కూడా చ‌ర్చించుకుంటున్న విష‌యం మ‌నంద‌రికీ తెలిసిందే. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో నంద్యాల‌లో టీడీపీ ఘోరంగా ఓడిపోగా... వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన భూమా నాగిరెడ్డి విజ‌యం సాధించారు. అయితే న‌వ్యాంధ్ర‌లో టీడీపీ స‌ర్కారు గ‌ద్దెనెక్క‌డంలో అక్క‌డ అభివృద్ధి దాదాపుగా ప‌డ‌కేసింద‌నే చెప్పాలి. ఒకానొక సంద‌ర్భంలో బ‌హిరంగ స‌భా వేదిక‌పై నంద్యాల అభివృద్ధి ప‌డ‌కేసింద‌ని, కొన్ని అభివృద్ధి ప‌నుల‌కైనా నిధులు విడుద‌ల చేయాల‌ని నాడు నంద్యాల టీడీపీ నియోజ‌కవ‌ర్గ ఇన్‌ చార్జీగా ఉన్న శిల్పా మోహ‌న్ రెడ్డి అడిగితే... డ‌బ్బులెక్క‌డున్నాయంటూ చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్యకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైర‌ల్‌ గా మారింది.

ఉప ఎన్నిక‌ల‌కు గ‌డువు స‌మీపిస్తున్న త‌రుణంలో నిద్ర లేచిన టీడీపీ స‌ర్కారు... వేల కోట్ల కొల‌ది నిధుల‌ను నంద్యాల‌కు కేటాయించేసింది. మొన్న రంజాన్ సంద‌ర్భంగా అక్క‌డికి వెళ్లిన చంద్ర‌బాబు... నంద్యాల‌లో అభివృద్ధికి సంబంధించి ఏ ఒక్క‌రు నిధులు అడిగినా ముందూ వెనుకా చూడ‌కుండా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేయాల్సిందేన‌ని కూడా సీఎం హోదాలో ఆర్డ‌రేసి వ‌చ్చారు. ఇప్పుడు నంద్యాల‌లో జ‌రుగుతున్న అభివృద్ధి చూస్తే... నిజంగానే త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కు కూడా ఉప ఎన్నిక‌లు వ‌స్తే బాగుండేద‌ని అన్ని నియోజ‌కవ‌ర్గాల ప్ర‌జ‌లు భావిస్తున్నారంటే అతిశ‌యోక్తి కాదేమో. జ‌నం మాటేమిటి?... టీడీపీకి చెందిన ఎమ్మెల్యేల నోట నుంచే ఈ మాట వినిపించిన వైనం కూడా మ‌న‌కు తెలిసిందే. అయితే నంద్యాల‌లో మొన్న‌టి దాకా అభివృద్ధి ప‌డ‌కేసిన వైనం, ఇప్పుడు ప‌నులు జోరందుకున్న వైనానికి సంబంధించి టీడీపీ నేత‌లు ఇప్పుడు చెబుతున్న మాట‌లు వింటే మాత్రం ముక్కున వేలేసుకోవాల్సిన ప‌రిస్థితి.

ఇక ఆ విష‌యంలోకి వ‌స్తే... నేటి ఉద‌యం నంద్యాల మునిసిపాలిటీ ప‌రిధిలోని 23వ వార్డులో ప్ర‌చారం కోసం వెళ్లిన టీడీపీకి చెందిన నంద్యాల కీల‌క నేత ఏవీ సుబ్బారెడ్డి... ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు నంద్యాల‌లో మొన్న‌టిదాకా అభివృద్ధి జ‌ర‌గ‌క‌పోవ‌డానికి శిల్పా మోహ‌న్ రెడ్డే కార‌ణ‌మంటూ ఆయ‌న కొత్త వాద‌న వినిపించారు. నంద్యాల అభివృద్ధికి సంబంధించి చంద్ర‌బాబు ఎప్పుడో బ్లూ ప్రింట్ రెడీ చేశార‌ని, అయితే వైసీపీ టికెట్ పై గెలిచిన భూమా నాగిరెడ్డి ఆ త‌ర్వాత వైసీపీలో చేరిన నేప‌థ్యంలో ఆ ప‌నులు జ‌రిగితే... త‌న ఇమేజీ డ్యామేజీ అవుతుంద‌ని శిల్పా చెప్ప‌డంతో చంద్ర‌బాబు ఆ బ్లూ ప్రింట్‌ను అట‌కెక్కించార‌ట‌. మ‌రి నాడు బ‌హిరంగ స‌భా వేదిక మీద నంద్యాల అభివృద్ధికి నిధులివ్వాలంటూ శిల్పా అడిగిన మాట‌, డ‌బ్బుల్లేవ‌న్న చంద్ర‌బాబు మాట‌ను ఏవీ ఏ విధంగా స‌మ‌ర్థిస్తారో చూడాల‌న్న వాద‌న వినిపిస్తోంది.

అంతేకాకుండా... చంద్ర‌బాబు నంద్యాల‌లో ఏర్పాటు చేసిన స‌భ‌ల‌కు జ‌నం ప‌లుచ‌గా హాజ‌రైన విష‌యం అంద‌రికీ తెలిసిందే. అదే మొన్న జ‌గ‌న్ నిర్వ‌హించిన స‌భ‌కు జ‌నం పోటెత్తిన వైనం ప్ర‌పంచంలోని అన్ని మూల‌లా ఉన్న తెలుగు ప్ర‌జ‌లు కళ్లారా చూశారు. దీనిపై మాట్లాడిన ఏవీ సుబ్బారెడ్డి... అస‌లు జ‌గ‌న్ స‌భ‌ల‌కు, ప్ర‌చారంలో జ‌నం క‌నిపించ‌డం లేద‌ని, తాము వెళితే మాత్రం తండోప‌తండాలుగా వ‌స్తున్నార‌ని కూడా చెప్పుకొచ్చారు. టీడీపీ ప్ర‌చారంలో జ‌నం కంటే కూడా టీడీపీ జెండాలు ప‌ట్టుకుని న‌డుస్తున్న కార్య‌క‌ర్త‌లే ఎక్కువ‌గా ఉంటున్న వీడియో దృశ్యాలు ఏవీ కంటికి క‌నిపించ‌డం లేదా అని ఇప్పుడు నంద్యాల ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. ఏదేమైనా... నంద్యాల‌లో గెలుపు కోసం ఏవీ సుబ్బారెడ్డి... ఇప్ప‌టికీ స‌చిత్ర సాక్ష్యాలుగా క‌నిపిస్తున్న ఘ‌ట‌న‌ల‌కు కొత్త అర్థం చెబుతుండ‌టంపై ఇప్పుడు పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది.