Begin typing your search above and press return to search.

బాబోయ్ సుహాసిని స్పీచ్..

By:  Tupaki Desk   |   1 Dec 2018 11:35 AM GMT
బాబోయ్ సుహాసిని స్పీచ్..
X
తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా నందమూరి కుటుంబ సభ్యురాలైన సుహాసినిని బరిలోకి దించింది. సెటిలర్ల ఓట్లు బాగా ఉన్న కూకట్ పల్లి నియోజకవర్గంలో ఆమెను పోటీకి నిలబెట్టారు. హరికృష్ణ మరణం నేపథ్యంలో సానుభూతి కూడా కలిసొస్తుందని సుహాసినికి టికెట్ ఇచ్చారు. చంద్రబాబు ఇంకా మరిన్ని ప్రయోజనాలు ఆశించిన ఆమెకు అవకాశం కల్పించారు. ఐతే మామాలుగా చూస్తే సుహాసినికి చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి. అక్కడి సమీకరణాల ప్రకారం చూస్తే ఆమె గెలవడం పెద్దం కష్టం కాదనే అనుకున్నారు. కానీ సుహాసిని ప్రసంగాలు వింటుంటే మాత్రం.. ఆమె ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అనిపిస్తోంది. తొలిసారి మీడియా ముందుకు వచ్చినప్పటి నుంచి సుహాసిని స్పీచ్ ల మీద సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్ నడుస్తోందో తెలిసిందే.

రాజకీయాల విషయానికి వస్తే అన్నిటికంటే ముఖ్యమైంది సమర్థత.. ప్రజా సమస్యలపై అవగాహన.. వాగ్దాటి. కానీ ఈ విషయాల్లో సుహాసిని అనేక సందేహాలు రేకెత్తిస్తున్నారు. ఆమెకు రాజకీయాలపై.. ప్రజా సమస్యలపై కనీస అవగాహన లేనట్లే ఉంది. ఏవో కొన్ని మాటలు బట్టీ పట్టుకుని వచ్చి వాటిని అతి కష్టం మీద అప్పగిస్తోంది. తాజాగా ఆమె ఒక ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా మాట్లాడిన మాటలు చూసి జనాలకు దిమ్మదిరిగిపోతోంది. దీనికి సంబంధించిన వీడియోలు పెట్టి సోషల్ మీడియాలో జనాలు ఆటాడేసుకుంటున్నారు. చిన్నపిల్లలు స్కూల్లో హోం వర్క్ ఇస్తే బట్టీ పట్టి అప్పగించినట్లే ఉన్నాయి ఆమె మాటలు. దాన్ని ఇక్కడ రాతల్లో వర్ణించడం కష్టం. ఆ వీడియోలు చూస్తే విషయం అర్థమవుతుంది. టీఆర్ ఎస్ ప్రభుత్వం ఫ్లై ఓవర్లు కట్టిస్తామని.. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని.. పింఛన్లు ఇస్తామని.. ఇంకా ఇలాంటి హామీలెన్నో ఇచ్చి నెరవేర్చలేదని.. తాను గెలిచాక అవన్నీ నెరవేరుస్తానని ఆమె హామీ ఇవ్వడం విశేషం. ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిస్తే మొత్తం ప్రభుత్వ హామీలన్నీ తాను నెరవేరుస్తానని సుహాసిని చెబుతుంటే జనాలకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో చెప్పేదేముంది?