Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ తనయుడికి ఆర్నెళ్ల జైలుశిక్ష

By:  Tupaki Desk   |   6 Sept 2017 11:10 PM IST
ఎన్టీఆర్ తనయుడికి ఆర్నెళ్ల జైలుశిక్ష
X
మాజీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు పెద్ద కుమారుడు జయకృష్ణకు ఆరు నెలల జైలు శిక్ష పడింది. దీంతోపాటు రూ.25 లక్షల జరిమానా కూడా విధిస్తూ హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ఈ శిక్ష పడడం గమనార్హం.

అబిడ్స్‌ లోని రామకృష్ణ థియేటర్‌ క్యాంటిన్‌ - పార్కింగ్‌ లీజు విషయంలో కొద్దికాలంగా వివాదం ఉంది. ఈ నేపథ్యంలోనే నందమూరి జయకృష్ణ ఇచ్చిన చెక్కు బౌన్స్‌ కావడంతో నర్సింగరావు అనే వ్యక్తి ఎర్రమంజిల్‌ లోని మూడో మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో కేసు వేశారు. విచారణ అనంతరం జయకృష్ణను దోషిగా తేల్చిన కోర్టు ఆర్నెల్ల కఠిన కారాగార శిక్ష - భారీ జరిమాన విధించింది. అయితే, ఈ తీర్పును సవాలు చేసేందుకుగానూ జయకృష్ణకు నెల రోజుల గడువు ఇచ్చింది.

కాగా, కోర్టు తీర్పు నేపథ్యంలో జయకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. ఆ వెంటనే ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబుకు స్వయానా బావమరిది అయిన జయకృష్ణ ఎందుకిలా శిక్షకు గురికావాల్సి వచ్చింది... ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారా..? లేదంటే పొరపాటున బ్యాంకు అకౌంట్లలో నిల్వలు సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల దొర్లిన పొరపాటా అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు రామకృష్ణ థియేటర్ వద్ద లీజు వివాదాల కారణంగా జయకృష్ణను ఇరికించారన్న వాదనా వినిపిస్తోంది.