Begin typing your search above and press return to search.

టీటీడీ చైర్మ‌న్‌ గా నంద‌మూరి హ‌రికృష్ణ‌!

By:  Tupaki Desk   |   15 Jun 2017 4:19 PM GMT
టీటీడీ చైర్మ‌న్‌ గా నంద‌మూరి హ‌రికృష్ణ‌!
X
తెలుగుదేశం పార్టీ అధినేత‌ - ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రో కీల‌క కార్య‌క్ర‌మాన్ని ముందు పెట్టుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణను పూర్తిచేసిన చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ధర్మకర్తల మండలి అధ్యక్షుని ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి పదవీకాలం పూర్తి అయిన నేప‌థ్యంలో కొత్త వారిని ఎంపిక చేసేందుకు కసరత్తు ప్రారంభించినట్టు వార్త‌లు వెలువ‌డుతున్నాయి. రాజమండ్రి లోక్‌ సభ సభ్యుడు - సినీనటుడు మురళీమోహన్‌ - ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు - విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ కె.లక్ష్మీనారాయణ పేర్లతో పాటు నరసరావుపేట లోక్‌ సభ సభ్యుడు రాయపాటి సాంబశివరావు పేర్లను చంద్రబాబు పరిశీలించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే వీరంద‌రి పేర్లు ప‌క్క‌కుపెట్టి టీటీడీ చైర్మన్ గా నందమూరి హరికృష్ణ‌ను నియమించేందుకు టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఎన్టీఆర్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీలో గౌర‌వం ద‌క్క‌డం లేద‌నే అప‌ప్ర‌ద వినిపిస్తోంది. పార్టీలో సీనియ‌ర్ నేత‌లైన నంద‌మూరి హ‌రికృష్ణ సైతం అల‌క‌బూన‌డం ఇందుకు నిద‌ర్శ‌న‌గా చెప్తున్నారు. ఇటీవల వైజాగ్ లో జరిగిన టీడీపీ మహానాడుకు సైతం హరికృష్ణ సహా జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా పార్టీకి చెందిన పలువురు సీనియర్ల పేర్లు టీటీడీ చైర్మ‌న్‌ రేసులో పరిశీలనకు వచ్చినా చివరకు హరికృష్ణ వైపే మొగ్గు చూపినట్టు పార్టీవర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేపధ్యంలో పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే సినిమా షూటింగ్ కోసం పోర్చ్ గల్ లో ఉన్న బాలక్రిష్ణ ఈనెల 18న వచ్చిన తర్వాత పార్టీ అధికారికంగా హరిక్రిష్ణ పేరును ప్రకటించే అవకాశముందని అంటున్నారు.

టీటీడీ చైర్మన్ పదవిపై ఎంపీ రాయపాటి సాంబశివరావు చైర్మన్‌ పదవిపై గంపెడాశలు పెట్టుకున్నా అది నెరవేరే అవకాశాలు లేవని చెబుతున్నారు. రాయ‌పాటికి ఆయ‌న వ్యాపారాలే స‌మ‌స్య‌గా మారింద‌ని అంటున్నారు. ఆయ‌న కంపెనీపై ఇప్పటికే అనేక ఆరోపణలు వెల్లువెత్తుతుండ‌టంతో ఆయన ఎంపికపై పెద్దగా దృష్టి పెట్టలేదని సమాచారం. తాను ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో ప్రత్యేకాధికారిగా సీఎం కార్యాలయంలో పనిచేసిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన డాక్టర్‌ కె.లక్ష్మీనారాయణ పేరును కూడా చంద్రబాబు తీవ్రంగా పరిశీలించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యుల‌కు న్యాయం చేసే క్ర‌మంలో హ‌రికృష్ణ‌ను ఎంపిక చేయ‌వ‌చ్చ‌ని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/