Begin typing your search above and press return to search.

బాబుకు మద్దతివ్వకూడదని అభిమానుల నిర్ణయం

By:  Tupaki Desk   |   27 March 2019 5:30 PM GMT
బాబుకు మద్దతివ్వకూడదని అభిమానుల నిర్ణయం
X
అవసరానికి వాడుకోవడం - అవసరం తీరాక ఎంతటి వారినైనా సరే కరివేపాకు లాగా తీసేయడం 40 ఇయర్స్ ఇండస్ట్రీలో చంద్రబాబుకే ప్రత్యేకమైన లక్షణం. రాజకీయాల్లో అధికారపు సీటే ప్రధాన లక్ష్యంగా ఎటువంటి స్థాయికైనా దిగజారడం బాబు ప్రత్యేకత. ఇందులో చంద్రబాబు తన కుటుంబీకులకు కూడా ఏమాత్రం మినహాయింపు ఇవ్వలేదు. ముఖ్యంగా తన అత్తింటి - నందమూరి వారిపై మాత్రం కక్ష కట్టి మరీ కరివేపాకు సూత్రాన్ని అమలు చేస్తున్నారు. నందమూరి కుటుంబంలో నారా కుట్ర రాజకీయాలకు బలైన వారిలో మొట్టమొదటగా చెప్పుకోవాల్సింది హరికృష్ణ ఆయన కుటుంబం గురించే.

బాబుకు రాజకీయంగా అండదండలు అవసరమైనప్పుడల్లా - ఈ కుటుంబాన్ని వాడుకోవడం - ఆ తరువాత వారిని తీవ్రంగా నిర్లక్ష్యానికి గురి చేయడం నందమూరి అభిమానులను కలచివేస్తోంది. ఎన్ టిఆర్ తరువాతి తరంలో హరికృష్ణ - బాలకృష్ణలకు సినీ అభిమానలు ఆదరణ మెండుగా ఉన్నాయి. వారిద్దరిలోనూ హరికృష్ణకు రాజకీయంగా మంచి పేరు ఉన్న విషయాన్ని ఎన్నికల సందర్భంగా అభిమానులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. కనీసం ఎక్కడా ఆయన పేరును కూడా ప్రస్తావించని బాబు తీరుతో అసంతృప్తిగా ఉన్నారు.

ఒకసారి గతంలోకి వెళితే - ఎన్ టిఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభించిన తొలినాళ్లలో హరికృష్ణ చైతన్య రథ సారథిగా పార్టీ అభిమానులందరికీ దగ్గరయ్యారు. అటు తరువాత టిడీపి చీలిక సమయంలో హరికృష్ణను తండ్రి వైపు నుంచి తనవైపుకు లాక్కుని ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా - ఆయన బలి చేసిన విషయం అందరికి తెలిసిందే. అంతే కాకుండా హరికృష్ణకు కేవలం ఆరు నెలల పాటు మాత్రమే మంత్రి పదవి కల్పించి తరువాత ఆయనను పూర్తిగా పక్కకు బెట్టారు చంద్రబాబు. రాష్ట్ర విభజనను పూర్తి స్థాయిలో విభేదించి - రాజ్యసభ సభ్యత్వాన్ని తృణప్రాయంగా త్యాగం చేసిన హరికృష్ణ పేరు ఎక్కడా వినిపించకుండా చేసి - ఆయనను క్రియాశీలక రాజకీయాల నుంచి పద్ధతి ప్రకారం పక్కకు తప్పించిన టక్కరి బాబు.

హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్ టిఆర్ కు పెరుగుతున్న క్రేజ్ ను ఉపయోగించుకుని లబ్ధి పొందాలని 2009 లో తనకు అనుకూలంగా ప్రచారానికి తిప్పుకున్నారు.అయితే జూనియర్ ఎన్ టిఆర్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తే - తన కొడుకు కు పోటీ అవుతారన్న భయంతో ఆయన్ని దూరంగా పెట్టారు బాబు. కుటుంబంతో కలహాలెందుకనే ఉద్దేశ్యంతో జూనియర్ కూడా కెరీర్ మీద దృష్టి పెడుతూ రాజకీయాలకు క్రమేణా దూరంగా ఉండటం ప్రారంభించారు.

రాజకీయ కుట్రలకు పేటెంట్ - అణువణువునా కరివేపాకు పాలసీని జీర్ణించుకున్న చంద్రబాబు - గత ఏడాది దురదృష్టవశాత్తూ ప్రమాదంలో హరికృష్ణ మరణిస్తే - ఆయన మృతదేహం దగ్గర కూడా రాజకీయాలు చేసి తన నీచాన్ని చాటుకున్నారు. అటు తరువాత ఆ కుటుంబీకులకు ఇష్టం లేకున్నా - బలవంతంగా హరికృష్ణ కుమార్తె సుహాసిని కూకట్ పల్లి నుంచి అసెంబ్లీకి పోటీలో దించారు. రాజకీయాలకు దూరంగా ఉండాలన్న తన నిర్ణయంతో జూనియర్ ఎన్ టిఆర్ ప్రచారం చేయలేదు. చంద్రబాబు మాత్రం ప్రచారం చేసి - తాను ఎన్ టిఆర్ కుటుంబానికి ఎంతో గౌరవం ఇస్తున్నట్లుగా డ్రామాలాడారు. తీరా ఎన్నికల్లో ఆమె ఓటమిని చవి చూసిన తరువాత కనీసం ఆమెతో మాట్లాడటానికి కూడా చంద్రబాబు ఇష్టపడలేదంటే ఆ కుటుంబంపై ఉన్న ఆయన కపట ప్రేమ అర్థం అవుతోంది.

చంద్రబాబుకు చావో రేవో అన్నట్లుగా మారిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనీసం ప్రచారానికైనా సుహాసినిని ఆహ్వానిస్తారేమోనని ఆశపడిన హరికృష్ణ అభిమానులకు బాబు వైఖరిని తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. సుహాసిని ఆంధ్రలో ప్రచారం చేస్తే - తన కుమారుడు లోకేష్ ను ఎవరూ పట్టించుకోరన్న దురాలోచన తోనే ఆమెను ఆంధ్ర రాజకీయాల్లోకి ఆహ్వానించడం లేదని రాజకీయవర్గాలు అంటున్నాయి.

రాజకీయ కుతంత్రాలతో అడుగడుగునా హరికష్ణ కుటుంబానికి తీరని అన్యాయం చేస్తున్న బాబు వైఖరిపై హరికృష్ణ - జూనియర్ ఎన్ టిఆర్ అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఆయనకు మద్ధతివ్వకూడదన్న ఆలోచనలో ఉన్నారు.