Begin typing your search above and press return to search.

వంశీపై అరెస్ట్ వారెంట్‌!... టీడీపీలో టెన్ష‌న్ టెన్ష‌న్‌!

By:  Tupaki Desk   |   3 April 2019 4:44 PM GMT
వంశీపై అరెస్ట్ వారెంట్‌!... టీడీపీలో టెన్ష‌న్ టెన్ష‌న్‌!
X
ఎన్నిక‌ల వేళ టీడీపీకి వ‌రుస దెబ్బ‌లు త‌గులుతున్నాయి. ఇప్ప‌టికే పార్టీలోని సిట్టింగ్ ఎంపీల‌తో పాటు ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు స‌మర్పించి నేరుగా వైరివ‌ర్గంలో చేరిపోయారు. మ‌రింత మంది కూడా అదే బాట‌లో ఉన్న‌ట్లుగానూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ త‌ర‌హా చేరిక‌ల‌తో వైసీపీలో జోష్ క‌నిపిస్తుండ‌గా... టీడీపీలో నైరాశ్యం క‌నిపిస్తోంది. ఇలాంటి త‌రుణంలోనే టీడీపీ నేత‌లే ల‌క్ష్యంగా జ‌రుగుతున్న ఐటీ - ఈడీ దాడులు... తాజాగా అరెస్ట్ వారెంట్లు ఆ పార్టీని తీవ్ర క‌ల‌వ‌రానికి గురి చేస్తున్నాయని చెప్పాలి. నిన్న‌టికి నిన్న సుజ‌నా చౌద‌రిపై ఈడీ దాడులు చేయ‌గా... నేటి ఉద‌యం క‌డ‌ప జిల్లా మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌ పై ఐటీ సోదాలు జ‌రిగాయి. ఈ వార్త‌ల నుంచి తేరుకునేలోగానే ఇప్పుడు మ‌రో సంచ‌ల‌న ప‌రిణామం చోటుచేసుకుంది. కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్లు ప‌ట్టుకుని తెలంగాణ పోలీసులు గ‌న్న‌వ‌రం సిట్టింగ్ ఎమ్మెల్యే - ప్రస్తుత ఎన్నిక‌ల్లో ఆ నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ అభ్య‌ర్థి వ‌ల్ల‌భ‌నేని వంశీమోహ‌న్‌ ను అరెస్ట్ చేసేందుకు చూస్తున్నారు.

నాంప‌ల్లి కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్లు ఏపీతో పాటు టీడీపీలో పెను క‌ల‌క‌ల‌మే రేపుతున్నాయి. అయినా వంశీపై జారీ అయిన నాన్ బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్లు ఎలా వ‌చ్చాయ‌న్న విష‌యంలోకి వెళితే... 2009లో వంశీ పై న‌మోదైన ఓ కేసుకు సంబంధించి ఇప్పుడు కోర్టు నుండి వారెంట్ జారీ అయింది. అప్పట్లో ప్ర‌భుత్వం త‌న‌కు ర‌క్ష‌ణ ఇవ్వ‌టం లేదంటూ ఆరోపించిన వంశీ త‌న‌కు తానున‌గా ప్రైవేటు సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న నివాసంలో అక్ర‌మంగా ఉంచిన ఆయుధాలు దొరికాయంటూ ఆయ‌న పై కేసు న‌మోదైంది. దీని పై విచార‌ణ జ‌రిగిన త‌రువాత త‌నపై న‌మోదైన కేసును కొట్టి వేయాల‌ని కోరుతూ వంశీ హైకోర్టులో క్వాష్ పిటీష‌న్ ను దాఖ‌లు చేసారు . వంశీ అభ్య‌ర్ద‌న మేర‌కు హైకోర్టు అప్పటికే జారీ అయిన వారెంట్ తో పాటుగా కేసును కొట్టి వేసింది.

ఇదే స‌మ‌యంలో నాంప‌ల్లి కోర్టులో ఈ కేసుకు సంబంధించి వంశీ హాజ‌రు కాలేదు. ఇదే విష‌యాన్ని ప‌ట్టుకున్న తెలంగాణ పోలీసులు తాజాగా కోర్టుకు హాజ‌రు కాలేద‌నే కార‌ణంతో కోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేయ‌గా కోర్టు వారెంట్ జారీ చేసింది. అయితే... రాజకీయ కక్షతోనే త‌మ‌ను వేధిస్తున్నార‌ని వంశీ ఆరోపిస్తున్నారు. ఈ కేసును హైకోర్టు కొట్టివేసంద‌ని ఆ ఉత్త‌ర్వు కాపీని తాను నాంప‌ల్లి కోర్టుకు నివేదిస్తాన‌ని వంశీ చెబుతు న్నారు. అయితే ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప్రచారం దాదాపు ముగింపున‌కు రావ‌టం.. ప్ర‌తీ నిమిషం కీల‌కంగా మారిన‌ స‌మ‌యంలో టీడీపీ ఆందోళ‌న‌కు గుర‌వుతోంద‌నే చెప్పాలి. మరి ఈ విష‌యం నుంచి వంశీ ఎలా బ‌య‌ట‌ప‌డ‌తారో చూడాలి.