Begin typing your search above and press return to search.

ఖేల్ రత్న: కాంగ్రెస్ నోరు తెరవకుండా మోడీ చక్రం

By:  Tupaki Desk   |   7 Aug 2021 3:03 PM IST
ఖేల్ రత్న: కాంగ్రెస్ నోరు తెరవకుండా మోడీ చక్రం
X
2014 వరకు యూపీఏ ప్రభుత్వంపై విసుగు చెందిన ప్రజలు కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే గుజరాత్ రాష్ట్రంలో వరుసగా విజయాలు సాధిస్తున్న మోదీ గ్రాఫ్ ను చూసిన దేశ ప్రజలు ఆయన ప్రధాన మంత్రిగా ఉంటే దేశం కూడా గుజరాత్ లా మారుతుందని ప్రజలు భావించారు. దీంతో అత్యధిక మెజారిటీతో గెలిపించడంతో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఏమాత్రం పోటీ లేకుండా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే గుజరాత్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రధానమంత్రి అయిన తరువాత మోడీలో చాలా మార్పులు వచ్చాయని అర్థమవుతోంది. ఆయన ప్రవర్తనలోనే కాకుండా పాలనలోనూ చాలా మార్పులు చేశారు. తాజాగా ఆయన క్రీడాకారులకు ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు పేరు మార్చడంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి.

క్రీడా రంగంలో విశిష్ట సేవలు అందించినందుకు గాను భారత ప్రభుత్వం రాజీవ్ ఖేల్ రత్న అవార్డుతో ఆటగాళ్లను సత్కరిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దీనిని ప్రవేశపెట్టడం వల్ల దీనికి రాజీవ్ ఖేల్ రత్న అని పేరు పెట్టారు. సాధారణంగా ఒక ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలకు పథకాలు ప్రవేశపెట్టినప్పుడు అవి ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంటే వేరే ప్రభుత్వం వచ్చినా వాటినే కొనసాగిస్తుంది. కానీ కొన్ని ప్రభుత్వాలు మాత్రం పథకాలు అవే ఉన్నా పేర్లు మార్చుతారు.ఇలా పేరు మార్చడం వల్ల ఎంత ప్రయోజనం పొందుతారోనన్న విషయం ఎవరికీ తెలియదు. కానీ ప్రభుత్వాలు మాత్రం తమ ఉనికిని కాపాడుకునేందుకు ఇలాంటివి చేస్తుంటాయి.

తాజాగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ అదే దారిలో వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తమ క్రీడాకారులకు ఇచ్చే అవార్డు పేరును మార్చి తన గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇలా చేయడం వల్ల విమర్శలు వస్తాయని కమలం నేతలు ముందే గ్రహించారు. అందుకే ఎవరినీ నొప్పించకుండా తమకు లాభం చేకూర్చే విధంగా కొత్త వ్యూహం రచించారు. క్రీడాకారులకు ఇచ్చే రాజీవ్ ఖేల్ రత్న అవార్డులో రాజీవ్ పేరు తీసేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇక్కడ కమలం నేతలు కాకుండా ప్రముఖ క్రీడాకారుడు ధ్యాన చంద్ పేరును చేర్చాలని అనుకుంటున్నారు. అయితే ఇలా చేయడంతో విమర్శలకు తావచ్చే అవకాశం ఉండదు.

ఈ అవార్డుకు ధ్యాన్ చంద్ పేరు పెట్టడం వెనక మరో రాజకీయ కోణం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. త్వరలో ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో ఇప్పటికే అధికారంలో ఉన్న బీజేపీపై కొంత వ్యతిరేకత వస్తుందని పార్టీ అధిష్టానం గ్రహించింది. మొన్నటి వరకు మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ మధ్య విభేదాలు వచ్చి సమసిపోయాయి. ఈ నేపథ్యంలో యూపీ ప్రజలను ఆకట్టుకునే గట్టి ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా యూపీకి చెందిన ధ్యాన్ చంద్ పేరు చేర్చి ఆకట్టుకునే ప్రయత్నం చేయాలనుకుంటున్నారని చర్చించుకుంటున్నారు.

తాజాగా టోక్యో ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం సాధించింది. మహిళల జట్టు చివరి వరకు పోరాడి నాలుగో స్థానంలో నిలిచింది. సందర్భం ఇదే అన్నట్లు మోడీ ధ్యాన్ చంద్ పేరు పెట్టారు. దీంతో అటు హాకీ క్రీడకు ఆదరించడంతో పాటు మరోవైపు యూపీకి చెందిన వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చినట్లు మోడి ఖేల్ రత్న అవార్డుకు ఆ పేరు పెట్టారు. దీంతో రెండు వైపులా ప్రభుత్వానికి పేరు వచ్చేలా పథకం వేశారని అంటున్నారు. అయితే బీజేపీ నాయకులు కూడా హాకీ క్రీడకు మోదీ అత్యున్నత గౌరవం ఇచ్చారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నాయకులు ఈ పేరు మార్పుపై ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు.