Begin typing your search above and press return to search.

నామా వెనకడుగు.. కారణం అదేనా.?

By:  Tupaki Desk   |   28 Oct 2018 2:30 PM GMT
నామా వెనకడుగు.. కారణం అదేనా.?
X
తెలంగాణ ఎన్నికల సమీపిస్తున్న కొద్ది పార్టీల్లో ఉత్కంఠ ఎక్కువైపోతుంది. మహా కూటమి కూడా అభ్యర్థులను తేల్చేసే పనిలో పడిపోయింది. ఈ క్రమంలో ఖమ్మం నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయం కొలిక్కి రావడం లేదట. టీడీపీ నుంచి పోటీకి మొన్నటి వరకు సిద్ధంగా ఉన్న నామా నాగేశ్వరరావు ఇప్పుడు అయిష్టత చూపడమే ఇందుకు కారణం.

కూటమిలో కాంగ్రెస్ - టీడీపీల మధ్య టిక్కెట్ ఓ రేంజ్ లో సాగుతోంది. ఇటువంటి తరుణంలో టీడీపీ అధిష్ఠానమే అభ్యర్థిగా ప్రకటించి పోటీ చేయాలని కోరుతున్నా, నామా నాగేశ్వరరావు దోబూచులాడుతున్నారట. చివరికి ఆయనే పోటీ చేస్తారని కార్యకర్తలకు పలువురు నేతలు హింట్ ఇస్తుండటంతో, అసలు ఖమ్మం బరిలో ఎవరుంటారో తెలియక అయోమయానికి గురవుతున్నారు.

గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన పువ్వాడ అజయ్ కుమార్ గెలుపొందారు. ఆ తరువాత ఆయన టీఆర్ఎస్ లో చేరిపోయారు. టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తుమ్మల నాగేశ్వరరావు కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేయడానికి ఆశావహులు ఎక్కువయ్యారు. కానీ, పార్టీ అధిష్టానం మాత్రం నామా నాగేశ్వరరావు వైపు మొగ్గు చూపుతున్నా, ఆయన నుంచి మాత్రం స్పందన రావడం లేదు.

కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు గాయత్రి రవి - పొంగులేటి సుధాకర్ రెడ్డితో సహా మరికొంత మంది నేతలు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. కూటమి మాత్రం టీడీపీకే ఖమ్మం సీటు అంటున్నా - నామా నాగేశ్వరరావు పోటీపై స్పష్టత ఇవ్వడం లేదు. ఇందుకు పలు కారణాలు లేకపోలేదు. టీడీపీలో కీలకంగా వ్యవహరించిన తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారుతున్నప్పుడు అడ్డుకోక పోగా, ఆయనతో పాటు వెళ్లిపోతున్న క్యాడర్ ను కూడా నామా నిలువరించలేకపోయారట.

అంతేగాక, 2014లో టీడీపీ ఓటమి పాలయ్యాక నామా నాగేశ్వరరావు సైలెంట్ అయిపోయారు. ఈ ఎన్నికలకు 6 నెలల ముందు నుంచే పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. క్యాడర్ కూడా ఆశించిన మేర లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఖమ్మం అసెంబ్లీకి పోటీ చేయడం వల్ల తనకు అంతగా కలిసి రాదనే ఆలోచనలో నామా నాగేశ్వరరావు ఉన్నట్లు తెలుస్తుంది. 2019లో ఎంపీగా పోటీ చేయాలని కూడా భావిస్తున్నారు. ఈ తరుణంలో ఖమ్మం నుంచి ఎవరు పోటీ చేస్తారో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.