Begin typing your search above and press return to search.

నామా పేరు మార్చేస్తున్నారు.. మ‌హా సుడిగాడ‌ట‌!

By:  Tupaki Desk   |   22 March 2019 10:39 AM GMT
నామా పేరు మార్చేస్తున్నారు.. మ‌హా సుడిగాడ‌ట‌!
X
కొన్నిసార్లు అంతే. రాత్రికి రాత్రి సుడి తిరిగిపోతుంది. ఒక్క నిర్ణ‌యం. ఒకే ఒక్క నిర్ణ‌యంతో నిన్న మొన్న‌టివ‌ర‌కూ ఎవ‌రికి ప‌ట్ట‌ని మాజీ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు ఇప్పుడు తెలంగాణ‌లో హాట్ టాపిక్ గా మారిపోయారు. ఎక్క‌డ చూసినా ఆయ‌న మాటే. ఎక్క‌డ చూసినా ఆయ‌న చ‌ర్చే. మొన్న‌టికి మొన్న జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన ఆయ‌న ఓట‌మిపాలయ్యారు.

ఆయ‌నెంత క‌ష్ట‌ప‌డినా తెలంగాణ ప్ర‌జ‌లు ఆయ‌న్ను రిజెక్ట్ చేసిన‌ట్లుగా ప‌లువురి నోట వినిపించింది. ఎన్నిక‌ల త‌ర్వాత నామా బ‌య‌ట‌కు రావ‌టం త‌గ్గించేశారు. ఆ త‌ర్వాత ప‌రిణామాల‌తో టీఆర్ఎస్ లో చేరాల‌న్న ప్ర‌య‌త్నాలు షురూ చేశారు. చంద్ర‌బాబుకు అత్యంత ఆఫ్తుల్లో ఒక‌రిగా గుర్తింపు పొందిన నామా టీఆర్ ఎస్ లో చేర‌ట‌మా? అని ప‌లువురు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు.

అలాంటి వారి విస్మ‌యం నుంచి బ‌య‌ట‌కు రాక ముందే.. నామా మాత్రం గులాబీ కారులో ఎక్కే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. కేటీఆర్ ను క‌న్వీన్స్ చేసిన నామా.. కొడుకు ద్వారా తండ్రి వ‌ద్ద‌కు రాయ‌బారాన్ని పంపిన‌ట్లుగా చెబుతారు. అయితే.. నామా విష‌యంలో కేసీఆర్ నెగిటివ్ గా ఉన్నార‌ని.. ఆయ‌న ఇమేజ్ తెలుసా? ప‌్ర‌జ‌ల్లో మంచి పేరు లేదు.. అలాంటి నేత‌ను పార్టీలోకి తీసుకొస్తే ప్ర‌జ‌ల్లోకి చెడు సంకేతాలు పంపిన‌ట్లు అవుతుంద‌న్న మాట కేసీఆర్ చెప్పిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి.

అయిన‌ప్ప‌టికి ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడు త‌ర‌హాలో నామా చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించింద‌ని చెప్పాలి. పార్టీలో ఎంట్రీనే ఇవ్వ‌ట‌మే కాదు.. అడుగు పెడుతూనే పార్టీ ఎంపీ టికెట్ తీసుకున్న ఆయ‌న తీరు ఇప్పుడు టీఆర్ ఎస్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ మ‌న‌సు దోచేసుకున్న ఆయ‌న తీరు ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌గా మార‌ట‌మే కాదు.. నామా మ‌హా సుడిగాడు భ‌య్ అంటూ ఆయ‌న్ను విప‌రీతంగా పొగిడేస్తున్నారు. అధినేత‌ను క‌న్వీన్స్ చేయ‌టం పార్టీలో ఎంతో కాలం నుంచి ఉన్న వారి వ‌ల్లే కాద‌ని.. అలాంటిది కేసీఆర్ మ‌న‌సులో నెగిటివ్ ఇమేజ్ ఉన్న నామా.. దాన్ని అధిగ‌మించి టికెట్ సొంతం చేసుకోవ‌టం మామూలు విష‌యం కాదంటున్నారు. ఇంత‌కీ.. నామా సుడి తిరిగిపోవ‌టంలో కీల‌క‌భూమిక ఎవ‌ర‌న్న‌ది ఇప్పుడు స‌మాధానం లేని ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్పాలి.