Begin typing your search above and press return to search.

మాజీ ఎంపీలు మునిగిపోతున్నారు

By:  Tupaki Desk   |   3 Nov 2016 7:34 AM GMT
మాజీ ఎంపీలు మునిగిపోతున్నారు
X
నిన్న కావూరి సాంబశివరావు.. నేడు నామా నాగేశ్వరరావు. ఇద్దరూ మాజీ ఎంపీలే. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించలేక వీధిన పడుతున్నారు. భారీ ఎత్తున చేపట్టిన ప్రాజెక్టులు సకాలంలో పూర్తికాక అడ్డంగా బుక్ అవుతున్నారు. రుణాల విషయంలో బ్యాంకులు - ఆర్థిక సంస్థలు గట్టిగా వ్యవహరిస్తుండడంతో ఆర్థిక సమస్యలతో విలవిలలాడుతున్నారు.

కావూరి వ్యాపార సామ్రాజ్యం దాదాపుగా కనుమరుగైందనే అంటున్నారు. ఇప్పుడు ఖమ్మం మాజీ ఎంపీ - టీడీపీ నేత నామా నాగేశ్వరరావు కూడా అప్పుల అప్పారావయ్యారు. ఎంపీగా ఉన్న సమయంలో ఎడాపెడా అనుమతులు తెచ్చుకుని చేపట్టిన ప్రాజెక్టులన్నీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉండడంతో బిల్లులు అందక... మరోవైపు తీసుకున్న అప్పులు తీర్చలేక నామా చిక్కుల్లో పడ్డారు.

నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ గ్రూపు అనేక ఇన్ ఫ్రా ప్రాజెక్టులను చేపట్టింది. ఇప్పుడు టీడీపీ అనుకూల ప్రభుత్వమే కేంద్రంలో ఉన్నా కూడా నామాకు కష్టాలు తప్పలేదు. పర్యావరణ అనుమతులు సకాలంలో రాకపోవడంతో పవర్ - రోడ్ ప్రాజెక్టులు కొన్ని ముందుకు కదలలేదు. వీటి కోసం సుమారు 20 బ్యాంకులు - ఆర్థిక సంస్థల నుంచి నామా రుణాలు తీసుకున్నారు. ఇప్పుడు వాటికి ఈఎంఐలు కూడా కట్టకపోవడంతో టాటా క్యాపిటల్ - యూనియన్ బ్యాంకు - ఐడీబీఐ - ఎస్బీఐలు కోర్టుకెళ్లాయి.

ఇది చాలదన్నట్లు ఇప్పుడు వ్యవహారం ఆస్తుల స్వాధీనం వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. మధుకాన్ సంస్థకు అడ్మినిస్ట్రేటివ్ భవనంగా ఉన్న ఢిల్లీలోని ఆయన ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు నోటీసులు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే... మధుకాన్ ఎండీగా ఉన్న నామా నాగేశ్వరరావు తమ్ముడు సీతయ్య పేరిట ఈ నోటీసులు జారీ అయ్యాయి. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్రాజెక్టులు చేపట్టిన ఎంపీలు, మాజీ ఎంపీలంతా దెబ్బతింటున్నారు. ఎంపీ సుజనా చౌదరి కూడా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించక కేసుల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/