Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ పార్టీలోకి నాగ్ వ‌స్తున్నారా?

By:  Tupaki Desk   |   6 July 2017 3:40 PM GMT
జ‌గ‌న్ పార్టీలోకి నాగ్ వ‌స్తున్నారా?
X
ఇటీవ‌ల కాలంలో ఏపీ విపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద చిత్ర విచిత్ర‌మైన వార్త‌ల్ని వండేయ‌టం క‌నిపిస్తోంది. జ‌రిగిన విష‌యాల‌కు సైతం కొత్త అర్థాల్ని వెతికి మ‌రీ డ్యామేజింగ్ గా వార్త‌ల్ని ఇవ్వ‌టం ఈ మ‌ధ్య‌న అల‌వాటైంది. అధికార‌ప‌క్షం మీద అయితే కేసులు.. వ‌గైరా.. వ‌గైరా ఉంటాయి కానీ.. అధికారానికి దూరంగా ఉండే విపక్షం చేసేదేమీ ఉండ‌దు కాబ‌ట్టి మ‌రింత పెట్రేగిపోతున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా స‌రికొత్త వాద‌న‌ను తెర మీద‌కు తీసుకొస్తూ బ్రేకింగ్ న్యూస్ వేసేశారు. ఇంత‌కీ ఆ బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే.. టాలీవుడ్ మ‌న్మ‌ధుడు.. వ్యాపార‌వేత్త అయిన నాగార్జున రాజ‌కీయాల్లోకి రానున్న‌ట్లుగా వార్త‌లు ఇచ్చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి నాగ్ అడుగు పెడుతున్నార‌ని.. ఇందుకు త‌గిన సెట‌ప్ ను సిద్ధం చేశార‌ని.. రేపో.. మాపో రాజ‌కీయ రంగ ప్ర‌వేశం ఖాయ‌మ‌న్న రీతిలో వార్త‌ల్ని ఇచ్చేస్తున్నారు.

నిజంగానే అలాంటి ప‌రిస్థితి ఉందా? అంటే.. లేద‌నే మాట వినిపిస్తోంది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. జ‌గ‌న్‌పార్టీలోకి నాగ్ వ‌స్తార‌న్న టాక్ ఎప్ప‌టి నుంచో వినిపిస్తున్నా.. అలాంటిదేమీ లేద‌న్న విష‌యాన్ని నాగ్ స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రి..నిజం లేని ఇలాంటి వార్త‌ల్ని ఎందుకు తెర మీద‌కు తెస్తున్న‌ట్లు అన్న దానికి ఆస‌క్తిక‌ర‌మైన వాద‌న‌ను వినిపిస్తున్నారు.

ప‌లువురు ప్ర‌ముఖులు విప‌క్ష పార్టీలోకి వ‌స్తున్నార‌ని చెప్ప‌టం.. అదేమీ లేద‌ని వారు ఖండించ‌టం ద్వారా.. విపక్ష పార్టీలోకి రావాల‌నుకొని కూడా రావ‌టం లేదంటూ బుర‌ద జ‌ల్లే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టేందుకు వీలుగా ఇలాంటివి చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. దీని వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నం ఏమిటంటే.. విప‌క్ష పార్టీలోకి రావాల‌న్న ఆస‌క్తి ఏ ప్ర‌ముఖుడు ప్ర‌ద‌ర్శించ‌టం లేద‌న్న భావ‌న మ‌న‌సుల్లో నాటే బృహ‌త్త‌ర ప్ర‌ణాళిక‌లో భాగంగా ఇలాంటి వార్త‌లు అప్పుడ‌ప్ప‌డు తెర మీద‌కు తెస్తున్నార‌న్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. జ‌గ‌న్ పార్టీని దెబ్బ తీసేందుకే ఈ త‌ర‌హా ప్ర‌య‌త్నాల్ని చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.