Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్: 'నగరి'పై ఎవరి గురి నెగ్గేనో..?

By:  Tupaki Desk   |   29 March 2019 9:12 AM GMT
గ్రౌండ్ రిపోర్ట్: నగరిపై ఎవరి గురి నెగ్గేనో..?
X
అసెంబ్లీ నియోజకవర్గం: నగరి

వైసీపీ: ఆర్‌.కె.రోజా
టీడీపీ: గాలి భానుప్రకాశ్‌

చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం గురించి తెలియని వారుండరు. ఎందుకంటే ఇక్కడ ప్రాతినిథ్యం వహిస్తున్నది.. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన వైసీపీ ఎమ్మెల్యే రోజా.. సీనియర్ నటిగానూ ఆమె రాష్ట్ర ప్రజలకు సుపరిచితమే. అటు సినీ నటిగా.. ఇటు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజల్లో ముద్ర వేసుకున్న రోజా వైసీపీ నుంచి మరోసారి బరిలోకి దిగుతున్నారు. ఇక టీడీపీలో టికెట్‌ కోసం చివరకు పోటాపోటీ నెలకొన్నా చివరకు గాలిముద్దుకృష్ణమనాయుడు కుమారుడు భానుప్రకాశ్‌ కే కేటాయించారు చంద్రబాబు. అయితే అసమ్మతిని చల్లార్చిన భాను ప్రకాశ్‌ అందరిని కలుపుకుపోతాడా..? లేదా..? అనేది చూడాలి. మొత్తం మీద నగరిలో ఈసారి సార్వత్రిక పోరు బలమైన రోజా వర్సెస్ కొత్తముఖమైన భానుప్రకాష్ మధ్య హాట్‌ హాట్‌గా సాగుతోంది.

* నగరి అసెంబ్లీ నియోజకవర్గం చరిత్ర

మండలాలు:నగరి - పుత్తూరు - నిండ్రా - విజయపురం - వడమాలపేట
ఓటర్లు: లక్షా 80 వేలు

1962లో నియోజకవర్గం ఏర్పడింది. మొదటిసారిగా ఈ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి గోపాల్‌ రాజు విజయం సాధించారు. 1994లో సినీ నిర్మాత దొరస్వామి ఈ నియోజకవర్గం నుంచే అసెంబ్లీకి వెళ్లారు. ఆ తరువాత కాంగ్రెస్‌ నుంచి చెంగారెడ్డి - టీడీపీ నుంచి గాలి ముద్దుకృష్ణమనాయుడు ఎక్కువసార్లు గెలుపొందారు. బీసీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఇక్కడ ఆ తరువాతి స్థానంలో కమ్మ - రెడ్డి సామాజిక వర్గ ఎక్కువగా ఉంటుంది.

* రెండోసారి రోజా పాగా వేసేనా..?

కాంగ్రెస్‌ - టీడీపీకి మాత్రమే కంచుకోటగా ఉన్న నగరి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో రోజా మొదటిసారి వైసీపీ తరుపున గెలుపొందారు. దివంగత నేత - మంత్రి బలమైన గాలి ముద్దుకృష్ణమనాయుడిపై స్వల్ప మెజారిటీతో గెలిచారు. టీడీపీ కంచుకోటను రోజా ఎట్టకేలకు బద్దలు కొట్టి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తన కలను నెరవేర్చుకున్నారు. టీడీపీలో కొనసాగిన రోజా రెండుసార్లు పోటీ చేసినా గెలవలేదు. కానీ నగరి నియోజకవర్గంలో వైసీపీ తరుపున పోటీ చేయడంతో విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఆమె ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ రకరకాలుగా నిరసనలు చేపట్టారు. ఏడాది కిందట ముఖ్యమంత్రిపై కాల్‌ మనీ వ్యవహారంలో ఆరోపణలు చేసిన నేపథ్యంలో అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌ కు గురయ్యారు. ఆ తరువాత మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. దీంతో ఆమెను ఫైర్‌ బ్రాండ్‌ గా పిలుచుకుంటారు కొందరు. ఇక నియోజకవర్గంలోనూ రోజా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. తాగునీటి సమస్య నివారణకు బోర్లు వేయించడం.. పాఠశాలల్లో మౌళిక వసతులు - వైఎస్ ఆర్ పేరిట ఉచిత అన్నదానం.. యువకులకు అవకాశాల కోసం ఆర్థికసాయాలు.. తన రోజా ట్రస్ట్ పేరిట ఎన్నో సేవాకార్యక్రమాలు చేసి సొంత ఖర్చుతో ప్రజలకు సేవ చేసి.. ఈ ఐదేళ్లలో ఎంతో బలమైన నేతగా ఎదిగారు. ఈ నేపథ్యంలో రోజాను నగరిలో ఎదుర్కోవడం టీడీపీకి సవాల్ గా మారింది. ఈ ఎన్నికల్లో కూడా విస్తృతంగా పర్యటిస్తూ గెలుపు కోసం రోజా కృషి చేస్తున్నారు.

* అనుకూలతలు:

- సొంత నిధులతో శుద్ధ జల కేంద్రాలు ఏర్పాటు చేయడం - చాలా సేవా కార్యక్రమాలు చేయడం..
- వ్యక్తిగతంగా సామాజిక సేవకార్యక్రమాలు చేపట్టడం
- నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉండడం

* ప్రతికూలతలు:

- గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలుపొందడం
- నియోజకవర్గంలో అందుబాటులో ఉండరనే వాదన
- ఆశించినమేర అభివృద్ధి చేయలేదనే ఆరోపణలు

* ‘తండ్రి’ - టీడీపీ సెంటిమెంట్‌ బలంతో భానుప్రకాశ్‌ ముందుకు..

దివంగత మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి భానుప్రకాశ్‌ సెంటిమెంట్‌ అస్త్రంతో ఈ ఎన్నికల బరిలో దిగుతున్నారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన ముద్దుకృష్ణమనాయుడు స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం సాధించారు. ఆయన మరణాంతరం వీరి కుటుంబంపై జనాల్లో సానుభూతి పెరిగింది. కుటుంబంలో వారసత్వ పోరు సాగింది. ఆయన ఇద్దరు కుమారులు నియోజకవర్గ టికెట్‌ కోసం ఎవరికి వారే తీవ్రంగా ప్రయత్నించారు. మరోవైపు విద్యాసంస్థల అధినేత అశోక్‌ సైతం సీటు దక్కించుకునేందుకు స్కెచ్‌ వేశారు. అయితే పార్టీ అధినేత చంద్రబాబు కలగజేసుకొని ఇద్దరు ఒక్కటైతే మీ కుటుంబానికే టికెట్‌ ఇస్తామని గాలి సోదరులకు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. దీంతో గాలి భానుప్రకాశ్‌కు టికెట్‌ కేటాయించారు. అయితే టికెట్ల కోసమే ఇంత ఫైట్ చేసుకున్న వీరు గెలుపు కోసం కలిసి పనిచేస్తారా లేదా అన్నది వేచిచూడాలి. అధికార టీడీపీ అండదండలు, తండ్రి వారసత్వ ఇమేజ్ తో వీరు ముందుకు వెళుతున్నారు.

* అనుకూలతలు:

- తండ్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు సానుభూతి ఉండడం
- సామాజికంగా బలమైన వర్గానికి చెందిన నేత
- వైసీపీపై వస్తున్న వ్యతిరేకత

* ప్రతికూలతలు:

-మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేయడం
-అసమ్మతివాదుల బెడద తీవ్రం

* రోజా వర్సెస్ భానుప్రకాష్.. నగరి విజయం ఎవరిదో..?

నగరి నియోజకవర్గంలో భూగర్భజలాలు కలుషితం కావడంతో కిడ్నీ సమస్య తీవ్రమైంది. అయితే శుద్దనీరు అందించేందుకు ఎమ్మెల్యే చెంగారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఈటీపీ ప్లాంటు మంజూరు చేయించినా ఇప్పటివరకు ఆ నిర్మాణాన్ని ఏ ఎమ్మెల్యే పూర్తి చేయలేదు. ఎమ్మెల్యే రోజా సొంత నిధులతో చాలా వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయించి అందించారు. అయితే ప్రధానంగా ఈ ప్రభావం పోటీ చేస్తున్న అభ్యర్థులపై పడుతోంది. ఈ సమస్య పరిష్కారం చూపిస్తామని అటు టీడీపీ - వైసీపీ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. అయితే స్పష్టమైన హామీ ఇచ్చేవారికే తమ ఓటు అను నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ఐదేళ్లలో బలమైన నేతగా ఎదిగిన రోజా ఒకవైపు.. బలమైన కుటుంబ నేపథ్యం సెంటిమెంట్ అధికార తోడ్పాటుతో భాను ప్రకాష్ మరో వైపు ఉన్నారు. ఈ నేపథ్యంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే రోజానా..? లేక కొత్తగా పోటీ చేస్తున్న భాను ప్రకాశ్‌ను ప్రజలు గట్టెక్కిస్తారా..? అనేది చూడాలి.